Sulfur dioxide | రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్( Hyderabad ) ఊపిరి ఆగుతుందా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు ఇటీవల ఐఐటీ కాన్పూర్( IIT Kanpur ) విడుదల చేసిన నివేదికనే నిదర్శనం. హైదరాబాద్( Hyderabad ) నగరం వ్యాప్తంగా సల్ఫర్ డయాక్సైడ్ ( Sulfur dioxide ) కాలుష్యం విపరీతంగా పెరిగిందని, దీనికి వాహనాలు, పరిశ్రమలే ప్రధాన కారణమని ఐఐటీ కాన్పూర్ తన అధ్యయనంలో పేర్కొంది. కాలుష్య నియంత్రణ మండలి అభ్యర్థన మేరకు ఐఐటీ కాన్పూర్ ఈ అధ్యయనం చేపట్టింది.
సాధారణంగా హైదరాబాద్ నగరం లోపలి కంటే శివారు ప్రాంతాల్లో కాలుష్యం తక్కువగా ఉంటుంది. కానీ, శివారు ప్రాంతాలైన ఔటర్ రింగ్ రోడ్డు వంటి చోట్ల నగరంలో కంటే అధిక కాలుష్యం ఉండటం గమనార్హం. ఐఐటీ కాన్పూర్ అధ్యయనం ప్రకారం.. ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో రోజుకు 18,101 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ విడుదల అవుతున్నట్లు తేలింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో ఇది 10,701 కిలోలుగా నమోదైంది.
కంటికి కనిపించని, వాసన తెలియని ఈ సల్ఫర్ డయాక్సైడ్.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఊపిరి పీల్చినప్పుడల్లా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో 91శాతం వాహనాల నుంచి, ఓఆర్‌ఆర్‌లో 92శాతం పరిశ్రమల నుంచి వెలువడుతున్నట్టు పేర్కొంది. ఇంత మొత్తంలో విడుదలవ్వడం గాలి నాణ్యతతో పాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.
ఆరోగ్యంపై సల్ఫర్ డయాక్సైడ్ ప్రభావం ఇలా..
ఆస్తమా, బ్రాంకైటిస్, సీవోపీడీ వంటి శ్వాస సంబంధిత వ్యాధులు పెరగడం, ఇప్పటికే ఉన్నవారిలో తీవ్రత పెరుగుతుంది.
కళ్లు, ముక్కు, గొంతు మంట, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
దీర్ఘకాలిక ప్రభావంతో ఊపిరితిత్తుల పనితీరు మందగించే ప్రమాదముంది.
ఇలా చేయాలి
పరిశ్రమల్లో ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ పద్ధతిని అనుసరించాలి.
కాలం చెల్లిన పాత వాహనాలను బ్యాటరీ వాహనాలుగా మార్చాలి.
ఎలక్ట్రిక్ కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు వినియోగించేలా ప్రోత్సాహం ఇవ్వాలి.
ఓఆర్‌ఆర్ సమీపంలోని పరిశ్రమల్లో ఉద్గారాల నియంత్రణకు స్క్రబ్బర్లను తప్పనిసరి చేయడంతో పాటు నిరంతరం తనిఖీ చేయాలి.
