Chandrahas | సీనియర్ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కులం–పరువు హత్యల నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు కనిపించడం లేదు. బుకింగ్స్ తక్కువగా ఉండటంతో పలు చోట్ల థియేటర్లు వెలవెలబోతున్నాయి. దీనికి ప్రధాన కారణంగా చంద్రహాస్ ప్రమోషన్స్ సమయంలో సృష్టించిన వివాదమే చర్చకు వస్తోంది.
‘గుంజి గుంజి’ పాటతో మొదలైన రచ్చ
సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో చంద్రహాస్ పాడిన ‘గుంజి గుంజి’ పాటే ఈ వివాదానికి కేంద్రబిందువైంది. అసలు పాటలో లేని రెండు వల్గర్ పదాలను తానే జోడించి పాడడంతో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అదే కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న జేడీ చక్రవర్తి, ఆది సాయికుమార్ తదితరులు ఆ సమయంలో చంద్రహాస్‌ను అభినందిస్తూ చప్పట్లు కొట్టడం కూడా తర్వాత చర్చనీయాంశమైంది.
జేడీ చక్రవర్తి క్షమాపణ
వివాదం పెద్దది కావడంతో జేడీ చక్రవర్తి స్పందిస్తూ క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో తాను ఖండించాల్సిందని, లేకపోతే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందని తెలిపారు. ఇదే సమయంలో చంద్రహాస్‌పై ఓ జర్నలిస్టు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వ్యవహారాన్ని మరింత వేడెక్కించింది.
మొదట మొరాయించి… తర్వాత సారీ చెప్పిన చంద్రహాస్
సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కొన్న చంద్రహాస్ తొలుత తన మాటలను సమర్థించుకున్నా, తర్వాత ఓ లైవ్ డిబేట్‌లో పాల్గొని “రెండు పదాలు తప్పుగా వాడాను, అది తప్పే” అంటూ క్షమాపణలు తెలిపారు. అయితే ఆ పదాలు ఎవరినీ ఉద్దేశించి చెప్పలేదని, జనరల్‌గా పాట పాడానని వివరణ ఇచ్చాడు.
ఈ సందర్భంగా చంద్రహాస్ మరో అంశాన్ని లేవనెత్తాడు. పెద్ద పెద్ద సినిమాల్లో వల్గర్ డైలాగ్స్ వినిపించినప్పుడు ఎవరూ ప్రశ్నించరని, కానీ తాను ఈవెంట్‌లో రెండు పదాలు వాడితే ఇంత పెద్ద రచ్చ చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశాడు.
జేడీపై చంద్రహాస్ కౌంటర్
జేడీ చక్రవర్తి వైఖరిపై కూడా చంద్రహాస్ స్పందించాడు. స్టేజ్‌పై ప్రశంసించి, తర్వాత బయటకు వచ్చి సారీ చెప్పడం సరైంది కాదని, ఇది “డబుల్ స్టాండర్డ్” అంటూ విమర్శించాడు. ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.
మొత్తంగా ఈ వివాదం చంద్రహాస్ వ్యక్తిగత ఇమేజ్‌కే కాకుండా ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా కలెక్షన్లపై కూడా ప్రభావం చూపుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నెగటివ్ టాక్ ఎదుర్కొంటున్న ఈ చిత్రానికి ఈ కాంట్రవర్సీ మరింత భారంగా మారిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
