Site icon vidhaatha

‘ఊర్వశివో రాక్షసివో’ రివ్యూ: రాక్షసి కాదు.. ఊర్వశే!

మూవీ పేరు: ఊర్వశివో రాక్షసివో
విడుదల తేదీ: 04 నవంబర్, 2022
నటీనటులు: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్, సునీల్, వెన్నెల కిషోర్, ఆమని, పోసాని తదితరులు
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
సంగీతం: అచ్చ రాజమణి, అనూప్ రూబెన్స్
కెమెరా: తన్వీర్
నిర్మాతలు: ధీరజ్ మొగిలినేని, తమ్మారెడ్డి భరద్వాజ్, విజయ్. ఎం
సమర్పణ: అల్లు అరవింద్
రచన-దర్శకత్వం: రాకేష్ శశి

విధాత: అల్లు శిరీష్ హీరోగా అరంగేట్రం చేసినప్పటి నుంచి చేసిన సినిమాలు చాలా తక్కువే. అందులో ఆయనకు హిట్‌గా చెప్పబడేవి రెండే రెండు చిత్రాలు. ‘కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు’. ఇవి కూడా అంత పెద్ద హిట్టేం కాదు. ఈ రెండు చిత్రాలు మినహా.. ఆయన చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. మధ్యలో ‘ఒక్కక్షణం’ అనే సినిమా యావరేజ్‌గా నిలిచింది.

కాకపోతే ఆయన సినిమా చేస్తున్నాడంటే మాత్రం.. అందులో ఎంతో కొంత విషయం ఉంటుందని మాత్రం మొదటి నుంచి అనిపించుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే.. వెనుక మెగా నిర్మాత అండ ఉన్నా, ఐకానిక్ హీరోకి తమ్ముడు అయినా కూడా అల్లు శిరీష్ ఎడా పెడా సినిమాలు చేయడం లేదు. అలా.. కంటెంట్ ఉన్న సినిమా కోసం వేచి చూసి మరీ చేసిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’.

ఈ సినిమా కూడా అనేకానేక అవరోధాలను ఎదుర్కొని ఎట్టకేలకు నేడు థియేటర్లలోకి వచ్చింది. ఇక రిలీజ్ అనే ప్రకటన వచ్చినప్పటి నుంచి.. ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్.. సినిమాని యూత్‌లోకి బాగా తీసుకెళ్లాయి. టీజర్, ట్రైలర్‌లో కూడా రొమాంటిక్ కంటెంట్.. ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. హీరో శిరీష్‌కే కాదు.. దర్శకుడు రాకేష్ శశికి కూడా ఈ సినిమా ఎంతో కీలకం.

ఇందుకు ముందు చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్‌తో చేసిన ‘విజేత’ సినిమా ఆయనకు సరైన గుర్తింపును ఇవ్వలేదు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అను ఇమ్మాన్యుయేల్‌కి కూడా ఇప్పటి వరకు సరైన హిట్ రాలేదు. ఆమెకు కూడా అర్జెంట్‌గా హిట్టు కావాలి. అందుకే అందరూ ఈ సినిమా రిజల్ట్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. మరి వారు ఎదురు చూస్తున్న ఎదురు చూపులకి సరిపడా రిజల్ట్‌ని ఈ సినిమా ఇచ్చిందా? లేదా? అనేది మన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

పక్కపక్కన ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలలో శ్రీ కుమార్ (అల్లు శిరీష్), సింధూజ (అను ఇమ్మాన్యుయేల్) పనిచేస్తుంటారు. మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు శ్రీ అయితే.. అమెరికా నుంచి రిటన్ వచ్చిన అమ్మాయి సింధు. పక్క కంపెనీలోనే పనిచేస్తున్న సింధుని రోజూ కిటికీలో నుంచి చూస్తూ.. శ్రీ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. సడెన్‌గా ఆమె కూడా శ్రీ చేస్తున్న కంపెనీలోకి ఎంప్లాయ్‌గా వస్తుంది. ఇక శ్రీ ఆనందానికి అవధులే ఉండవు.

