International Airport | బెంగళూరు వాసుల విమానయాన కష్టాలు త్వరలోనే తీరబోతున్నాయి. ఇప్పటికే నగరంలోని యలహంకలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. బెంగళూరు నగరం ఐటీ రంగానికి ప్రఖ్యాతి చెందిన నేపథ్యంలో ఈ విమానాశ్రయంపై తీవ్ర రద్దీ ఉంటుంది. ఈ నేపథ్యంలో మరో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రెండో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు స్థలం ఎంపిక, సాధ్యాసాధ్యాలు, సాంకేతిక, ఆర్థిక వనరులపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెన్సీల నుంచి టెండర్లు ఆహ్వానించింది. సాధ్యాసాధ్యాల నివేదిక అందిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని అమలు చేయనున్నది.
కర్ణాటక మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ, కన్సల్టెన్సీలు తమ టెండర్ దరఖాస్తులు సమర్పించేందుకు జనవరి 12వ తేదీ తుది గడువుగా ఖరారు చేశామన్నారు. సూత్రప్రాయంగా మహా నగరం కనకపూరా రోడ్డులో చూడహళ్లి, సోమన హళ్లితో పాటు నేలమంగళ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. టెండర్ లో ఎంపికైన కన్సల్టెన్సీలు ఆర్థిక, సాంకేతిక నివేదికలను ఐదు నెలల వ్యవధిలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఆషామాషీ వ్యక్తులు టెండర్లలో పాల్గొనకుండా ఉండేందుకు ప్రతి సంస్థ వార్షికంగా రూ.250 కోట్ల టర్నోవర్ వరుసగా ఐదు సంవత్సరాల పాటు కలిగి ఉండాలని షరతు విధించింది. ప్రభుత్వం సూచించిన ప్రాంతాల్లో వర్షపాతం నమోదు, భూ భౌతిక పరిస్థితులు, విద్యుత్, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ, పరిసర ప్రాంతాల్లో జనాభా, ప్రాంతీయ అభివృద్ధి, ధ్వని కాలుష్యం వల్ల కలిగే అనర్థాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు.
సూత్రప్రాయంగా ఎంపిక చేసిన ప్రాంతాలలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేస్తే ఎంత వ్యయం చేయాల్సి ఉంటుందని, మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత వెచ్చించాల్సి ఉంటుందనేది కూడా నివేదికలో తెలియచేయనున్నారు. ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉంది, అదనంగా ఎన్ని ఎకరాలు సేకరించాలి, భూ సేకరణకు అయ్యే వ్యయం కూడా కన్సల్టెన్సీ తన నివేదికలో సుస్పష్టం చేయనున్నదని ఆయన వివరించారు. కొత్త విమానాశ్రయం ఏర్పాటుతో పరిశ్రమలు, పర్యాటకం, ప్రజా రవాణాకు ఎంత మేరకు ఉపయోగపడుతుందనే అధ్యయనం చేస్తారు. ప్రభుత్వం పేర్కొన్న ప్రాంతాలలో ఈ అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించి ముందుకు వెళ్తుందని ఎం.బీ పాటిల్ వెల్లడించారు.
2033 సంవత్సరం నాటికి ప్రయాణికుల రాకపోకల్లో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలో రెండో విమానాశ్రయంగా ఎదిగే అవకాశం ఉండడం రెండో విమానాశ్రయం నిర్మాణంపై దృష్టి పెట్టారు. ఇది బెంగళూరు మహా నగరానికి ఉత్తరాన, హైదరాబాద్ నగరానికి వెళ్లే జాతీయ రహదారిని ఆనుకుని ఉంది. చోళులు, హోయసలు, విజయనగర సామ్రాజ్యాధీశులు పాలించిన ప్రాంతం. ఇక్కడే ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉండడమే కాకుండా ఏరో ఇండియా ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఆర్థిక వనరులు, భూ సేకరణ త్వరితగతిన పూర్తయితే 2030 నాటికి బెంగళూరు దక్షిణ ప్రాంతంలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నది. బెంగళూరు విధాన సౌధ నుంచి సోమనహళ్లి కి 34.5 కిలోమీటర్లు, చూడహళ్లి కి 34.5 కిలోమీటర్లు, నేలమంగళ కు 28.4 కిలోమీటర్ల దూరం ఉంది.
Read Also |
Caller Name Display Service | కాల్ చేసినవారి పేరు ఇక డిస్‌ప్లేలో.. మార్చి నుంచే అమలు!
Vastu Tips | ఈశాన్య దిశలో పడక గదా..! దంపతుల మధ్య విడాకులు తప్పవట..!!
Marriage | 2026లో ఈ నాలుగు రాశుల వారికి పెళ్లి ఖాయం..! మరి మీ రాశి ఉందా..?
Garlic | చలికాలంలో ‘వెల్లుల్లి’.. శరీరానికి ఒక వరం..!
