విధాత, హైదరాబాద్ :
ప్రజల నుంచి వచ్చిన మద్దతు హైడ్రాకు మరింత స్ఫూర్తినిచ్చింది అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని.. పర్యావరణ హితమైన నగరంలో ప్రజలు మెరుగైన జీవనాన్ని కొనసాగించాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు హైడ్రా పని చేస్తోందని స్పష్టం చేశారు. హైడ్రా వల్ల జరిగిన మేలును వివరిస్తూ..పెద్దలు, పిల్లలు, మహిళలు, యువకులు ర్యాలీలు నిర్వహించి హైడ్రాకు మద్ధతు తెలపడంపట్ల హైడ్రా హర్షం వ్యక్తం చేసింది. హైడ్రా వల్ల లక్షల మందికి లాభం చేకూరిందంటూ.. నగరవ్యాప్తంగా జరిగిన మేలును వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి తీరు మాలో స్ఫూర్తిని నింపిందన్నారు. మీడియా సంస్థలతో పాటు.. చాలా వరకు సామాజిక మాధ్యమాలు కూడా హైడ్రా కార్యక్రమాలను ప్రజలవద్దకు చేరవేసిన తీరును అభినందిస్తున్నామన్నారు.
చట్టానికి లోబడే హైడ్రా పని చేస్తోందని కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారు తెలిపారు. రాజ్యాంగం, న్యాయస్థానాలు, చట్టాలపైన హైడ్రాకు ఎనలేని గౌరవం ఉందని.. వాటి స్ఫూర్తితోనే ప్రకృతి పరిరక్షణకు పాటుపడుతున్నామన్నారు. పేదవారిని అడ్డం పెట్టుకొని బడాబాబులు సాగిస్తున్న కబ్జాలను వెలికి తీస్తుందన్నారు. ధనదాహంతో ఇష్టానుసారం కబ్జాలు చేసి ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నవారు హైడ్రాపై దాదాపు 700ల వరకూ కేసులు పెట్టారని.. వ్యక్తిగతంగా తనపై కూడా 31 వరకూ కంటెంప్ట్ కేసులు వేశారని గుర్తు చేశారు. చట్టాలను గౌరవిస్తూ.. ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితో పర్యవారణాన్ని, ప్రజల ఆస్తులను పరిరక్షింస్తామన్నారు. ప్రభుత్వం దిశానిర్దేశం చేసిన విధంగా చెరువులు, ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కాపాడుతూ ప్రకృతిని పరిరక్షించేందుకు పని చేస్తున్నామన్నారు. 2024 జూలైకి ముందు నుంచే నివాసం ఉన్నవారి ఇళ్ల జోలికి హైడ్రా వెళ్ళదని స్పష్టం చేశారు. తప్పనిసరి అయి తొలగించాల్సివస్తే వారికి ప్రత్యామ్నాయం, పరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదిస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు.
హైడ్రా ఏర్పాటయిన నాటి నుంచి నేటి వరకు మొత్తం 181 డ్రైవ్స్ నిర్వహించి 954 కబ్జాలను తొలగించామని రంగనాథ్ గారు తెలిపారు. మొత్తం 1,045.12 ఎకరాల భూమిని హైడ్రా కాపాడిందని.. వీటి విలువ సుమారు ₹50,000 కోట్ల నుండి ₹55,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో ప్రభుత్వ భూములు 531.82 ఎకరాలు కాగా.. రహదారుల కబ్జాలు 222.30 ఎకరాల వరకూ ఉన్నాయి. చెరువుల కబ్జా233.00 ఎకరాలు, పార్కుల కబ్జాలు 35 ఎకరాలు ఇలా.. మొత్తం 1045.12 ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది. వర్షాలు వచ్చినప్పుడు కాకుండా.. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడంతో.. ఈ ఏడాది వరదలు చాలావరకు నియంత్రించామన్నారు. క్యాచ్‌పిట్స్ క్లీనింగ్ 56,330, నాళాల క్లీనింగ్ 6,721, నీటి నిల్వ పాయింట్లు క్లియర్ చేయడం 10,692, కల్వర్ట్లు క్లియర్ చేయడం 1,928, ఇతర పనులు 21,301 ఇలా మొత్తం 96,972 పనులు హైడ్రా ఈ వర్షాకాలంలో చేపట్టిందన్నారు.
