- నిర్మాణంలో ఉన్న హఫీజ్‌పేట సీసీ రోడ్డు తవ్వకాలు దేనికి సంకేతం?
- మున్సిపాలిటీలు కలిపి మహానగరంగా మార్చిన రేవంత్ రెడ్డి..
- రోడ్లను గుంతల మయం చేస్తున్న అధికారులు!
- పురపాలక శాఖలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు!
హైదరాబాద్, విధాత ప్రతినిధి:
Manjeeraa Pipeline Road | నిరంతరం తవ్వకాలకు గురయ్యేవే హైదరాబాద్ రోడ్లు అని సెటైర్లు తరచూ వినిపిస్తుంటాయి. వినిపించడమే కాదు.. కనిపిస్తూ కూడా ఉంటాయి. ఏదో ఒక రోడ్డును ఏదో ఒక విభాగం ఏదో ఒక పనికోసం తవ్వుతూ ఉంటుంది. విచిత్రం ఏమిటంటే.. అప్పుడే వేసిన రోడ్లను కూడా ఏదో ఒక పని కోసం తవ్వుతుండే సందర్భాలు సాధారణంగానే కనిపిస్తూ ఉంటాయి. రోడ్డున వెళుతుంటే.. ‘మొన్నే రోడ్డు వేశారు.. ఈ రోజు తవ్వేస్తున్నారు..’ అనే మాటలు కూడా వినిపిస్తూనే ఉంటాయి. మహానగరంగా మార్చాలని కలలు కంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఉన్న పురపాలక శాఖలోని వివిధ విభాగాల మధ్య కొరవడుతున్న సమన్వయమే యథేచ్ఛగా సాగుతున్న ఈ తవ్వకాలకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేసిన రోడ్డును వేసినట్టే తవ్వేస్తుంటే మహానగరంగా ఎదుగుతుందా.. గుంతల మయంగా మిగిలిపోతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
కీలకమైన మంజీరా పైప్‌లైన్ రోడ్డు
ఈ తవ్వకాలకు తాజా నిదర్శనంగా నిలుస్తున్నది హఫీజ్‌పేట నుంచి చందానగర్‌లోని బీఆర్ గ్యాస్ ఏజెన్సీ వరకూ నిర్మిస్తున్న సీసీరోడ్డు! నిజానికి ఇది హైదరాబాద్ యావత్ నగరానికి మంజీరా నీటిని సరఫరా చేసే పైప్‌లైన్‌లు ఉన్న రోడ్డు. మంజీరా నీటి లభ్యత లేనప్పుడు గోదావరి జలాలు సరఫరా అయ్యేదీ ఈ పైప్‌లైన్ ద్వారానే. ఇంతటి కీలకమైన పైప్‌లైన్‌లు ఉన్న రోడ్డు విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రజాధనాన్ని సక్రమంగా వినియోగించి, పనులు చేయించాల్సిన ఉన్నతాధికారులు వాటాలు పంచుకుని ఎంజాయ్ చేస్తున్నారనేందుకు ఇదొక ఉదాహరణగా స్థానికులు చెబుతున్నారు. నగర మౌలిక వ్యవస్థ అభివృద్ధిలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయి బోర్డు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత కీలకం. కానీ.. ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం లేక ఈ తవ్వకాలు సాగాయా? లేక రెండు విభాగాల ఉన్నతాధికారులు కుమ్మక్కయ్యారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
40 ఏళ్ల జీవితకాలం.. ఆర్నెళ్లలో కట్
శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ జోన్ పరిధిలో హఫీజ్‌పేట నుంచి చందానగర్ బీఆర్ గ్యాస్ ఏజెన్సీ వరకు మంజీరా పైప్‌లైన్ రోడ్డులో 6.3 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. ఇంకా పనులు కూడా పూర్తి చేయలేదు. ఆరు నెలల క్రితం రూ.14.30 కోట్లతో చేపట్టిన రోడ్డును విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా మళ్లీ గుంతల రోడ్డుగా, వాహనదారులకు నిత్య నరకంగా మార్చారని స్థానికులు మండిపడుతున్నారు. ఈ సీసీరోడ్డు వేయడానికి ముందు రోడ్డు తవ్వి, అందులో భారీ వాటర్ పైప్‌లను ఏర్పాటు చేసి, మట్టిపోసి, తగిన విధంగా చదును చేసి, ఆపై సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. నిజానికి సీసీ రోడ్డు ఒకసారి నిర్మించారంటే నిర్మాణ నాణ్యతను బట్టి 40 ఏళ్లదాకా మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అంత పక్కాగా సీసీ రోడ్డు నిర్మాణం