కట్ చేస్తే.. అదే ఆఫీస్‌లో లిఫ్ట్‌లో జరిగిన ఓ సంఘటనతో సింధు కూడా శ్రీని ఇష్టపడుతుంది. ఇద్దరూ శారీరకంగానూ ఒక్కటవుతారు. ఇద్దరూ సహ జీవనం మొదలెడతారు. ఆ తర్వాత శ్రీ.. సింధుని పెళ్లి చేసుకుందాం అని ప్రపోజ్ చేస్తాడు. కానీ సింధు ఒప్పుకోదు. సహజీవనం చేయడానికి ఓకే కానీ.. పెళ్లి మాత్రం వద్దు అంటుంది.

మరోవైపు శ్రీ తల్లిదండ్రులు అతనిని పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తూ.. పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. అసలు సింధు ఎందుకు పెళ్లి వద్దని అంటుంది? శారీరకంగా దగ్గరైన సింధు పెళ్లి వద్దని చెప్పడంతో శ్రీ ఏం చేశాడు? తన తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? చివరికి శ్రీ, సింధుల వ్యవహారం ఏమైంది? అనేది తెలియాలంటే థియేటర్‌లో ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

అల్లు శిరీష్‌ ఈ కథకు పర్ఫెక్ట్‌గా సరిపోయాడు. సినిమా విడుదలకు ముందే ఆయనపై అను ఇమ్మాన్యుయేల్‌ తో సహజీవనం చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు కూడా ఈ సినిమాకు కొంతమేర ఉపయోగ పడ్డాయనే చెప్పుకోవచ్చు. అను, శిరీష్‌ల మధ్య కెమిస్ట్రీ అంత బాగా వర్కవుట్ అయిందంటే.. ఖచ్చితంగా వారిద్దరూ కొన్ని రోజుల పాటు ఈ సీన్స్ ప్రాక్టీస్ చేశారేమో అనిపిస్తుంది.

ఎమోషనల్ సీన్స్‌లో అల్లు శిరీష్ అంతగా అలరించలేకపోయాడు కానీ.. మిగతా అన్నీ విషయాలలో తన ప్రత్యేకతను కనబరిచాడు. అతని సినీ కెరీర్‌లో టాప్ చిత్రంగా ఇది నిలిచిపోయే అవకాశం ఉంది. ఇక అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాకి హైలెట్. కథకి అనుగుణంగా ఆమె నటన, గ్లామర్‌తో చూస్తున్న ప్రేక్షకులకు మాంచి కిక్ ఇస్తుంది. ఆమె కెరీర్‌కి కూడా ఈ సినిమా ఉపయోగపడుతుంది.

ఇంకా సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకి మరో ప్రధాన బలం. శిరీష్ తల్లిదండ్రులుగా ఆమని, కేదార్‌లకు కూడా మంచి పాత్రలు పడ్డాయి. పోసాని రెండు మూడు సీన్స్‌లో కనిపించి నవ్విస్తాడు. పృథ్వీకి కూడా మంచి పాత్ర పడింది. ఇంకా ఇతర పాత్రలలో నటించిన నటీనటులు.. వారి పాత్రల పరిధి మేర నటించారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..

అచ్చు రాజమణి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్..సినిమాకి ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు. సన్నివేశాలకు అనుగుణంగా ఆయన ఇచ్చిన మ్యూజిక్.. హైలెట్ అనేలా ఉంది. మాములుగా అయితే.. ఇలాంటి సినిమాల విషయంలో పెద్దగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడరు. కానీ ఈ సినిమా చూసిన వారు ఖచ్చితంగా అచ్చు రాజమణి గురించి మాట్లాడకుండా ఉండలేరు.

