విధాత, హైదరాబాద్ : ఆన్ లైన్ యాప్స్ మోసాలు, సైబర్ క్రైమ్, డ్రగ్స్ వంటి నేరాల పట్ల నిరంతరం ప్రజలను చైతన్యవంతం చేసే సీనియర్ ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ సీపీ వీ.సీ.సజ్జనార్ తాజాగా సోషల్ మీడియా పిచ్చి పరాకాష్టపై మండిపడుతూ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ఓ తల్లి బావి అంచునా తన ఇద్దరి చిన్నారులతో రీల్స్ కోసం చేసిన దుస్సాహసానికి సంబంధించిన వీడియోను సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
వీడియోలో కన్నబిడ్డలను బావి అంచున నిలబెట్టి రీల్స్ చేయడంతో పాటు వారికి బావిలోకి వేలాడేలా పట్టుకుని కూడా ఆ తల్లి రీల్స్ చేసింది. ఈ చర్య దుస్సాహసమే కాదు..మూర్ఖత్వం. ఆత్మహత్యా సదృశ్యం అంటూ సజ్జనార్ మండిపడ్డారు. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే రీల్స్ పిచ్చితో వారిని మృత్యువు అంచున నిలబెట్టడం చూస్తుంటే, సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రోత్సహించకండి అని సజ్జనార్ పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా..అది చూసిన నెటిజన్లు సజ్జనార్ వ్యాఖ్యలకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు.
ఇది సోషల్ మీడియా ఉన్మాదానికి పరాకాష్ట!
కన్నబిడ్డలను బావి అంచున నిలబెట్టి రీల్స్ చేయడం సాహసం కాదు.. అది మూర్ఖత్వం. ఆత్మహత్యాసదృశ్యం.
పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే వారిని మృత్యువు అంచున నిలబెట్టడం చూస్తుంటే, సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు.
సోషల్ మీడియా పిచ్చిని… pic.twitter.com/azXf7hZcBz
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 6, 2026
