Realme | మార్కెట్‌లోకి రెండు రియల్‌మీ కొత్త ఫోన్‌లు.. ధర తక్కువ, ఫీచర్స్‌ ఎక్కువ..!

  • Publish Date - March 7, 2024 / 05:52 AM IST

Realme: ప్రముఖ మొబైల్‌ ఫోన్‌ల తయారీ కంపెనీ రియల్‌మీ మార్కెట్‌లోకి మరో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చింది. రియల్‌మీ 12 సిరీస్‌లో రియల్‌మీ 12 5జీ (Realme 12 5G), రియల్‌మీ 12+ 5జీ (Realme 12+ 5G) పేరిట రెండు కొత్త మొబైల్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. మధ్యతరగతి కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఫోన్‌లన లాంచ్‌ చేశారు. ఈ రెండు ఫోన్‌లు కంపెనీ తాజా యూఐ ఆధారిత ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌తో వచ్చాయి. రెండేళ్లపాటు ఓఎస్‌, మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని రియల్‌మీ తెలిపింది.

రియల్‌మీ 12 5జీ

ఈ ఫోన్‌కు మీడియా టెక్‌ డైమెన్సిటీ 6100+ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ ఇచ్చారు. 120Hz రీఫ్రెష్‌ రేటు, 650 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.72 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ తెర ఉంటుంది. 45W SuperVOOC ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఉంది. వెనుకవైపు 108 MP ప్రధాన కెమెరాను, సెల్ఫీల కోసం ముందువైపు 8 MP ఏఐ కెమెరా ఇచ్చారు. బ్లూటూత్‌ 5.2, వైఫై 5, టైప్‌-సి పోర్టు, జీపీఎస్‌, క్యూజెడ్‌ఎస్‌ఎస్‌, గెలీలియో, Glonass వంటి ఫీచర్‌లు ఉన్నాయి.

ట్విలైట్ పర్పుల్, ఉడ్‌ల్యాండ్‌ గ్రీన్‌ రెండు రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.16,999 గా నిర్ణయించారు. దీనిపై ప్రారంభ ఆఫర్‌ కింద కంపెనీ రూ.2,000 డిస్కౌంట్‌ కూపన్ అందిస్తోంది. అదేవిధంగా 8జీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.17,999. బ్యాంక్‌ ఆఫర్‌ కింద రూ.1,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద మరో రూ.1,000 వరకు డిస్కౌంట్‌ ఉంటుంది.

రియల్‌మీ 12+ 5జీ

రియల్‌మీ 12+ 5జీ ఫోన్‌.. మీడియా టెక్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో వచ్చింది. రియల్‌మీ యూఐ 5.0 ఆధారిత ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌ను ఇచ్చారు. 67W SuperVOOC ఛార్జర్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు. 120Hz రీఫ్రెష్‌ రేటు, గరిష్ఠంగా 2000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.67 అంగుళాల అల్ట్రా స్మూత్‌ ఓఎల్‌ఈడీ తెర ఉంది. వెనుక 50 MP ప్రధాన కెమెరా, ముందువైపు 16 ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.

వైఫై 6, బ్లూటూత్‌ 5.2, టైప్‌-సి పోర్టు, జీపీఎస్‌, క్యూజెడ్‌ఎస్‌ఎస్‌, గెలీలియో, Glonass ఫీచర్‌లు ఉన్నాయి. పయోనీర్‌ గ్రీన్‌, నావిగేటర్‌ బీజ్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.20,999గా నిర్ణయించారు. ప్రారంభ ఆఫర్‌ కింద రూ.1,000 తగ్గింపు డిస్కౌంట్‌ ఉంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.21,999. రెండు వేరియంట్లపై బ్యాంక్‌ ఆఫర్‌ కింద రూ.1,000 అదనంగా తగ్గిస్తారు.

Latest News