రజాకార్ సినిమా నిలిపి వేయండి: ఎన్నికల కమిషన్ కు రావి మనువరాలు వినతి

తెలంగాణ సాయుధ పోరాటాన్ని మత పర పోరాటంగా వక్రీకరిస్తూ తీసిన రజాకార్ సినిమాను, టీజర్‌ను నిలిపివేయాలంటూ రావి నారాయణరెడ్డి మనువరాలు రావి ప్రతిభారెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు

విధాత : తెలంగాణ సాయుధ పోరాటాన్ని మత పర పోరాటంగా వక్రీకరిస్తూ తీసిన రజాకార్ సినిమాను, టీజర్‌ను నిలిపివేయాలంటూ పద్మవిభూషణ్‌, మాజీ ఎంపీ రావి నారాయణరెడ్డి మనువరాలు రావి ప్రతిభారెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రజాకార్ సినిమాలో వాస్తవాలను కప్పి పుచ్చి, తెలంగాణ సాయుధ పోరాటాన్ని మతపర పోరాటంగా చిత్రీకరించారన్నారు.

సాయుధ పోరాటంలో నాలుగువేల మంది అమరులయ్యారని, అంతటి గొప్ప పోరాట చరిత్రకు సినిమాలో గంతలు కట్టి మతపరంగా జరిగిన పోరాటంగా వక్రీకరించారన్నారు. మొహినోద్ధిన్‌, షోయబుల్లాఖాన్ వంటి వారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. వాస్తవాలను విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసమే రజాకార్ సినిమాను తీశారని, సినిమాను నిలిపివేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లుగా తెలిపారు.