Visa | ఈ వ్యాధులు ఉంటే వీసా కష్టమే.. ట్రంప్ కొత్త రూల్!

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత వలసదారులపై కఠిన విధానాలను అమలు చేస్తూనే ఉన్నారు.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత వలసదారులపై ఆయన కఠిన విధానాలను అమలు చేస్తూనే ఉన్నారు. విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజీ విజిటర్ల ‘డ్యురేషన్‌ ఆఫ్‌ స్టే’పై పరిమితి విధించడం, హెచ్-1బీ వీసాపై వార్షిక రుసుమును లక్ష డాలర్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాలు వలసదారులను ఆందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. తాజాగా డయాబెటిస్, ఒబెసిటి, హృద్రోగం, శ్వాస సంబంధఇత వ్యాధుల వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి అమెరికా వీసాలను తిరస్కరించాలని కొత్త నిబంధనలు రూపొందించారు.

ఈ మేరకు అమెరికా ఎంబసీలు, కాన్సులర్ కార్యాలయాలకు ఆ దేశ విదేశాంగ శాఖ కొత్త మార్గ దర్శకాలను జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వీటిలో వలసదారుల మెడికల్ హిస్టరీని మరింత సవివరంగా పరిశీలించాలని, ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశం ఉన్నవారిని అమెరికాలోకి ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. అయితే, సాధారణంగా వీసా దరఖాస్తుదారుల ఆరోగ్య స్థితిని ఇమిగ్రేషన్ అధికారులు పరిశీలిస్తారు. టీబీ, హెపటైటిస్ వంటి అంటు వ్యాధుల స్క్రీనింగ్ చేస్తారు. కాగా, అమెరికా కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఈ జాబితాలో మరిన్ని దీర్ఘకాలిక వ్యాధులను చేర్చారు. అమెరికాకు వచ్చే వారు ఆర్థిక భారం ఎక్కువవున్న వారా? ప్రభుత్వ సేవలపై ఆధారపడతారా? కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ఏమిటీ? అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని వీసా అధికారులకు మార్గదర్శకాల్లో ఆదేశించింది.

‘అలాగే, హృద్రోగం, శ్వాస సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, నాడి సంబంధిత వ్యాధులు, జీవక్రియ, మానసిక సమస్యలున్న వారిని సంరక్షించడానికి లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది. ఒబెసిటీ వలల్ ఆస్తమా, స్లీప్ ఆప్నియా, హై బీపీ సమస్యలు రావచ్చు. అందువల్ల ఈ వ్యాధిగ్రస్తులకు సుదీర్ఘ వైద్య సంరక్షణ అవసరమవుతుంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ వనరులపై ఆధారపడే అవకాశమున్నవారిని అమెరికాలోకి రాకుండా తిరస్కరించాలి’ అని విదేశాంగ శాఖ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే, ఈ కొత్త రూల్స్ పై అమెరికా విదేశాంగ శాఖ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయా..లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.