Site icon vidhaatha

Foxconn | ట్రంప్ స్టేట్ మెంట్‌… ఫాక్స్ కాన్ పై నీలి నీడ‌లు..

 

హైద‌రాబాద్‌, మే 16 (విధాత‌)
Foxconn | హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం శివారులో ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన హాన్ హాయ్ టెక్నాల‌జీ గ్రూపున‌కు చెందిన ఫాక్స్ కాన్ కంపెనీ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న త‌రుణంలో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీ యాపిల్ త‌న ఉత్ప‌త్తుల‌ను భార‌త్ లో త‌యారు చేయ‌వ‌ద్ద‌ని, అమెరికాలోనే త‌యారు చేయాల‌ని ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ కు స్ప‌ష్టం చేశారు. అందుకు ఆయ‌న కూడా అంగీక‌రించారంటూ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో హైద‌రాబాద్ లోని ఫాక్స్‌కాన్ ప‌రిస్థితి ఏంట‌నే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఈ ప్లాంట్ ను మున్ముందు ఎందుకోసం ఉప‌యోగిస్తారు? ఏం చేస్తార‌నేది టెక్ ప్ర‌పంచంలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తెలంగాణకు ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంద‌ని అనుకుంటున్న త‌రుణంలో ట్రంప్ షాక్ ఇచ్చారు.

ఔట‌ర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న కొంగ‌ర క‌లాన్ లో ఫాక్స్ కాన్ కంపెనీ ప‌నులు చురుగ్గా జ‌రుగుతున్నాయి. అతి త్వరలో ఈ కంపెనీని ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. సుమారు రూ.6వేల కోట్లు వెచ్చిస్తుండ‌గా, తొలి విడ‌తలో ప్ర‌త్య‌క్షంగా 5,200 మందికి, ఏడు వేల మందికి ప‌రోక్షంగా ఉపాధి ల‌భించ‌నున్న‌ది. రానున్న ప‌దేళ్ల‌లో ప్ర‌త్యక్షంగా, ప‌రోక్షంగా సుమారు ఒక ల‌క్ష మందికి ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భించ‌నున్నాయి. తైవాన్ కు చెందిన ఫాక్స్ కాన్ ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల్లో ప్ర‌పంచంలోనే అగ్ర‌గామిగా వెలుగొందుతున్న‌ది. ఈ సంస్థ బ్లాక్ బెర్రీ, యాపిల్ కు చెందిన‌ ఐపాడ్‌, ఐఫోన్, ఐఫ్యాడ్‌, కిండ్లేతో పాటు నెంటెండ్ గేమింగ్ ప‌రిక‌రాల‌ను త‌యారు చేస్తుంది. ఇవే కాకుండా నోకియా, సిస్కో, సోని, గూగుల్ పిక్సెల్‌, మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ లు కూడా ఈ సంస్థ నుంచే వ‌స్తాయి. ప్ర‌పంచంలోని ఎల‌క్ట్రానిక్ వస్తువుల్లో ఫాక్స్ కాన్ కు 40 శాతం వాటా ఉంది. ఇలాంటి ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తి కంపెనీని హైద‌రాబాద్ కు ర‌ప్పించేందుకు గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. ఆ ప్రయత్నాలు ఫలించడం, కంపెనీ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావ‌డం కూడా జ‌రిగింది. సంస్థ యాజ‌మాన్యం విజ్ఞ‌ప్తి మేర‌కు కొంగ‌ర క‌లాన్ లో రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ముందు 2023 మే 15వ తేదీన భూమి పూజ చేశారు. ప‌నులు కూడా చురుగ్గా జ‌రుతున్నాయి. గ‌తేడాది ఫాక్స్ కాన్ ఛైర్మ‌న్ యంగ్ ల్యూ తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ప్ర‌భుత్వం నుంచి చేయాల్సిన సాయం చేస్తామ‌ని, ఇన్సెంటివ్ లు, అనుమ‌తుల్లో జాప్యం లేకుండా చూస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆధునిక సౌక‌ర్యాల‌తో ఔట‌ర్ రింగ్ రోడ్డు స‌మీపంలో అభివృద్ధి చేస్తున్న ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాల్సిన ముఖ్య‌మంత్రి ఆయ‌న‌ను కోరగా సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు కూడా. ఫోర్త్ సిటీలో ఎడ్యుకేష‌న్‌, మెడిసిన్‌, స్పోర్ట్స్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రిక‌ల్, స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ రంగాల‌లో పెట్టుబ‌డులకు చొర‌వ చూపాల‌ని కోరారు. యాపిల్ ఏయిర్ ఫ్యాడ్ ల‌ను అద‌నంగా ఉత్ప‌త్తి చేసేందుకు ఇటీవ‌లే రూ.276 కోట్ల‌తో కొత్త యంత్రాన్ని కొనుగోలు చేసింది కూడా.

