విధాత : కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద మంగళవారం సాయంత్రం పోలీసులు భద్రత పెంచారు. లా ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి, రేవంత్ నివాసం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను, అభిమానులను కొద్ది దూరంలో ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్దనే నిలిపివేస్తున్నారు. రేవంత్ నివాసం వైపు ఎవరినీ అనుమతించడం లేదు.
మరోవైపు సచివాలయంలో ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయాన్ని కూడా అధికారులు ముస్తాబు చేస్తున్నారు. ఇంకోవైపు సీఎం కాన్వాయ్ వాహనాలను సైతం సిద్ధం చేశారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ శ్రేణులతో పాటు అంతా హైకమాండ్ ప్రకటన కోసం ఎదురుచూపులు పడుతున్నారు. అధికారులు మాత్రం తమ ప్రోటోకాల్ మేరకు చేయాల్సిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ నెల 7న సీఎం, మంత్రివర్గం ప్రమాణస్వీకారం ఉండవచ్చని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అప్పటికల్లా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, సచివాలయాన్ని, మంత్రులకు కార్యాలయాలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. 7న ప్రమాణ స్వీకారం అవగానే.. ముఖ్యమంత్రి, మంత్రులు కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరిస్తారు. అప్పటినుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మొదలవుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ దగ్గరుండి మరీ కట్టించుకున్న నూతన సెక్రటేరియట్‌లో కొద్ది నెలలు కూడా ఉండి పనిచేసే అవకాశం దక్కలేదు. ప్రగతిభవన్‌ను కూడా ఆయన ఖాళీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ సీఎం అధికారిక నివాసంగా ప్రగతిభవన్‌నే కొనసాగిస్తారా? లేక హామీ ఇచ్చిన విధంగా ప్రజాదర్బారులకు మాత్రమే వేదికగా చేస్తుంటారా? అన్న విషయం తేలాల్సి ఉన్నది.