WhatsApp Testing Multi-Account Support on iPhone: How It Works, Security, Limits and More
(విధాత టెక్ డెస్క్)
ఇప్పటివరకు ఐఫోన్‌లో ఒకేసారి ఒకే వాట్సాప్ అకౌంట్ వాడాల్సి వచ్చేది. మరో నంబర్‌తో చాట్ చేయాలంటే వెరే iPhone, WhatsApp Business యాప్ లేదా వెబ్ వంటి గారడీలు చేయాల్సివుండేది. ఇప్పడు రెండు నెంబర్లున్న ఒకే ఐఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్లు వాడుకునే సౌకర్యం త్వరలొనే అందుబాటులోకి రాబోతోంది. నిజానికి ఆండ్రాయిడ్ యూజర్లకు 2023 నుంచే ఈ మల్టీ అకౌంట్ సపోర్ట్ వచ్చేసింది. అదే సౌలభ్యం ఇప్పుడు iOS వైపు అడుగులేస్తోంది.
టెస్ట్‌ఫ్లైట్ (TestFlight – ఇది iOS బీటా వర్షన్ యాప్‌లను పరీక్షించే ప్లాట్‌ఫాం)లో కొత్తగా కనిపిస్తున్న వాట్సప్ బీటా యాప్, ఒకే ఐఫోన్‌లో రెండు వేర్వేరు వాట్సాప్ అకౌంట్లు వాడుకునే వీలు కల్పిస్తోంది. ఇప్పుడు డ్యూయల్ సిమ్ ఐఫోన్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఒక ఆఫీస్ లేదా బిజినెస్ నెంబర్, మరొక పర్సనల్ నెంబర్ (personal) కోసం రెండు వాట్సప్ అకౌంట్లు వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్‌లో రెండు అకౌంట్లు వేర్వేరుగా ఉంటాయి. కానీ, ఐఫోన్‌లో ఒకే అకౌంట్ కనబడుతుంది. కానీ, అది రెండు నంబర్ల మధ్య అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఇక్కడ విశేషమేమిటంటే, ఏ నెంబర్ సమాచారం దానిదే. ఒకదానితో ఇంకొకదానికి సంబంధమే ఉండదు. అంతేకాదు, ప్రతి అకౌంట్‌కి సెట్టింగ్స్, చాట్స్, నోటిఫికేషన్స్, ప్రైవసీ ఆప్షన్లు కూడా పూర్తిగా వేరే వేరేగా పనిచేస్తాయి. జస్ట్, రెండు సెకన్లలో అదే అకౌంట్‌లో నుండి వేరే నంబర్ వాట్సప్‌కు మారొచ్చు.
ఐఫోన్‌లో రెండు వాట్సప్‌లు ఎలా పని చేస్తాయి?
Apple అధికారిక బీటా ప్లాట్‌ఫామ్ అయిన TestFlightలో కొత్తగా విడుదలైన WhatsApp బిల్డ్‌లో “Account List” అనే సెక్షన్ కొత్తగా వచ్చింది. యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచే రెండో అకౌంట్‌ను యాడ్ చేయడం, మార్చడం చేయవచ్చు.
ఇలా అకౌంట్ల మధ్య మారడానికి WhatsApp మూడు మార్గాలు ఇస్తోంది:
- Settings → Account List లోకి వెళ్లి, కావలసిన అకౌంట్ ఎంచుకోవడం
- స్క్రీన్ దిగువన ఉన్న Settings ట్యాబ్‌ను కొంచెం సేపు నొక్కిపట్టడం (long press) – వెంటనే అకౌంట్ల జాబితా కనిపిస్తుంది
- Settings ట్యాబ్‌పై డబుల్ ట్యాప్ చేయగానే, నేరుగా మరో అకౌంట్‌కు జంప్ అవుతుంది
ఈ మల్టీ అకౌంట్ సిస్టమ్‌లో, ప్రస్తుతం ఒక్క ఐఫోన్‌లో గరిష్టంగా రెండు అకౌంట్లకు మాత్రమే సపోర్ట్ ఉంది. ప్రతి అకౌంట్‌కి తనకంటూ:
- ప్రత్యేక చాట్ హిస్టరీ
- వేరే బ్యాకప్ సెట్టింగ్స్
- తనకు నచ్చిన నోటిఫికేషన్ టోన్స్
- ప్రైవసీ/లాస్ట్ సీన్/ప్రొఫైల్ ఫోటో వంటి విడివిడి సెట్టింగ్స్
ఇలా ఉండటం వల్ల, ఉదాహరణకు – ఆఫీస్ అకౌంట్ నోటిఫికేషన్స్ మ్యూట్‌లో పెట్టి, వ్యక్తిగత అకౌంట్‌నే యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. లేదా ఫ్యామిలీ గ్రూప్‌లను ఒక అకౌంట్‌లో మాత్రమే ఉంచి, మరో అకౌంట్‌ను పూర్తిగా ఆఫీస్‌కు మాత్రమే కేటాయించవచ్చు.
నోటిఫికేషన్ వస్తే, WhatsApp ఇప్పుడు స్పష్టంగా “ఈ మెసేజ్ ఏ అకౌంట్‌కి వచ్చింది?” అని కూడా చూపిస్తుంది. తద్వారా “ఆఫీస్ మెసేజ్‌కి పర్సనల్ నంబర్ నుండి రిప్లై ఇచ్చానేమో?” అన్న గందరగోళం కూడా ఉండదు..
