Site icon vidhaatha

తిప్పేసిన స్పిన్‌: అస్ట్రేలియాపై రోహిత్‌ సేన ఇన్నింగ్స్‌ 132 పరుగుల విజయం

border gavaskar trophy | బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో రోహిత్‌ సేనకు అద్భుత ఆరంభం లభించింది. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమ్‌ ఇండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల భారీ తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ 321/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడురోజు ఆటను ప్రారంభించిన భారత్‌ ఆ తర్వాత మరో 79 పరుగులు జోడించి 400 పరుగులకు ఆల్‌ అవుట్‌ కాగా.. 223 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టును భారత స్పిన్నర్లు వణించారు. అశ్విన్‌ ధాటికి కంగారుల జట్టు 91 పరుగులకే ఆల్‌ అవుట్‌ అయ్యింది.

మొదటి ఇన్నింగ్స్‌లో (3/42)తో రాణించిన రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండో ఇన్నింగ్స్‌లో (5/37) బౌలింగ్‌తో కంగారులను ముప్పుతిప్పలు పెట్టాడు. తొలి ఇన్సింగ్స్‌లో 5/47తో అదరగొట్టిన జడేజా.. రెండో ఇన్నింగ్‌లో కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టాడు. మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు 16 వికెట్లను కూల్చారు. మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీయడంతో పాటు 70 పరుగులు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించిన జడేజాకు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దక్కింది. ఇదిలా ఉండగా.. తొలి టెస్టులో భారత్‌ విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌కు మరింత దగ్గరైంది. టెస్టుకు ముందు 58.93 పాయింట్లు ఉండగా.. ప్రస్తుతం 61.67కు పెరిగాయి. అదే సమయంలో ఆసిస్‌ పాయింట్లు 70.83కు పడిపోయాయి.

రవీంద్ర జడేజాకు ఐసీసీ షాక్‌..

బోర్డర్‌ – గవాస్కర్‌ టోర్నీ తొలి టెస్టులో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన రవీంద్ర జడేజాకు ఐసీసీ షాక్‌ ఇచ్చింది. తొలి టెస్టులో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు మ్యాచ్‌ ఫీజులో 25శాతం కోత విధించడంతో పాటు ఓ పాయింట్‌ను డీమెరిట్‌ చేసింది.

తొలి ఇన్సింగ్‌లో ఆసిస్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో జడేజా ఫీల్డ్‌ అంపైర్‌ అనుమతి లేకుండా తన ఎడమచేతి వేలుపై ఉన్న వాపు తగ్గేందుకు ఆయింట్‌మెంట్‌ రాసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

మొదట బాల్‌ ట్యాంపరింగ్‌ కోసం జడేజా అలా చేసి ఉంటాడని అనుమానించారు. అయితే, వేలికి ఉన్న వాపు కోసం అయింట్‌మెంట్‌ని రాసుకున్నాడని భారత జట్టు యాజమాన్యం వివరించింది. దీనిపై విచారణ తర్వాత రిఫరీ వేలి ఉన్న వాపు తగ్గేందుకు ఆయింట్‌మెంట్‌ను వాడాడని, బంతి ఆకారాన్ని (బాల్ ట్యాంపరింగ్) మార్చడానికి ప్రయత్నించలేదని నిర్ధారణకు వచ్చారు.

Exit mobile version