విధాత: తెలుగు రాష్ట్రాలను వణికించిన పెద్దపులులలో ఒక్కటి చిక్కింది. తూర్పు గోదావరి జిల్లాలో గత ఏడు రోజులుగా పంటపొలాలు, జనావాసాల్లో సంచరిస్తూ రైతులను, ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పెద్దపులిని కూర్మపురం సమీపంలో అటవీ శాఖ అధికారులు 4 గంటలు రెస్క్యూ ఆపరేషన్ చేసి ఎట్టకేలకు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. ఏపీ అటవీశాఖ అధికారులు, ఫుణె నుంచి వచ్చిన రెస్క్యూ నిపుణుల బృందం సంయుక్త వ్యూహంతో మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చాకచక్యంగా దాన్ని బంధించారు.
పెద్దపులిని పట్టుకునే క్రమంలో తొలి ప్రయత్నంలో గన్‌తో మత్తు ఇంజక్షన్ ప్రయోగించినా అది పనిచేయలేదు. ఆ తర్వాత వంద మీటర్ల దూరం వెళ్లిన పులిపై రెండోసారి ప్రయోగించగా మత్తెక్కి.. అక్కడి చెరువుగట్టు వద్ద పడిపోయింది. తర్వాత బోనులో బంధించి రాజమహేంద్రవరం తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించి విశాఖపట్నంలోని జంతు సంరక్షణ కేంద్రానికి (జూపార్కు) తరలించి పర్యవేక్షిస్తున్నారు.
మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోకి వచ్చిన పులి వారంరోజులుగా 600కిలో మీటర్లు నడిచి తూర్పుగోదావరి జిల్లాలోని అభయారణ్యాలు, గోదావరి నది దాటి పరీవాహక ప్రాంతాలు, పొలాల్లో సంచరించింది. రాజానగరం, రాజమహేంద్రవరం గ్రామీణ మండలాల్లో 8 మూగజీవాలను వధించింది.
తెలంగాణలో చిక్కని పెద్దపులులు
ఏపీలోని పెద్దపులిని బంధించడంతో అక్కడి ప్రజలు, రైతుల భయాలు, కష్టనష్టాలు తీరిపోయాయి. అయితే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా వాసులను వణికించి ప్రస్తుతం జనగామా జిల్లా రఘునాథపురంలో సంచరిస్తున్న నాలుగేళ్ల రాయల్ బెంగాల్ టైగర్ మాత్రం ఇంకా అటవీ అధికారులకు చిక్కలేదు. మహారాష్ట్ర తడ్వాయి టైగర్ రిజర్వ్ జోన్ నుంచి 300కిలో మీటర్ల మేరకు ప్రయాణించి..అదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట జిల్లా అటవీ ప్రాంతం నుండి వచ్చిన పులి.. యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా సంచరిస్తూ జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని కుందారం గ్రామంలోకి ప్రవేశించింది. అక్కడ లేగదూడను చంపిన పెద్దపులి సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు. పెద్దపులి సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిందని వారు చెబుతున్నారు.
మరోవైపు అదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో తాంసీలో సంచరిస్తున్న పెద్ద పులిని బంధించేందుకు ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో దాని సంచారాన్ని గుర్తిస్తూ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ పెద్దపులి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుండి పెన్‌గంగ నది దాటి వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాలో గత 5 రోజులు సంచరిస్తూ భయాందోళనకు గురిచేస్తున్న పెద్దపులిని ఈరోజు కూర్మపురం సమీపంలో అటవీ శాఖ అధికారులు 4 గంటలు రెస్క్యూ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు . ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా
పెద్ద పులి పట్టుకున్న
ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ అధికారులుకు మరియూ
పుణె నుంచి… pic.twitter.com/WUAn8LqXPU— Gedela Chaitanya (@ChaituJSP) February 6, 2026