చైనా దేశంతో అమెరికా ప్ర‌భుత్వం గొడ‌వల నేప‌థ్యంలో భార‌త్ నుంచే పూర్తిగా యాపిల్ ఉత్ప‌త్తుల‌ను త‌యారు చేయాల‌ని ఆ కంపెనీ నిర్ణ‌యం తీసుకోవ‌డ‌మే కాకుండా, కొంగ‌ర‌క‌లాన్ లోని ఫాక్స్ కాన్ సంస్థ‌లో ఐ ఫోన్ ఉత్ప‌త్తులు రెట్టింపు చేయాల‌ని తీర్మానం చేసింది. అదే విధంగా ఐపాడ్స్ పై మేడిన్ ఇండియా అని ముద్రిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగ‌ళూరులో ఐ ఫోన్స్ ఉత్ప‌త్తి చేసి మేడిన్ ఇండియా అని ముద్రించి, ఎగుమ‌తి చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో యాపిల్ ఉత్ప‌త్తుల‌కు గ్లోబ‌ల్ హ‌బ్ గా హైద‌రాబాద్ ను తీర్చిదిద్దేందుకు సిద్ధ‌మ‌య్యారు. కొంగ‌ర క‌లాన్ కంపెనీలో ఉత్ప‌త్తి అవుతున్న‌ ఏయిర్ పాడ్స్ ను గ‌త నెల‌ ఏప్రిల్ నుంచి తొలుత యూఎస్‌, యూర‌ప్ దేశాల‌కు ఎగుమ‌తి చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ త‌రువాత మిగ‌తా దేశాల‌కు ఇక్క‌డి ఉత్ప‌త్తుల‌ను ఎగుమ‌తి చేయ‌నున్నారు. ఫాక్స్ కాన్ కంపెనీ ఛైర్మ‌న్ యంగ్ ల్యూ చేతుల మీదుగా కొంగ‌ర క‌లాన్ ప్లాంట్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా జ‌రుగుతున్నాయి. ఈ శుభ త‌రుణంలో అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఖ‌తార్ దేశం ప‌ర్య‌టించారు. ఆ దేశంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో భేటీ అయి యాపిల్ ఉత్ప‌త్తుల పై చ‌ర్చించారు. ఆ త‌రువాత ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ, ‘నాకు కుక్ తో కొన్ని అంశాల్లో విభేధాలు ఉన్నాయి. ఇండియాలో యాపిల్ ఉత్ప‌త్తుల కోసం కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. అమెరికా వెలుప‌ల ఉత్ప‌త్తి చేయ‌డం నాకు ఇష్టం లేద‌ని చెప్పాను. అందుకు ఆయ‌న అంగీక‌రించారు’ అని ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో ఫాక్స్ కాన్ తీసుకునే నిర్ణ‌యంపై భార‌త్ టెక్ కంపెనీలు ఆతృత‌గా ఎదురు చూస్తున్నాయి. ట్రంప్ సూచ‌న‌ను యాపిల్ సీఈవో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారా? ఒక వేళ తీసుకుంటే ఎలాంటి నిర్ణ‌యం వెలువ‌డుతుంది? అనేది వేచి చూడాలి. ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే ఒక ర‌కంగా, తీసుకోన‌ట్ల‌యితే మ‌రో విధంగా ప‌రిణామాలు ఉంటాయ‌నేది స‌త్యం. ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల్లో తెలంగాణ రాష్ట్రం పేరు మారుమోగే త‌రుణంలో పిడుగులాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ్డం సాఫ్ట్ వేర్ నిపుణుల‌ను నిరాశ‌ప‌రిచింది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌లు గూగుల్‌, మైక్రోసాఫ్ట్ త‌మ కార్యాల‌యాల‌ను నెల‌కొల్పాయి. వంద‌లాది సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ల‌క్ష‌ల మంది ఐటీ నిపుణులు ప‌నిచేస్తున్న విష‌యం తెలిసిందే.

Exit mobile version