• Telugu News
  • /National

రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్..మధ్యప్రదేశ్ లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jun 11, 2026, 4:09 pm IST
Read Time: 4 mins
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్..మధ్యప్రదేశ్ లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ ఎదురైంది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో బీజేపీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు స్థానాలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులు తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మూడవ స్థానానికి మహేష్ కేవత్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలలో అధికార బీజేపీకి 164మంది ఎమ్మెల్యేల బలం ఉంది. రెండు ఎంపీ స్థానాలు గెలిచేందుకు బీజేపీకి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. ఒక రాజ్యసభ అభ్యర్థికి 58మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కు 63మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ సునాయసంగా గెలిచే పరిస్థితి ఉంది. అయితే బీజేపీ అనూహ్యంగా మూడో అభ్యర్థిగా మహేష్ కేవత్‌ ను బరిలోకి దించి పోటీని ఉత్కంఠభరితంగా మార్చింది. దీంతో క్యాంపు రాజకీయాలకు తెరలేచింది. ఇంతలోనే మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ లో ఓ ప్రైవేటు కేసు వివరాలను వెల్లడించలేదన్న కారణంతో ఆర్వో ఆమె నామినేషన్ తిరస్కరించారు. దీంతో బరిలో ఉన్న ముగ్గురు బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది.

రేపు సుప్రీంకోర్టులో విచారణ

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించిన వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ తప్పు అని న్యాయస్థానం భావించిన పక్షంలో మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ తిరిగి నిర్వహించాల్సి రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో రేపటి సుప్రీంకోర్టు విచారణపై అందరి దృష్టి నెలకొంది.