విధాత: పూజా హెగ్డే.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ తేజ్ తొలి చిత్రం ‘ముకుంద’ అనే మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.కానీ రెండో చిత్రం ‘ఒక లైలా కోసం’, ముకుంద కంటే ముందు విడుదలైంది. ఇందులో నాగచైతన్య హీరోగా నటించాడు. ఇంతలోనే బాలీవుడ్ ఛాన్స్ వచ్చింది. హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన ‘మొహంజదారో’ మూవీలో నటించింది. ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్టర్.
అనంతరం అల్లు అర్జున్, దిల్ రాజు, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథం’తో ఈ అమ్మడి దశ తిరిగిపోయింది. ఆమె వేసిన బికినీకి యువతరం సాహో అన్నారు. ఇక ఆ తర్వాత సుకుమార్, రామ్‌చరణ్ కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో ఐటం బామగా నర్తించి జిగేల్ రాణిని తన ఇంటి పేరు చేసుకుంది.
బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం, జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ, మహేష్ బాబు మహర్షి, వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్, బాలీవుడ్లో హౌస్‌ఫుల్ 4 , తెలుగులో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో, అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సర్కస్, ప్రభాస్ రాధే శ్యామ్.. చిరంజీవి, చరణ్‌ల ఆచార్య, కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా బీస్ట్ వంటి చిత్రాల్లో నటించింది.
మొత్తంగా చెప్పాలంటే వరుణ్ తేజ్, నాగచైతన్య, అల్లు అర్జున్, రామ్ చరణ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అఖిల్, బాలీవుడ్ స్టార్ విజయ్ ఇలా దాదాపు యువ స్టార్ హీరోలందరిని ఓ రౌండ్ వేసింది. దక్షిణాదిలోనే అగ్రశ్రేణి కథానాయక అనిపించుకుంది. ఈ ఏడాది పూజా హవా బాగానే సాగింది.
2023లో అంటే వచ్చే ఏడాది కూడా ఆమె నుంచి జోరుగా సినిమాలొస్తున్నాయి. అందుకోసం పూజ పారితోషకం అమాంతంగా పెంచేసిందని, అందువల్ల పూజా హెగ్డేని తమ సినిమాలలో పెట్టుకునేందుకు నిర్మాతలు భయపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వీటన్నింటినీ అర్థం లేని కామెంట్లుగా కొట్టి పారేసింది పూజ.
నేను డబ్బులు కోసం పని చేస్తానా? నేనే కాదు ఎవరూ అలా చేయరు. మనకంటూ ఒక పేరు వచ్చాక దాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మంచి కథలు, చక్కని పాత్రలు వచ్చినప్పుడు పారితోషికం అనేది అసలు లెక్కలోకే రాదు. వరుసగా పది సినిమాలు చేసేసి కావాల్సింది సంపాదించుకొని పక్కకు పోయే ఉద్దేశం ఉండేవాళ్లు పారితోషికాల గురించి ఆలోచిస్తారేమో…?
నేను ఆ టైప్ కాదు. ఓ సినిమా కోసం ఆరేడు నెలలు కష్టపడతాం. సెట్లో ప్రతిరోజూ మనస్ఫూర్తిగా పనిచేయాలంటే డబ్బులు ఒక్కటే కొలమానం కాదు. ఓ సినిమాతో నా అభిమాన గణం పెరిగినా.. పెరగకపోయినా వాళ్లతో ఈ పాత్రలో పూజ ఎందుకు చేసింది? అనిపించుకోకపోతే చాలు.
నేను కొన్ని సినిమాలు వదులుకున్న మాట వాస్తవం. దానికి చాలా కారణాలు ఉన్నాయి… అని చెప్పుకొచ్చింది ఈ బుట్ట బొమ్మ. ప్రజంట్ మహేష్‌తో మరోసారి ఈ ముద్దుగుమ్మ జతకట్టబోతోంది.