అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) కేసు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన 30 లక్షల పేజీలను అమెరికా న్యాయశాఖ శుక్రవారం విడుదల చేసింది. తాజాగా విడుదలైన దర్యాప్తు ఫైల్స్ (Epstein files)లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ సహా పలువురు ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. పేర్లు ఉన్నంత మాత్రాన వీళ్లు తప్పుచేసినట్లు కాదని న్యాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఇక తాజాగా విడుదలైన ఫైల్స్‌లో ముఖ్యంగా బిల్ గేట్స్ (Bill Gates)కు సంబంధించిన ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
గేట్స్‌కు సెక్సువల్ డిసీజ్..
రష్యన్ యువతులతో గడిపిన తర్వాత బిల్‌గేట్స్‌కు సెక్సువల్ డిసీజ్ సోకిందని ఎప్‌స్టీన్ ఆరోపించారు. ఈ విషయాన్ని ఎప్‌స్టీన్ రాసుకున్న ఈమెయిల్ ద్వారా బయటపడింది. రష్యా యువతులతో గేట్స్ సెక్స్ చేసినట్లు ఎప్‌స్టీన్ తన మెయిల్‌లో రాసుకున్నాడు. దీంతో గేట్స్ సెక్సువల్ డిసీజ్ బారిన పడినట్లు పేర్కొన్నాడు. ఈ విషయం బయట పడకుండా ఉండేందుకు తన భార్య మెలిందాకు బిల్ గేట్స్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలని ప్రయత్నించినట్లు కూడా ఎప్‌స్టీన్ ఆరోపించారు. ఇక తనతో ఆరేళ్ల స్నేహానికి గేట్స్ గుడ్‌బై చెప్పినట్లుగా కూడా ఎప్‌స్టీన్ తన మెయిల్‌లో రాసుకున్నాడు. ఈ ఆరోపణలను బిల్ గేట్స్ తీవ్రంగా ఖండించారు. తనతో సంబంధాలు కొనసాగించలేదని బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఎప్‌స్టీన్ ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేశాడని చెప్పారు.
ఎప్‌స్టీన్ నుంచి మస్క్‌కు ఆహ్వానం
తాజాగా విడుదలైన ఫైల్స్‌లో మస్క్ పేరు కూడా తెరపైకి వచ్చింది. యూఎస్ వర్జిన్ దీవుల్లోని తన ద్వీపానికి రావాలని మస్క్‌ను ఎప్‌స్టీన్ ఆహ్వానించాడు. పలుమార్లు ఈమెయిల్స్ పంపాడు. అయితే, ఎప్‌స్టీన్ ఆహ్వానాన్ని మస్క్ తిరస్కరించినట్లు తాజా ఫైల్స్‌లో ఉంది.
ఎప్‌స్టీన్‌ను బకింగ్‌హామ్‌కు ఆహ్వానించిన ప్రిన్స్ ఆండ్రూ..
ఈ కేసు పత్రాల్లో బ్రిటన్ యువరాజు ఆండ్రూ (Prince Andrew) పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఫైల్స్‌లో ఎప్‌స్టీన్-ఆండ్రూ మధ్య జరిగిన సంభాషణ బయటపడింది. 2010లో ఎప్‌స్టీన్‌ను ఆండ్రూ బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు విందుకు ఆహ్వానించాడు. ప్రైవేట్ టైమ్ గడుపుదామని ఎప్‌స్టీన్‌ను ఆహ్వానించినట్లు ఈమెయిల్స్ ద్వారా తెలిసింది. అయితే, ఎప్‌స్టీన్ వెళ్లారా..? లేదా..? అన్నది తెలియరాలేదు. మరోవైపు సెక్స్ కుంభకోణం ఆరోపణలు రావడంతో ప్రిన్స్ ఆండ్రూని అన్ని రాచరిక హోదాలు, గౌరవాల నుంచి బ్రిటన్ రాజు చార్లెస్-3 తప్పించిన విషయం తెలిసిందే.
ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం..
తన పరపతి పెంచుకోవడం కోసం జెఫ్రీ ఏళ్ల తరబడి టీనేజ్ అమ్మాయిలను ఎరగా వేశాడు. 2002-2005 మధ్య కాలంలో మైనర్ బాలికలను, యువతులకు డబ్బు ఆశ చూపించి తన మాన్‌హట్టన్ భవనం, పామ్ బీచ్ ఎస్టేట్, ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోల్లోని నివాసాలకు పిలిపించి అఘాయిత్యాలకు పాల్పడేవాడని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఎప్‌స్టీన్‌పై అమెరికాలో చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసు నమోదు అయ్యింది. సెక్స్ క్రైంలో దోషిగా తేలిన అతన్ని 2019 జులైలో జైలులో వేశారు. ఇక అదే ఏడాది ఆగస్టు 10న మాన్‌హట్టన్ జైలు గదిలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆయన సన్నిహితుల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సహా, మాజీ అధ్యక్షులు, రాజకీయ, వ్యాపార వేత్తలు కూడా ఉన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. దీంతో ఎప్‌స్టీన్‌కు సబంధించిన అన్ని అంశాలు బహిర్గతం చేయాలని ఇటీవల అమెరికా న్యాయ శాఖ ఆదేశాలు ఇవ్వడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ ఫైల్స్ లిస్ట్‌లో పలువురి రాజకీయ నేతలు, జర్నలిస్ట్‌లు, వ్యాపారవేత్తలు, బిజినెస్ అండ్ టెక్ టైకూన్స్, సినిమా వాళ్ల పేర్లు ఉండటం చర్చకు దారితీస్తోంది.
ఇవి కూడా చదవండి :
Contract Employees | ఏపీలో కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అదనంగా పదివేల జీతం
Jamili Elections | మహిళలు.. వారసులు.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దంకండి!
