Avatar Fire and Ash Review: Visual Grandeur Remains, But Story Struggles to Evolve
(విధాత వినోదం డెస్క్)
అవతార్ – ఈ సిరీస్ చిత్రాలపై తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో ఆసక్తి నెలకొనిఉంటుంది. కారణం, అవతార్ 1 సృష్టించిన సంచలనం. దర్శకుడు జేమ్స్ కామెరాన్ ఆలోచల్లోంచి పుట్టిన పండోరా అద్భుతం. దాన్ని ఒక దృశ్యకావ్యంగా మలిచిన తీరు. భావోద్వేగాలు కలబోసిన కథనం. దాని తర్వాత వచ్చిన అవతార్ 2 (Avatar: The way of Water)పై కొద్దిగా విమర్శలొచ్చినా, భారీ హిట్‌గా నమోదైంది. కానీ, మూడో అవతారమైన ఈ నిప్పు & నివురు(Fire and Ash)లో అసలు నిప్పు లేదనేది విమర్శకులు, ప్రేక్షకుల మాట. నిజమేనా.? చూద్దాం.
ది వే ఆఫ్ వాటర్ ముగిసిన కొన్ని వారాల తర్వాత కథ మొదలవుతుంది. జేక్ సల్లీ, నేతిరి తమ పెద్ద కుమారుడిని కోల్పోయిన బాధ నుంచి ఇంకా కోలుకోలేని స్థితిలో ఉంటారు. కుటుంబ భారం, నాయకత్వ బాధ్యతలతో జేక్ అంతర్మథనంలో ఉండగా, నేతిరి పాత్రలో ఆగ్రహం, ప్రతీకార భావన మరింత తీవ్రమవుతుంది. పిల్లలైన కిరి, లోక్, టూక్‌లతో పాటు మానవ బాలుడు స్పైడర్ కూడా ఈ కుటుంబ భావోద్వేగాలకు మూలబిందువుగా మారతాడు.
ప్రతినాయకులు మారినా, పండోరా కథ మారలేదు
ఈసారి కథలోకి కొత్తగా ప్రవేశించే అంశం, అగ్ని తెగ. అగ్నిపర్వత ప్రాంతాల్లో నివసించే మాంగ్‌క్వాన్ తెగ నాయకురాలు వరాంగ్ రూపంలో కథకు కొత్త ప్రతినాయకి కలుస్తుంది. వరాంగ్ పాత్రలో ఊనా చాప్లిన్ చూపించిన ఆగ్రహం, ఆత్మవిశ్వాసం మొదటి నుంచి విభిన్నంగా ఉంది. ప్రకృతిని రక్షించాల్సిన పవిత్ర భావనకంటే, బలమే జీవనాధారం అన్న తత్వం ఆమెలో జీర్ణించుకున్న తీరు ఆసక్తికరంగా సాగుతుంది. ఈ పాత్ర కథాపరంగా చాలా బలంగా ఉన్నా, కథనంలో పూర్తిగా కలిసిపోయే అవకాశం దక్కలేదన్న భావన కలుగుతుంది.
మరోవైపు, రెండో భాగంలో మరణించిన కర్నల్ క్వారిచ్ మళ్లీ నావీ అవతార్ రూపంలో ప్రత్యక్షమవుతాడు. ప్రతీకారంతో రగిలిపోతున్న క్వారిచ్, వరాంగ్‌తో చేతులు కలిపి జేక్ సల్లీ కుటుంబంపై, పండోరా తెగలపై దాడులకు తెగబడతాడు. ఈ కలయిక కథకు కొత్త ఉద్వేగాన్ని జతచేస్తుందనిపించినా, కొన్ని సన్నివేశాల తర్వాత అది కూడా చూసినవాటిలాగే మారుతుంది.
అసహనాన్ని పెంచిన అదే పాత ఫార్ములా..
కథాపరంగా ఫైర్ అండ్ యాష్ ప్రధానంగా కుటుంబం, ప్రకృతి, దురాక్రమణ అనే పాత సూత్రాన్నేఅనుసరించింది. కొత్త జాతులు, కొత్త ప్రాంతాలు వచ్చినా, బలమైన సంఘర్షణ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. 3 గంటల 17 నిమిషాల నిడివి గల ఈ సినిమా చాలా చోట్ల అసహనంగా మారింది. కొన్ని పోరాట ఘట్టాలు ఉత్కంఠను పెంచినా, మధ్యలో సాగతీత స్పష్టంగా కనిపిస్తుంది.
