విధాత, హైదరాబాద్ :
హైడ్రాపై కొంతమంది కావాలని చేస్తున్న దుష్ప్రచారాన్ని కాలనీ, బస్తీవాసులు తిప్పి కొడుతున్నారు. హైడ్రా వల్ల జరిగిన మేలును వివరిస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్లకార్డులు చేతపట్టుకుని హైడ్రా జిందాబాద్ అంటూ నినదిస్తున్నారు. మంగళవారం అంబర్‌పేటలోని బతుకమ్మకుంట చెంత వాకింగ్ చేసిన వారు హైడ్రా పనులను కీర్తిస్తే.. బుధవారం మణికొండ మర్రి చెట్టువద్ద దాదాపు 15 కాలనీల వారు ర్యాలీ నిర్వహించారు. మణికొండ మున్సిపాలిటీలో రూ. వెయ్యి కోట్లకు పైగా విలువైన పార్కులను కాపాడి నగర ప్రజలకు ప్రాణవాయువును అందించారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నెక్నాంపూర్ విలేజ్, తిరుమల హిల్స్ నుంచి చిన్నా పెద్ద వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఖాజాగూడ ప్రశాంతి హిల్స్‌లో హైడ్రా కాపాడిన పార్కుల్లో మొక్కలు నాటారు. కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కాలనీలో 4300 గజాల ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడారంటూ ర్యాలీ నిర్వహించారు. అలాగే రాఘవేంద్ర కాలనీలో 2000 గజాల పార్కును కాపాడినందుకు అభినందన సభ ఏర్పాటు చేశారు.
ఒకరిద్దరి స్వార్థ ప్రయోజనాలకోసం వందలమంది నష్టపోవాలా? హైడ్రాతో లక్షలాది మందికి న్యాయం జరిగిందంటూ కొనియాడుతున్నారు. కొంతమంది ధనదాహంతో కబ్జాలు చేసి రూ. కోట్లు గడించాలని చూసేవారి ఆటలు ఇక చెల్లవు అని హైడ్రా నిరూపించింది. హైడ్రా లేకుంటే ఈ పార్కులు కాపాడగలిగేవాళ్లమా, చెరువులు కబ్జాలు కాకుండా చూడగలమా అంటూ నినదించారు. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా వర్షాలు పడితే.. వరద కష్టాలు లేకుండా చేసింది హైడ్రా అంటూ కీర్తించారు. దశాబ్దకాలంగా పేరుకుపోయిన పూడికను తొలగించడంతో నగరంలోని నాలాల ద్వారా వరద నీరు సాఫీగా సాగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వర్షం వస్తే వరుణిడితో సమానంగా పోటీపడి రహదారులపై కాపుకాసి వరదకష్టాలు తీర్చిన హైడ్రా ఉండాల్సిందే అంటూ నినదించారు. ప్రాణవాయువును అందించే పార్కులను కాపాడి నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన హైడ్రా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
హైడ్రాపై దుష్ప్రచారం తగదని పలువురు ఈ సందర్భంగా హితవు పలికారు. కొంతమంది స్వార్థానికి అందరూ బలి కావద్దని అన్నారు. ఇటీవల పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని హఫీజ్ బాబా నగర్లో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదు. రహదారి విస్తరణలో భాగంగా ఇప్పటికే ఆ మార్గంలో ఉన్న భవనాలకు నష్టపరిహారం కూడా చెల్లించాు. రహదారి విస్తరణతో పాటు నాలా పనుల వల్ల అర్నా గ్రామర్ స్కూల్ బిల్డింగ్ ను GHMC తొలగించింది. దీనిని కూడా హైడ్రాకు ఆపాదించి సామాజిక మాద్యమాల్లో ప్రసారం చేయడాన్ని కూడా పలువురు ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పని చేస్తున్న విషయం పలు సందర్భాల్లో నిరూపితమైందని పేర్కొన్నారు. దశాబ్దాల సమస్యలను గంటల్లో రోజుల్లో పరిష్కరించే సత్తా ఉన్నహైడ్రాకు తామంతా అండగా ఉన్నామని.. నగర ప్రజలు ఇప్పటికే హైడ్రాతో కలిసి పని చేస్తున్నారని పలువురు తెలిపారు.