Site icon vidhaatha

హీరో నాగార్జునకూ.. రైతుబంధు సాయం!

విధాత‌: తెలంగాణలో రైతుల సంక్షేమం, ఇంకా వారికి ఆర్థికంగా ఆసరాగా నిలిచి పెట్టుబడులకోసం కొంత సాయం చేసే ఉద్దేశంతో మొదలు పెట్టిన రైతు బంధు పథకం నానాటికీ అబాసు పాలవుతోంది. ఈ స్కీం కింద పేదలు, చిన్న రైతులకు మాత్రమే సాయం అందితే బాగుండేది. కానీ భూస్వాములు, సేద్యపు భూములున్న పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులకు కూడా లక్షల్లో సాయం అందుతుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎంత ఎక్కువ భూమి ఉంటే అంత ఎక్కువ సాయం అందుతోందన్నమాట. తాజాగా సినీనటుడు నాగార్జునకు సైతం ఈ పథకం కింద డబ్బులు జమ అయ్యాయన్న వార్త ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. కొట్లాదిరూపాయల ఆస్తులు, స్టూడియోలు, చానెళ్లు, ఫామ్ హౌస్ లు ఉన్న నాగార్జునకు రైతుబంధు రావడం పట్ల సగటు తెలంగాణ పౌరుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.

అప్పట్లో మరో హీరో మహేష్ బాబు భూమికి కూడా రైతు బంధు వచ్చింది. ఇప్పుడు హీరో నాగార్జునకు కూడా రైతుబంధు అందుతోందట.. ఒక వ్యక్తికి ఎకరానికి రూ.10 వేలు చొప్పున రైతు బంధు అందిస్తోంది. ఎన్ని ఏకరాలుంటే అంత ఎక్కువ సాయం అందుతోందన్నమాట.

అయితే ఆ భూమిని కౌలుకు చేస్తున్న రైతుకు మాత్రం రూపాయి దక్కదు. ఈ పథకం కౌలు రైతుల సమస్యను పరిష్కరించలేదు. దీంతో పలువురు అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు రైతు బంధు డబ్బును పొందుతున్నారు.

టాలీవుడ్ హీరో నాగార్జున అక్కినేనికి కూడా రైతుబంధు వస్తుందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తాజాగా వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సదస్సులో ఆకునూరి మురళి మాట్లాడుతూ అమెరికాలో 30 ఏళ్లుగా ఉంటున్న వ్యక్తి నాకు తెలుసు. అతనికి తెలంగాణలో వ్యవసాయ భూములు ఉన్నాయి. రైతు బంధు డబ్బు అతని ఖాతాలో జమ అవుతుంది.

హీరో నాగార్జున కూడా రైతు బంధు ప్రయోజనాలను పొందారు. ఇంత సంపన్నులకు ఇది అవసరమా? బదులుగా రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల్లో దాదాపు 22 లక్షల మంది కౌలు రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలి అని మురళి అన్నారు. అయితే నాగార్జునకు ఎన్ని ఎకరాల భూములున్నాయి, ఎంత సాయం అందిందన్నది మురళి వెల్లడించలేదు.

ఏదైతేనేం మొత్తానికి బడాబాబులుకు సైతం సాయం అందుతోందన్నది స్పష్టమయింది. ఐదెకరాల లోపు రైతులకు మాత్రమే రైతుబంధును అమలుచేసి, కౌలు రైతులకు సైతం ఆసరాగా ఉంటే బాగుండు అని మొదటినుంచి అభిప్రాయాలు వస్తున్నా ప్రభుత్వం మరి ఎందుకనో నిబంధనలు మార్చలేదు.

Exit mobile version