అయితే విజువల్స్ విషయంలో అవతార్ సిరీస్ ఆశ్చర్యానికి మారుపేరు. ఈ విషయంలో మాత్రం దర్శకుడు జేమ్స్ కామెరాన్(James Cameron) మరోసారి తన స్థాయిని చాటాడు. అగ్ని ప్రాంతాల డిజైన్, లావా ప్రవాహాలు, కొత్త జీవజాలం, వాయు మార్గాల్లో జరిగే యుద్ధాలు — ఇవన్నీ సాంకేతికపరంగా నభూతో అన్నస్థాయిలో ఉంటాయి. 3డి అనుభూతి ఇప్పటికీ పండోరా ప్రపంచానికి ప్రాణం పోస్తుంది. కానీ తొలి అవతార్ కలిగించిన ‘అబ్బురం’ ఈసారి మాత్రం పూర్తిగా పునరావృతం కాలేదు. అంటే, కాకపోవడం తప్పుకూడా కాదేమో. ఎందుకంటే దర్శకుడి పండోరా “భావన” మనకు ముందే తెలుసు కాబట్టి. అదీకాక, భావోద్వేగపరంగా అవతార్ 1 రంజింపజేసినంతగా మూడోభాగం చేయలేకపోయింది.
నేతిరిగా జోయ్, వరాంగ్గా ఊనా నటన శిఖరాలకు చేరింది
నటీనటుల విషయానికి వస్తే… సామ్ వర్తింగ్టన్ జేక్ సల్లీగా హుందాగా నటించాడు. నేతిరి పాత్రలో జోయ్ సల్డానా భావోద్వేగ తీవ్రతను బాగా ప్రదర్శించింది. కిరి పాత్రలో సిగోర్నీ వీవర్ నటన ఆకట్టుకున్నా, ఆ పాత్రను కథాపరంగా మరింత లోతుగా తీర్చిదిద్దిఉంటే బాగుండేది. స్టీఫెన్ లాంగ్ క్వారిచ్ పాత్రలో ఎప్పటిలాగే తనదైన శైలిలో మెప్పించాడు. వరాంగ్ పాత్రలో ఊనా చాప్లిన్ సినిమాకు కొత్త ఊపు తీసుకొచ్చినా, ఆమె పాత్ర పూర్తి స్థాయిలో ఆవిష్కరించబడకముందే ముగిసిపోతుంది.
మూడో అవతారం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది
మొత్తానికి, అవతార్: ఫైర్ అండ్ యాష్ సాంకేతికంగా అద్భుతమైన సినిమా. కానీ కథాకథనాలు, భావోద్వేగాల పరంగా మూడోభాగాన్ని మరో మెట్టుకు తీసుకెళ్లలేకపోయింది. పండోరా ప్రపంచం ఇప్పటికీ చూడముచ్చటగానే ఉన్నా… అదే కథను, అదే మూలసూత్రాన్ని మళ్లీ మళ్లీ చూస్తున్నామన్న భావన ప్రేక్షకుల్లో నిరాశకు లోను చేసింది. ముఖ్యంగా భారతీయ ప్రేక్షకులు అవతార్ అనే పేరుతో బాగా కలిసిపోయారు. అది హిందీ, తెలుగు పేరు కావడం, అగ్ని, వాయువు, నీరు, భూమి, ఆకాశం అనే పంచభూత భావన భారతదేశానికి సంబంధించింది కాబట్టి, అవతార్ సిరీస్‌తో భారతీయులకు విడదీయలేని అనుబంధం ఏర్పడింది. అయితే అదే మూలసూత్రాన్ని, అదే కథను వేరే కొత్త ప్రాంతాలు, కొత్త జీవులతో తీసినా, తరువాయి భాగాలు ఆసక్తికరంగా ఉంటాయా అంటే మాత్రం సమాధానం పెదవి విరుపే.
