సలార్ రివ్యూ: సీజ్‌ఫైర్‌ కాదు.. ర్యాపిడ్‌ఫైర్‌

బాహుబలి తర్వాత వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న ప్రభాస్‌.. సలార్‌ తో తన సత్తా చాటాడు.

  • Publish Date - December 22, 2023 / 11:01 AM IST

వరుస పరాజయాలతో ఉన్న ప్రభాస్‌.. ఒక్కసారిగా బాక్సాఫీస్‌పై ర్యాపిడ్‌ఫైర్‌కు దిగాడు. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన సలార్‌ సీజ్‌ఫైర్‌-1 ప్రభాస్‌ సత్తాను చాటింది. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ను తలపిస్తుందని ఈ సినిమాలో నటించిన మరో నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ చెప్పినట్టుగానే.. కొత్త అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది.


ఒకసారి రివైండ్‌ చేసుకుని 2010కి వెళితే.. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ సిరీస్‌కోసం ప్రేక్షకులు ఆతృతతో ఎదురుచూసేవారు. ప్రపంచం, రాజ్యాలు, రాజకీయాలు, ప్రేమ, ద్రోహం దానితోపాటు యాక్షన్‌ మనల్ని సీట్ల నుంచి కదలనివ్వవు. అక్కడి నుంచి ఫాస్ట్‌ ఫార్వార్డ్‌ చేసుకుని 2023కు వస్తే.. దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ సలార్‌: పార్ట్‌ 1 సీజ్‌ఫైర్‌తో గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌కు దేశీ వెర్షన్‌ను గిఫ్ట్‌గా అందించాడని చెప్పొచ్చు.



 


అస్సాంలోని తిన్సుకియా అనే గ్రామంలో నివసించే దేవా (ప్రభాస్‌)ను పిల్లలు కటౌట్‌ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. సమీపంలోని ఒక బొగ్గు గనిలో కటౌట్‌ పనిచేస్తుంటాడు. అతనికి అమ్మే లోకం. ఎలాంటి గొడవలకు పోవద్దని తరచూ చెబుతూ ఉంటుంది. అమ్మ మాటను పాటించే కటౌట్‌ ఎవరితోనూ గొడవలు పెట్టుకోడు. ముఖంపై ఎప్పుడూ కోపం కనిపించదు. అలాంటి స్వభావం రీత్యా ప్రభాస్‌ను కటౌట్‌ అని పిలుస్తూ ఉంటారు.


ఇదిలా ఉంటే.. భారతదేశానికి వచ్చిన ఆధ్య (సృతిహాసన్‌) అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటుంది. ఆమెను రక్షించే శక్తి ఉన్న ఏకైక వ్యక్తి దేవా. మరోవైపు ఫిక్షనల్‌ రాజ్యం ఖాన్సార్‌ రాజు రాజా మన్నార్‌ (జగపతిబాబు).. తన కుమారుడు వరదరాజ మన్నార్‌ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌)ను తన స్థానంలో రాజును చేయాలనుకుంటాడు. కానీ.. మన్నార్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించే మంత్రులు, సలహాదారులు.. రాజు లేని సమయంలో తిరుగుబాటు లేవనెత్తుతారు.



 


ఖాన్సార్‌ రోజువారీ కార్యక్రమాలను ఆయన కుమార్తె పర్యవేక్షిస్తూ ఉంటుంది. కానీ.. తిరుగుబాటు ఎగిసి.. అనేక మంది ప్రాణాలు కూడా పోతాయి. దీంతో కుమార్తె కాల్పుల విరమణను ప్రతిపాదిస్తుంది. కానీ.. వరదరాజ మన్నార్‌ మాత్రం ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తాడు. అయితే.. పరిస్థితి వరదరాజకు వ్యతిరేకంగా మారిపోతుంది. దీంతో తన స్నేహితుడైన దేవా సహాయాన్ని కోరుతాడు. కానీ.. గొడవలకు పోనని అమ్మకిచ్చిన మాటను దేవా ఉల్లంఘిస్తాడా? స్నేహితుడి కోసం హింసను ఆశ్రయిస్తాడా? అనేది కీలక పాయింట్‌.