అనూప్ కూడా ఈ సినిమా సంగీతంలో భాగమయ్యాడు. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా మూడ్‌కి అనుగుణంగా తన్వీర్ మలిచాడు. ఎడిటింగ్ విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో, ముఖ్యంగా స్టార్టింగ్‌లో కొన్ని సీన్స్‌ ల్యాగ్ అనిపిస్తాయి. వాటిపై కత్తెర వేస్తే ఇంకా బాగుండేది. అది తప్ప.. ఎడిటింగ్ పరంగా ఎటువంటి ఇబ్బందులూ లేవు.

సమర్పణ అల్లు అరవింద్ కాబట్టి.. ఆయన సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాణ పరంగా సినిమా రిచ్‌గా ఉంది. దర్శకుడు రాకేష్ శశి ఎంచుకున్న కథ.. నేటి యూత్‌ బిహేవియర్‌కి చాలా దగ్గరగా ఉండటం.. మరో ప్లస్ పాయింట్. అందుకే సినిమా చూసే యువత ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. కొత్తదనం నిండిన కథతో, అలాగే నేటి యువత లివింగ్‌ విధానంతో ఆయన సినిమాని మలిచిన తీరు అందరినీ అలరిస్తుంది.

విశ్లేషణ:

ఈ మధ్య కాలంలో అంటే.. టెక్నాలజీపై మానవుడు ఆధార పడుతున్న కాలంలో.. మనిషి జీవన విధానంలో ఎటువంటి మార్పులు సంభవించాయి, సంభవిస్తున్నాయనేది చెప్పడం ఈ సినిమా కథ ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్యంగా వయసుకు వచ్చిన అమ్మాయి, అబ్బాయిల మధ్య ఎలాంటి బాండింగ్ ఉంది.. పెళ్లి, పద్ధతులను వారు ఎలా తీసుకుంటున్నారు అనేది దర్శకుడు ఈ సినిమాలో వివరించిన తీరు, అందుకోసం ఆయన ఎన్నుకున్న హాస్యపు మార్గం.. అందరినీ కడుపుబ్బా నవ్వించడమే కాకుండా.. ఆలోచించేలా కూడా చేస్తుంది.

మాములుగా అయితే.. ఈ సినిమాకి దర్శకుడు రాసుకున్న కథ.. మన పక్కింటిలోనో, మన నివసించే బజారులోనో.. ఎవరో ఒకరి విషయంలో వింటూనే ఉంటాం. కానీ దానిని వెండితెరపై చూపించడానికి ఆయన తీసుకున్న సరంజామా పర్ఫెక్ట్‌గా సింక్ అయింది. అను, శిరీష్‌ల మధ్య కిస్సులు, రొమాంటిక్ సన్నివేశాలు ఒక లెవల్‌లో ఉంటే.. వాటిని వెన్నెల, సునీల్ వర్ణించే తీరు మరో లెవల్‌లో ఉంటుంది.

ఇన్‌డైరెక్ట్ పంచ్‌లు (డబుల్ మీనింగ్ డైలాగ్స్) కూడా ఇందులో చాలానే ఉన్నాయి. కథ నడిచే విధానం ఊహించినట్లుగానే ఉంటుంది కానీ.. అందులో ఏదో కొత్తదనం ఉన్నట్లుగా అనిపిస్తుంటుంది. అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమా కోసం గట్టిగానే ప్రయత్నించారు. వారి ప్రయత్నానికి తగ్గ ఫలితం వచ్చినట్లే.

ఓవరాల్‌గా సినిమా ప్రతి కోణంలోనూ ఎంటర్‌టైన్ చేస్తుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నా.. కామెడీ వాటిని డామినేట్ చేసేలా చేసింది. మొత్తంగా చూస్తే.. ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకున్న వారందరి కోరిక నెరవేరినట్లే. ఇలాంటి కంటెంట్‌ని యూత్ బాగా లైక్ చేస్తారు కాబట్టి.. వారికి ఈ సినిమా ఊర్వశి వంటిదే.

ట్యాగ్‌లైన్: రాక్షసి కాదు.. ఊర్వశే!
రేటింగ్: 3/5

Exit mobile version