అవుతాయి. సీసీ రోడ్ల కింద ఉండే పైప్‌లైన్‌లకు భవిష్యత్తులో లింకులు ఇచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు ఉండాలి. కానీ.. హఫీజ్‌పేట రోడ్డు విషయంలో మాత్రం ఇష్టారాజ్యంగా సాగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోడ్డులో ఇప్పటికే కొంతభాగాన్ని ఇటీవలే పూర్తి చేశారు. ఒక కిలోమీటర్‌కు సుమారు 2.35 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి నిర్మాణం చేయడంతో స్థానికులు, వాహనదారులు చాలా ఆనందపడ్డారు. త్వరలో రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని ఆశించారు. తమ ఆనందాన్ని ఆరు నెలల వ్యవధిలోనే జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు అధికారులు చిదిమేశారని స్థానికులు మండిపడుతున్నారు. ఒక అపార్ట్‌మెంట్‌కు నల్లా కనెక్షన్ ఇచ్చేందుకు రోడ్డును తవ్వడం అనేక సందేహాలను రేకెత్తిస్తున్నది. దీనికి జీహెచ్‌ఎంసీ అధికారులు అనుమతించారా? లేక అనధికారికంగా వాటర్‌బోర్డు అధికారులు తవ్వించారా? ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఏమైనా ఉందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నలభై ఏళ్ల జీవిత కాలం ఉన్న రోడ్డుకు ఆరు నెలల్లోనే దయనీయ స్థితిని తీసుకొచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇలా రోడ్డు తవ్వకానికి దరఖాస్తు చేసుకుంటే అనుమతించేందుకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. అడిగిందే తడవుగా.. అందులోనూ ఆరు నెలలు కూడా పూర్తికాకముందే సీసీ రోడ్డును తవ్వడం వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాని ఫలితంగా సీసీ రోడ్డు మన్నికను ప్రశ్నార్థం చేశారని స్థానికులు మండిపడుతున్నారు. ఇలాంటి అధికారులకు అసలు ఉద్యోగం చేసే నైతిక అర్హత ఉన్నదా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడ్డదిడ్డంగా కట్ చేస్తే పనికొచ్చేనా?
ఇంతకు ముందు చెప్పుకొన్న విధంగా.. ఒకసారి సీసీ రోడ్డును పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మిస్తే.. సుమారు 40 ఏళ్ల దాకా మన్నికగానే ఉంటుందని ఇంజినీర్లు అంటున్నారు. అయితే.. ఇలా నిర్మించిన రోడ్డుపై ఎలాంటి తవ్వకాలు లేకుంటేనే ఈ మన్నిక సాధ్యం. ఒకసారి వేసిన సీసీ రోడ్డును అడ్డగోలుగా కట్ చేసి, తిరిగి కాంక్రీట్ వేసినా.. మునుపటి స్థాయి పటిష్టత ఉందబోదని ఇంజినీరింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. తవ్విన ప్రాంతంలో రోడ్డు కింద ఉన్న తాగునీటి పైప్‌లైన్‌లు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు. పైప్‌లైన్ దెబ్బతింటే చుట్టు పక్కల ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోవడమే కాకుండా.. మొత్తం తవ్వి మరమ్మతులు చేయాల్సిన దుస్థితి దాపురిస్తుందని చెబుతున్నారు. హఫీజ్‌పేటలో తవ్విన చోట కాంక్రీట్ వేయకుండా.. మట్టిపోసి కప్పిపెట్టేయడం గమనార్హం. కాంక్రీట్ వేసేలోపు పైప్‌లైన్ దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కానీ.. ప్రజా ధనాన్ని పప్పు బెల్లాల మాదిరిగా పంచుకునేందుకు అలవాటు పడిన అధికారులు.. వీటిని పట్టించుకోకుండా.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.
ఎమర్జెన్సీ అయితేనే తవ్వకాలకు అనుమతి
రోడ్డు తవ్వకాలు వాస్తవానికి ఇష్టారాజ్యంగా చేయడం కుదరదు. రోడ్డు తవ్వాలంటే చాలా అంశాలను అధికారులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవి..