రెండో వాట్సప్ అకౌంట్ యాడ్ చేయడం ఎలా? ఇతర వివరాలు
WABetaInfo అందించిన సమాచారం ప్రకారం, iPhoneలో రెండో WhatsApp అకౌంట్‌ను యాడ్చేసే మూడు ప్రధాన మార్గాలు ఇవి:
-
క్రొత్త నంబర్‌తో కొత్త అకౌంట్
- ఇంతకు ముందు WhatsAppలో ఎప్పుడూ రిజిస్టర్ చేయని నంబర్‌తో కొత్త అకౌంట్ క్రియేట్ చేయవచ్చు.
- One Time Password (OTP) వెరిఫికేషన్ పూర్తయ్యాక, అది రెండో అకౌంట్‌గా చేరిపోతుంది.
-
ఇప్పటికే ఉన్న అకౌంట్‌ను జతచేయడం
- మరో ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్‌లో వాడుతున్న WhatsApp నంబర్‌ని,
- లేదా WhatsApp Businessలో యాక్టివ్‌గా ఉన్న అకౌంట్‌ను
- iOS యాప్‌లో రెండో అకౌంట్‌గా జతచేయొచ్చు.
-
Companion account – QR కోడ్ ద్వారా
- మరో ఫోన్‌లో ఉన్న అకౌంట్‌ని iPhoneకి “companion account”లా కలపవచ్చు.
- స్క్రీన్‌పై చూపించే QR కోడ్‌ను ఆ డివైస్‌తో స్కాన్ చేయగానే, చాట్‌లు, సెట్టింగ్స్, మీడియా ఫైళ్లన్నీ సింక్ అవుతాయి.
ఈ మూడు మార్గాల్లో ఏదైనా ఎంచుకున్నా, ఒకసారి లింక్ అయిన తర్వాత రెండో అకౌంట్ కూడా ఫుల్ ఫంక్షనల్ అవుతుంది. చాట్స్, స్టాటస్, కమ్యూనిటీలు – అన్నీ ఆ అకౌంట్‌కు వేరేగా కనిపిస్తాయి.
భద్రత: App Lock ఇంటిగ్రేషన్
మల్టీ అకౌంట్ సిస్టమ్ App Lockతో కలిసి పనిచేస్తుంది. అంటే:
- ఏదైనా అకౌంట్ App Lock ద్వారా లాక్ అయిఉంటే,
- ఆ అకౌంట్‌కి మారేటప్పుడు Face ID / Touch ID / పాస్‌కోడ్ తప్పనిసరి.
ఒకే ఫోన్‌ను ఇద్దరు లేదా ఎక్కువ మంది వాడే పరిస్థితుల్లో, ప్రతి ఒక్కరి అకౌంట్‌కు వేర్వేరు లాక్ పెట్టుకోవచ్చు. దీని వల్ల వాట్సాప్‌లోని వ్యక్తిగత చాట్స్, OTPలు, బ్యాంకు అలర్ట్స్ వంటి సున్నితమైన మెసేజ్‌లు మరింత సేఫ్‌గా ఉంటాయి.
ఇప్పటివరకు iPhone యూజర్లు.. ఒక నంబర్ కోసం సాధారణ WhatsApp, రెండో నంబర్ కోసం WhatsApp Business లేదా మరో ఫోన్/వెబ్ వాడాల్సి వచ్చేది. ఇలా యాప్‌లు, ఫోన్లు మార్చడం వల్ల నోటిఫికేషన్స్ మిస్ అవడం, బ్యాకప్ గందరగోళం, స్టోరేజ్ సమస్యలు ఎక్కువయ్యేవి. కొత్త మల్టీ అకౌంట్ ఫీచర్‌తో ఇవన్నీ ఒక్క యాప్‌లోనే నీట్‌గా సెట్ చేసుకోవచ్చు.
వాట్స్‌ప్‌లో మరో కొత్త ఫీచర్ : తెలియని నంబర్లకు యూజర్‌నేమ్ డిస్ప్లే
WhatsApp బృందం మరో కొత్త ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది. గుర్తు తెలియని నంబర్ నుంచి మెసేజ్ వస్తే, భవిష్యత్తులో ఆ నంబర్ Meta-verified అయితే, దానికి సంబంధించిన యూజర్‌నేమ్ (username) కూడా కనిపించే అవకాశం ఉంది.
ఇలా చూపించటం వలన నిజమైన బ్రాండ్‌లు, కంపెనీలు పంపే మెసేజ్‌లు, ఫేక్ అకౌంట్లు, స్పామ్ మెసేజ్‌ల మధ్య తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఇది కూడా ప్రస్తుతం iOS బీటాలో టెస్ట్ దశలోనే ఉంది.
ఎప్పుడు విడుదలవుతుంది?
అధికారిక విడుదల తేదీని WhatsApp ఇంకా ప్రకటించలేదు. కానీ, TestFlight బీటాలో ఈ ఫీచర్ ఇప్పటికే చాలామంది యూజర్లకు కనిపించడం, పూర్తి స్థాయి అకౌంట్ స్విచ్చింగ్ ఆప్షన్లు రెడీగా ఉండటం చూశాక, ఈ ఫీచర్ సాధారణ App Store అప్‌డేట్‌గా కొన్ని వారాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. అప్పటివరకు, ఇది ఎంపికైన బీటా యూజర్లకే పరిమితం.
ఒకే ఐఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లు వాడాలనుకున్న కోరిక ఇప్పుడు నిజం అవుతోంది. అకౌంట్ల మధ్య మార్పు సులభం, ప్రతి అకౌంట్‌కు సెట్టింగ్స్ వేరుగా ఉండటం, App Lock ద్వారా అదనపు భద్రత అందడం వల్ల ఈ మల్టీ అకౌంట్ ఫీచర్ iPhone యూజర్ల మెసేజింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది.
