Teja | జేడీ చక్రవర్తి వ్యాఖ్యలపై తేజ ఘాటు స్పందన.. “నా పెళ్లి గురించి చెప్పిందంతా అబద్ధమే”

Teja | టాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తేజ‌ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు వరుస హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన తేజ, కొత్త తరానికి చెందిన హీరోలకు కూడా మంచి అవకాశాలు ఇచ్చిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

  • By: Sandeep |    movies |    Published on : May 17, 2026 12:16 PM IST
Teja | జేడీ చక్రవర్తి వ్యాఖ్యలపై తేజ ఘాటు స్పందన.. “నా పెళ్లి గురించి చెప్పిందంతా అబద్ధమే”

Teja | టాలీవుడ్‌లో ప్రేమకథా చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తేజ‌ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు వరుస హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన తేజ, కొత్త తరానికి చెందిన హీరోలకు కూడా మంచి అవకాశాలు ఇచ్చిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభ దశలో పలువురు నటులకు మంచి విజయాలు అందించి ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.

ఒకప్పుడు తేజ దర్శకత్వంలో సినిమా అంటే కనీసం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉండేది. అయితే ఇటీవల కాలంలో ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్నాయి. ఇటీవల అభిరామ్ ద‌గ్గుబాటితో రూపొందించిన అహింస చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించి…

ఇదిలా ఉండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తేజ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న ఇబ్బందులు, కుటుంబ జీవితం, పెళ్లి, పిల్లల భవిష్యత్తు వంటి అంశాలపై మాట్లాడారు.

ఈ సందర్భంగా హీరో జేడీ చ‌క్ర‌వ‌ర్తి గతంలో తన ప్రేమకథ, పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలపై తేజ స్పందించారు. జేడీ చక్రవర్తి చెప్పిన కథనంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. తన పెళ్లి విషయంలో చెప్పిన చేజింగ్‌లు, సుమోలు, డ్రామాలు వంటి అంశాలన్నీ నిజం కాదని పేర్కొన్నారు.

నా పెళ్లి చాలా సాధారణంగా జరిగింది. చెప్పిన కథలన్నీ కల్పితమే అని తేజ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే జేడీ చక్రవర్తితో తనకు మంచి స్నేహం ఉన్నందున సరదాగా అలా మాట్లాడి ఉండవచ్చని కూడా కొందరు భావిస్తున్నారు.

ఆర్థిక ప‌రిస్థితి బాగోలేదు..

తన వివాహం గురించి మాట్లాడిన తేజ, తన పెళ్లిని అక్కినేని వెంక‌ట్‌, ఆయన భార్య జ్యోత్స్న దగ్గరుండి జరిపించారని తెలిపారు. అలాగే కుటుంబ పెద్దగా అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వ్యవహరించారని గుర్తుచేసుకున్నారు.

పెళ్లి సమయంలో తన ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగాలేదని తేజ వెల్లడించారు. అప్పటికి తనకు సొంత ఇల్లు, కారు కూడా లేవని, అన్నపూర్ణ స్టూడియోస్‌లోని కాటేజ్‌లోనే ఉండేవాడినని చెప్పారు. పెళ్లికి కొద్ది రోజుల ముందు అద్దె ఫ్లాట్ తీసుకున్నానని, ఆ తర్వాతే కారు కొనుగోలు చేశానని తెలిపారు.

అదే సమయంలో తన కుటుంబ భవిష్యత్తు గురించి కూడా మాట్లాడారు. తన కుమారుడు అమెరికాలో దర్శకత్వానికి సంబంధించిన కోర్సు పూర్తి చేశాడని, ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీలోకి రావాలనే ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో తాను పూర్తిస్థాయి నిర్మాతగా మారాలని ఆలోచిస్తున్నానని కూడా తేజ చెప్పారు.

ప్రస్తుతం తేజ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జేడీ చక్రవర్తి వ్యాఖ్యలపై ఆయన ఇచ్చిన సమాధానాలపై సినీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.