H1B Visa Renewal | హెచ్1బీ వీసా రెన్యువల్ కష్టమే.. కాన్సులేట్లలో అప్పాయింట్‌మెంట్లు రద్దు!

హెచ్‌1బీ వీసాలు ఎక్కడ పొందారో వాటి రెన్యువల్స్‌ కూడా అక్కడికి వెళ్లి చేయించుకోవాలన్న అమెరికా కొత్త నిబంధన భారతదేశ హెచ్‌1బీ వీసాదారులను నానా ఇక్కట్లకు గురి చేస్తున్నది. దేశంలోని కాన్సులేట్లు అపాయింట్‌మెంట్లు ఇవ్వకపోవడంతో అనేక మంది భారత్‌లోనే చిక్కుబడిపోయారు. తమకు ఎప్పుడు అపాయింట్‌మెంట్‌ దొరుకుతుందో? ఎప్పుడు తిరిగి అమెరికాకు వెళతామో అర్థం కాని స్థితిలో వారు ఉన్నారు.

US embassy appointment cancellations ai creation

H1B Visa Renewal | అనేక సంవత్సరాలుగా భారతీయులు అమెరికాలో నివాసం ఉంటూ హెచ్1బీ వీసాలపై ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హెచ్1బీ వీసా కలిగి ఉన్న వారు మొన్నటి వరకు రెన్యువల్ కోసం ఆన్‌లైన్‌ లేదా ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి చేయించుకునేవారు. ఇప్పుడా విధానం ఎత్తివేశారు. ఏ కాన్సులేట్ కార్యాలయంలో హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారో, రెన్యువల్ కోసం మళ్లీ అక్కడికే వెళ్లాలని అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు భారతీయుల పట్ల మరణ శాసనంగా పరిణమించాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీసా రెన్యువల్ కోసం భారత్‌కు వచ్చినవారు ఇక్కడే ఆగిపోతున్నారు. వీరి అప్పాయింట్‌మెంట్లను అమెరికా కాన్సులేట్లు ఇబ్బడి ముబ్బడిగా రద్ధు చేశాయి. మళ్లీ ఎప్పుడు అప్పాయింట్‌మెంట్లు ఇస్తారో తెలియని దుస్థితిలో పలువురు హెచ్1బీ వీసాదారులు కొట్టుమిట్టాడుతున్నారు.

డిసెంబర్ 15వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య వేల మంది నైపుణ్యం కలిగిన వర్కర్లకు అమెరికా కాన్సులేట్లు అప్పాయింట్‌మెంట్లు రద్ధు చేశాయి. హ్యూస్టన్‌కు చెందిన ఒక ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ ప్రతినిధి ఎమిలీ న్యూమన్ మాట్లాడుతూ, తమ సంస్థ నుంచి సేవలు పొందుతున్న వారు 100 మంది వరకు భారత్‌లో చిక్కుకుపోయారన్నారు. వారికి రెన్యువల్ అప్పాయింట్‌మెంట్లు ఎప్పుడిస్తారో తెలియడం లేదన్నారు.

హెచ్1బీ వీసాదారులను లక్ష్యంగా చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఎప్పటికప్పుడు నిబంధనలు మారుస్తూ నిద్రలేకుండా చేస్తున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి హెచ్1బీ వీసాదారులు, వారి డిపెండెంట్స్ (హెచ్4) వీసాదారులు ఇక నుంచి రిమోట్ విధానంలో (దేశంలో ఎక్కడి నుంచైనా) రెన్యువల్ చేసుకోవడానికి వీలు లేదని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌ గత జూలై నెలలో ప్రకటించింది. వీరంతా ఎక్కడైతే వీసా తీసుకున్నారో, తిరిగి ఆ కాన్సులేట్ కార్యాలయానికి భౌతికంగా వెళ్లి రెన్యువల్ చేసుకోవాలని స్పష్టం చేసింది. హెచ్1బీ రెన్యువల్ కోసం ఒక లక్ష డాలర్లు చెల్లించాలని సెప్టెంబర్ 19న డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన పలువురికి గుండె పోటు వచ్చేలా చేసింది. డిసెంబర్ 3వ తేదీన మరో నిర్ణయాన్ని ట్రంప్ కార్యాలయం వెల్లడించింది. హెచ్1బీ తో పాటు హెచ్4 వీసాదారుల డిజిటల్ (సోషల్ మీడియా) ఖాతాలను తనిఖీ (వెట్టింగ్) చేస్తామని ప్రకటించింది. దేశ భద్రత కోసం ప్రతి ఖాతాను పరిశీలిస్తామని, యూజర్ నేమ్, పాస్ వర్డ్ కూడా తీసుకుంటామని తెలిపారు. ఇది దేశ రక్షణకు సంబంధించిన అంశమని, యూఎస్ వీసా అనేది ప్రత్యేక సౌకర్యం మాత్రమేనని, హక్కు మాత్రం కాదని స్టేట్ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. అయితే రద్ధయిన వేల కొద్దీ రెన్యువల్ అప్పాయింట్ మెంట్లను వచ్చే ఏడాది అనగా 2026 మార్చి నుంచి జూన్ మధ్య నిర్వహించనున్నట్లు కాన్సులేట్ ప్రతినిధులు తెలిపారు. ఒక దరఖాస్తుదారుడికి మాత్రం 2027 చివరి నాటికి అప్పాయింట్‌మెంట్లు ఇస్తున్నట్లు అధికారికంగా సమాచారం ఇచ్చారు.

ట్రంప్ నిర్ణయంతో హెచ్1బీ వీసాదారులు రెన్యువల్ కోసం భారత్ కు క్యూ కట్టారు. కొందరు వ్యక్తిగతంగా వస్తుండగా, చాలా మంది భార్యా, పిల్లలతో తిరిగి వచ్చారు. కుటుంబంతో సహా వచ్చినవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడే ఉండిపోవాలా లేదా అమెరికా వెళ్లిపోవాలా అనేది తేల్చులేకపోతున్నారు. ఒక వేళ వెళ్లిపోవాలని అనుకుంటే ఇప్పట్లో కాన్సులేట్లు రెన్యువల్ కోసం అప్పాయింట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక వేళ తమ పిల్లలను అక్కడికి పంపిస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ చదివిస్తే, ఉపాధి ఎలా అని మధనపడుతున్నారు.

అమెరికాలో హెచ్1బీ వీసాదారుల్లో అత్యధిక వాటాను భారతీయులు కలిగి ఉన్నారు. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ నివేదిక ప్రకారం ఏప్రిల్ 2025 నాటికి 71 శాతం మంది హెచ్1బీ వీసాదారులు భారతీయులే కావడం గమనార్హం. వీరంతా అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలలో పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Indians Shift Focus To 01 Visas | హెచ్-1 బీ వీసా ఫీజు పెంపు: ఓ-1 వీసాల వైపు అందరిచూపు
Visa | ఈ వ్యాధులు ఉంటే వీసా కష్టమే.. ట్రంప్ కొత్త రూల్!
US Cancels 6000 Visas | విద్యార్థులకు ట్రంప్‌ బిగ్‌ షాక్‌..6వేల మంది విద్యార్థి వీసాల రద్దు!

Latest News