కథ సాగే క్రమంలో ఖాన్సార్‌లోకి ప్రశాంత్‌ తీసుకెళ్లిన తీరు.. అబ్బురపరుస్తుంది. ఒక కొత్త ప్రపంచంలోకి ప్రవేశించిన ఫీల్‌ కలుగుతుంది. అయితే.. సినిమాటోగ్రఫీ, కలర్‌ టోన్‌, ఎడిటింగ్‌, సంగీతం.. కేజీఎఫ్‌ను తలపిస్తాయి కానీ.. కథాపరంగా కేజీఎఫ్‌తో ఎలాంటి పోలిక కనిపించదు. బేసిక్‌గా సలార్‌ సినిమా స్నేహం, అధికార పోరాటానికి సంబంధించినది. అనేక సన్నివేశాలను ఇముడ్చుకుంటూ ప్రశాంత్‌ నీల్‌ తెలివిగా కథను అల్లుకున్నాడు.


 



కథ కొత్తగా అనిపించకపోయినా కథ నడిపించే తీరును దర్శకుడు ఆసక్తికరంగా మార్చాడు. మరో ఆసక్తికర విషయం దేవాకే తెలియని గతం ఉంటుంది. కథలో ఆయా సందర్భాల్లో వచ్చే పాత్రలు.. దేవా క్యారెక్టర్‌ను ఎలివేట్‌ చేస్తాయి. ఇది సాధారణమైనా.. బోర్‌ కొట్టించదు. అనూహ్యమైన ఎక్స్‌ప్లోజివ్‌ ఇంటర్వెల్‌ కానీ.. ఖాన్సార్‌లో మహిళను కాపాడేందుకు గూండాలతో తలపడే తీరుగానీ అద్భుతమైన క్లైమాక్స్‌ సీన్స్‌గానీ సీట్లనుంచి కదలనివ్వవు. ప్రభాస్‌ నటనలో ఎంచి చూపడానికి ఎలాంటి లోపాలు కనిపించవు. పెద్దగా డైలాగ్స్‌ లేకున్నా.. ఆయన క్యారెక్టర్‌లో అనే కోణాలు కనిపిస్తాయి. దేవా గతం గురించి, ఆయన పూర్వీకుల గురించి సాగే సన్నివేశాలప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ప్రభాస్‌ స్ర్కీన్‌పై ప్రత్యక్షమైన ప్రతి సందర్భంలో ఈలలు మోగాయి. సలార్‌తో ప్రభాస్‌ మరోసారి తన స్టార్‌డమ్‌ను నిరూపించుకున్నాడు. రారాజు తానేనని చాటుకున్నాడు.


పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్‌కు దీటుగా పాత్రలో ఒదిగిపోయాడు. పేరుకు హీరోయిన్‌గానే శృతిహాసన్‌ పాత్ర ఉంటుంది. తెరపైనా చాలా తక్కువ సమయం కనిపిస్తుంది. జగపతిబాబు, బాబీ సింహ, శ్రియారెడ్డి, ఈశ్వరిరావు, టిను ఆనంద్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రధానంగా దేవా, వరదరాజ గురించే సినిమా మొత్తం సాగటం, మిగిలిన పాత్రలు నామ్‌కే వాస్తే అన్నట్టు మిగిలిపోవడం ఒక లోపంగా కనిపిస్తుంది.

అధికారం కోసం సాగే పోరాటం మెప్పించినా.. ఏం జరగబోతున్నదనేది ప్రేక్షకుడు ఊహించే విధంగా ఉన్నది. చాలా పాత్రలు ఉండటంతో వాటి మధ్య లింకును అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. మొదట్లో సినిమా మెల్లగా సాగి.. తర్వాత ఊహించని స్పీడ్‌ అందుకుంటుంది. భువన్‌ గౌడ సినిమాటోగ్రఫీ, ఉజ్వల్‌ కులకర్ణి ఎడిటింగ్‌, రవి బాస్రూర్‌ సంగీతం సినిమాకు అదనపు అడ్వాంటేజీలుగా మారాయి. మొత్తంగా సలార్‌ : పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌ మాస్‌ మసాలా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చెప్పుకోవచ్చు. సలార్‌ : పార్ట్‌ 2 శౌర్యాంగపర్వం కోసం ఆసక్తిగా ఎదురుచూడొచ్చు!

Latest News