సాధారణంగా జీహెచ్ఎంసీ తప్పనిసరి, ఎమర్జెన్సీ పనుల కోసం మాత్రమే రోడ్డు కటింగ్ అనుమతులు ఇస్తుంది.
- మంచినీటి పైపులైను లీకేజీలు, మురుగునీటి పారుదల పైపులైన్లు ధ్వంసం అయినప్పుడు, విద్యుత్ కేబుళ్ల రిపేరు, ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్, ఫైబర్ కేబుళ్లు ధ్వంసం అయినప్పుడు మాత్రమే అనుమతిస్తారు.
- మంచినీటి పైపులు, విద్యుత్, ఇంటర్ నెట్ కేబుళ్లు వేస్తామని దరఖాస్తు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు.
- జీహెచ్ఎంసీ అనుమతి లభిస్తే ఎమర్జెన్సీ వర్క్ అని ఎన్ఓసీ ఇస్తారు.
- ఒక వేళ అనుమతించినా డైమండ్ కట్టర్ మిషన్ తోనే పనిచేయాలి.
- పెద్ద సుత్తెలు, జేసీబీలు ఉపయోగించి కటింగ్ చేసే విధానం నిషేధం.
- అనధికారికంగా రోడ్డు కట్ చేస్తే అపరాధ రుసుములతో పాటు వాడిన యంత్రాలు సీజ్ చేస్తారు.
- అక్రమ కటింగ్ కాంట్రాక్టర్‌పై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు.
- రోడ్డు మరమత్తులు పూర్తి చేసేన తరువాతే పోలీస్ స్టేషన్లో కేసును ముగిస్తారు.
- అనుమతి లేని తవ్వకాలపై రూ.50వేల నుంచి రూ.10 లక్షల వరకు జీహెచ్ఎంసీ అపరాధ రుసుం విధిస్తుంది.
స్పందించని జీహెచ్ఎంసీ, వాటర్ సప్లయి బోర్డు
నిజానికి ఇది ఒక్క హఫీజ్‌పేటలో.. అదీ ఈ ఒక్క సందర్భంలో జరుగుతున్నదే కాదని, నగరం వ్యాప్తంగా ఇలా విచ్చల విడిగా రోడ్డును తవ్వేస్తున్నారని ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటిపై స్థానికుల నుంచి వందల ఫిర్యాదులు వచ్చినా.. జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడ్డగోలుగా తవ్వి, నల్లా కనెక్షన్లు మంజూరు చేసి, రోడ్లను ధ్వంసం చేసినా సంబంధిత ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. మెట్రో వాటర్ సప్లయి అండ్ సివరేజ్ బోర్డు ఎండీ కూడా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో పట్టించుకోవడం లేదని స్థానిక కాలనీల ప్రతినిధులు చెబుతున్నారు. సమన్వయం లేకుండా రెండు విభాగాల ఇంజినీర్లు వ్యవహరించడం మూలంగానే నగరంలో మౌలిక సదుపాయాలు దెబ్బతిని ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో చంద్రబాబు హయాంలో జీహెచ్‌ఎంసీలో అన్ని విభాగాల అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ ఉండేది. ఇటువంటి తవ్వకాలు, అనుమతులపై పూర్తి పరిశీలన అనంతరం కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయాలు తీసుకునేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అటు బీఆరెస్ పాలనలో కానీ.. తాజాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో కానీ.. సమన్వయ కమిటీ లేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే పురపాలక శాఖ కూడా ఉన్నది. తాను టీడీపీ కాలేజీలో చదువుకున్నానని చెబుతున్న రేవంత్ రెడ్డి.. ఒకప్పుడు అదే టీడీపీ ముఖ్యమంత్రి అనుసరించిన విధానాన్ని నగర అభివృద్ధిలో ఎందుకు అనుసరించడం లేదన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
Agro Processing Hub | వ్యవసాయ సంక్షోభ నివారణకు అదే మార్గం!
Lok Sabha e-cigarette debate| లోక్ సభలో ఈ-సిగరెట్ దుమారం
Snake Jumps In Air To Hunt Bird : షాకింగ్ వీడియో..ఆకాశంలో పక్షిని వేటాడిన పాము!
