విధాత: తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరు కావాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కు 41A సీఆర్పీసీ కింద సిట్ పోలీసులు నోటిసులు జారీ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలకు రూ.100 కోట్లు సమకూరుస్తానని రఘురామ కృష్ణం రాజు చెప్పినట్టు సిట్ పోలీసులకు ఆధారాలున్నట్లు చెబుతున్నారు. దీంతో ఆయనను విచారించాలని నిర్ణయించారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయడానికి అనుమతివ్వాలని సిట్, తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. ఇప్పటికే సంతోష్‌కు విచారణకు రావాలని నోటీసులు పంపిన పోలీసులు, విచారణకు రాకపోవడంతో కేసు కూడా నమోదు చేశారు.
బీఎల్ సంతోష్‌కు ఈనెల 16 నుంచి నోటీసు అందజేయడానికి ప్రయత్నిస్తున్నా, ఆయన అందుబాటులోకి రావడం లేదని, ఈ పరిస్థిత్తుల్లో సంతోష్‌ను అరెస్టు చేయడానికి అనుమతించాలని సిట్ పోలీసులు హైకోర్టును కోరారు. బీఎల్ సంతోష్‌షకు ఎవరైనా కోర్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నారా? అని ప్రశ్నించిన హైకోర్టు.. ఎవరూ ముందుకు రాకపోవడంతో మరోసారి 41ఏ నోటీసు ఇచ్చేందుకు సిట్‌కు అనుమతి మంజూరు చేసింది. ఈమెయిల్, వాట్సప్ ద్వారా నోటీసు పంపేందుకు అనుమతిచ్చింది.
ఏ నోటీసులు రాలేదు: రఘురామ
తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరు కావాలని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సిట్ నోటీసలు ఇచ్చిందని మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై వైసీపీ ఎంపీ స్పందించారు. ఢిల్లీలో ఉన్న తనకు ఇప్పటి వరకు ఏ నోటీసులు రాలేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద కూడా నిన్నటిదాకా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. తనకు నోటీసులు ఇచ్చారనే ప్రచారంపై రఘురామ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతానని తెలియజేశారు. ఒకవేళ 41ఏ కింద నోటీసులు ఇస్తే ఏం చేయాలో కూడా తెలుసని స్పష్టం చేశారు.
సిట్ నోటీసు.. హైకోర్టుకు న్యాయవాది ప్రతాప్
సిట్ నోటీసుపై న్యాయవాది పి.ప్రతాప్ హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆయనకు సిట్ 41ఏ కింద నోటీసులు ఇచ్చింది.
ఈ నెల 22న ఇచ్చిన నోటీసు రద్దు చేయాలని, ఈ నెల 25న విచారణకు హాజరుకావాలన్న నోటీసుపై స్టే ఇవ్వాలని ప్రతాప్ హైకోర్టును కోరారు.