విధాత: సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నట్లు వైరల్ అవుతున్న వార్తలకు తెర పడినట్టే. ఎందుకంటే.. మాలిక్ సన్నిహితుడు ఈ విడాకుల వార్తలపై స్పందించాడు. సానియా, షోయబ్ విడాకులు తీసుకుంటున్న విషయం వాస్తవమే అని, కానీ అధికారికంగా జరగలేదన్నారు.
ఓ టీవీ చానెల్ వద్ద మాలిక్ సన్నిహితుడు మాట్లాడుతూ.. సానియా, మాలిక్ విడాకుల వార్తలపై స్పందించారు. వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నది వాస్తవమేనని ధృవీకరించారు. సానియా, షోయబ్ జంట విడిపోవాలని నిర్ణయించుకున్నారని, అధికారిక ప్రకటనే మిగిలిందని పేర్కొన్నారు.
అంతకంటే ఎక్కువ విషయాలను తాను మాట్లాడలేనని తెలిపారు. కానీ వారిద్దరూ విడిపోయారని నిర్ధారించగలనని అతను స్పష్టం చేశారు. ప్రస్తుతం సానియా లండన్‌లో ఉండగా, మాలిక్ పాకిస్తాన్‌లో ఉన్నారు. ఈ దంపతులకు నాలుగేండ్ల కుమారుడు ఇజాన్ ఉన్నాడు. 2010లో సానియా, షోయబ్ మాలిక్‌లకు పెళ్లి అయింది.
అయితే సానియా ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు.. వారి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. పగిలిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి.. అల్లాను చేరేందుకేనా అంటూ సానియా రాసుకొచ్చారు. కానీ మాలిక్, సానియా మధ్య ఎటువంటి సమస్యలున్నాయో తెలియదు కానీ.. వారిద్దరూ విడిపోయినట్లు కొద్ది రోజుల క్రితమే పాక్ మీడియా పేర్కొంది.