మోడలింగ్‌ గర్ల్స్‌ ఫొటోలు చూపించి.. మధ్యప్రదేశ్‌లో వెడ్డింగ్‌ స్కామ్‌.. 42 మంది పెళ్లి కొడుకులకు టోపీ

పెళ్లికోసం బంధుమిత్ర సమేతంగా తరలి వచ్చి, షేర్వాణీల్లో, తలపాగాలు అలకరించుకుని ఎదురు చూస్తున్న పెళ్లికొడుకులకు.. పెళ్లిమండపానికి పెళ్లికూతుళ్లు రాకపోతే? అదొక స్కామ్‌ అని తెలిస్తే.. ఫాఫం.. మధ్యప్రదేశ్‌లో 42 మంది యువకులకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.

  • By: TAAZ |    trending |    Published on : May 26, 2026 7:26 PM IST
మోడలింగ్‌ గర్ల్స్‌ ఫొటోలు చూపించి.. మధ్యప్రదేశ్‌లో వెడ్డింగ్‌ స్కామ్‌.. 42 మంది పెళ్లి కొడుకులకు టోపీ

42 మంది యువకులు. వారిలో కొందరు పెళ్లి కోసం సర్వాంగసుందరంగా ముస్తాబయ్యారు. కొందరు పగిడీలు పెట్టుకున్నారు. మరికొందరు రంగురంగుల షేర్వాణీలతో కళకళలాడిపోయారు. డబ్బాల్లో స్వీట్లు పట్టుకొని వచ్చారు. పెళ్లి అవుతున్నదనే ఊహల్లో ఉన్నారు. మెడలో పూలమాలలు వేసుకుని ఎదురు చూశారు. కానీ.. వారిని పెళ్లిచేసుకునేందుకు వధువులు ఎవరూ అక్కడ లేరు. ఆరా తీస్తే అదొక స్కాం అని.. తాము మోసపోయామని తెలుసుకున్న పెళ్లికొడుకులు.. ఉస్సూరుమంటూ వెనుదిరిగారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో ఈ మోసం ఆదివారం చోటు చేసుకున్నది. తాము దేవాస్‌, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చామని, కానీ.. ఆఖరుకు అదొక మోసమని తేలిందని పెళ్లికొడుకులు పోలీసుల వద్ద భోరుమన్నారు. ఇండోర్‌లోని ఒక అనాథ శరణాలయంలోని యువతులతో పెళ్లి చేస్తామని చెప్పి, అన్నీ మాట్లాడి.. లక్షల రూపాయలు వసూలు చేసి, పరారయ్యారని ఫిర్యాదు చేశారు.

పెళ్లిళ్లు చేయిస్తామని చెప్పి మోసం చేసే సంఘటిత నేరగాళ్ల పనిగా తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసు అధికారులు చెప్పారు. ‘కొందమంది యువకులు మాకు ఫిర్యాదు చేశారు. విషయాన్ని తీవ్రస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం’ అని బ్యాంక్‌ నోట్ ప్రెస్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ ప్రీతి కటారే చెప్పారు. నేరస్తులను గుర్తించామని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ఉపయోగించిన అనాథ శరణాలయానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే అంశాన్ని కూడా శోధిస్తున్నామని వివరించారు.

దేవాస్‌లో సామూహిక వివాహాలు చేస్తామని చెప్పి.. ఒక్కొక్కరి నుంచి 15వేల నుంచి 25వేల రూపాయల వరకూ మోసగాళ్లు వసూలు చేసినట్టు తెలిసింది. తాము డబ్బు చెల్లించడానికి వారాల ముందు ఫోన్లలో కొంత మంది యువతుల ఫొటోలను తమకు చూపించారని కొందరు యువకులు తెలిపారు. ఈ యువతులంతా పేద కుటుంబాలకు చెందినవారని, వెంటనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తమకు చెప్పారని కొందరు యువకులు పేర్కొన్నారు.

ఈ పెళ్లి కోసం రాహుల్‌ అనే యువకుడు హర్నియాకలాన్‌ నుంచి వచ్చాడు. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద 25వేల రూపాయల చొప్పున చెల్లించాలని తమకు చెప్పారని అతను తెలిపాడు. ఇండోర్‌లోని మాతృ ఛాయా ఆశ్రమం యువతులను తమకు ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పారని పేర్కొన్నాడు. తాము పెళ్లి చేసుకోబోయే యువతుల ఫొటోలు అడిగితే.. సామాజిక మాధ్యమాల్లోని మోడల్స్‌ ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసి, వాటిని తమకు పంపించారని రాహుల్‌ తెలిపాడు. పెళ్లి రోజుకు ముందు రోజే దేవాస్‌కు రావాలని తమకు చెప్పారని పేర్కొన్నాడు. ఆ రోజు సామూహిక వివాహాలు నిర్వహిస్తామన్నారని తెలిపాడు. కట్నకానుకలపైనా తమకు హామీ ఇచ్చారని వివరించాడు. కానీ.. తాము పెళ్లి మండపానికి చేరుకునేసరికి అక్కడ ఎవరూ లేరని, అప్పటి వరకూ తమతో మాట్లాడినవారి ఫోన్లన్నీ స్విచ్‌ఆఫ్‌ అయిపోయాయని అతడు తెలిపాడు.

పెళ్లికి సాధారణ దుస్తుల్లో రావాలని, హల్దీ వంటి వేడుకలు ఇంటి వద్ద చేసుకోవద్దని ఆర్గనైజర్లు తమకు సూచించారని ఓం ప్రకాశ్‌ అనే మరో బాధితుడు తెలిపాడు. పెళ్లి దుస్తులు, అన్ని సంప్రదాయాలు పెళ్లి మండపంలోనే నిర్వహిస్తారని చెప్పారని పేర్కొన్నాడు. తమకు మొబైల్‌ఫోన్లలో వచ్చిన ఫొటోల నుంచి తాము పెళ్లి కుమార్తెలను ఎంపిక చేసుకున్నామని ఓం ప్రకాశ్‌ చెప్పాడు.

ఈ పెళ్లిళ్ల కోసం కొంత మంది కార్లు మాట్లాడుకుని మరీ వేదిక వద్దకు వచ్చారు. ఇదిగో వస్తున్నారు.. అదిగో వస్తున్నారు.. అంటూ అక్కడ ఉన్నవాళ్లు తమకు చెబుతూ వచ్చారని, అర్థరాత్రి అవుతున్నా వారి జాడ లేకపోవడంతో తాము నిలదీశామని ఒక యువకుడి సోదరి చెప్పారు. అనేక మంది కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారని, తీరా పెళ్లి లేకపోయేసరికి వారంతా తీవ్ర అవమానానికి గురయ్యారని ఆమె చెప్పారు.

ఈ ఉదంతం మే 24వ తేదీన తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ముకేశ్‌ అనే ప్రధాన నిందితుడిని గుర్తించామని, అతడి భార్యను సైతం అరెస్టు చేశామని తెలిపారు. ఈ మొత్తం మోసం ఎలా జరిగిందనే విషయంలో పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.

Read Also |

ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అయితే బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లే.. నిర్లక్ష్యం వద్దు ప్రాణాలకే ప్రమాదం!
Ranveer Singh| ముదురుతున్న ‘డాన్ 3’ వివాదం .. రణ్‌వీర్ సింగ్‌పై సహాయ నిరాకరణ ఆదేశాలు, రూ.45 కోట్ల నష్టం ఆరోపణలు!
Greater painted-snipe | అరుదైన ఘ‌ట‌న‌.. గుడ్ల‌ను పొదుగుతున్న మ‌గ ప‌క్షి..!