Site icon vidhaatha

స‌జావుగా ధాన్యం కొనుగోళ్లు: మంత్రి గంగుల‌

విధాత‌: సీఎం కేసీఆర్ ఆదేశాల‌తో రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు స‌జావుగా సాగుతున్నాయ‌ని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంగ‌ళ‌వారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధాన్యం కొనుగోళ్లపై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని కోరారు.మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీక్లీనర్లు, గన్నీబ్యాగులు సరిపడినన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోళ్లు గత సంవత్సరం ఇదే రోజుతో పోలిస్తే దాదాపు 83వేల మెట్రిక్ టన్నులు ఎక్కువగా సేకరించామన్నారు.

సోమవారం వరకూ 1,32,989 మంది రైతుల నుండి 8.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి తెలిపారు. ఇందుకు 2.23 కోట్ల గన్నీబ్యాగులను వినియోగించామన్నారు. ధాన్యం పూర్తి సేకరణకు అవసరమైన గన్నీబ్యాగులు ఉన్నాయ‌ని, ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లోనే వానాకాలం ధాన్యం సేకరణ అధికంగా జరుగుతుందని వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా కోతలకు అనుగుణంగా 4579 కొనుగోలు కేంద్రాలను తెరిచామన్నారు. రైతుల‌ అవసరాల మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు ఫెయిర్ ఆవరేజ్ క్వాలిటీతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, ఎఫ్.ఏ.క్యూ వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే సేకరిస్తారని చెప్పారు.

దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే కనీస మద్దతు ధర గ్రేడ్ఏ 2,060, కామన్ రకానికి 2,040 రూపాయలు చెల్లిస్తూ ధాన్యం సేకరిస్తుంద‌ని తెలిపారు. స‌మీక్ష‌లో సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ వి.అనిల్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణి, పౌరసరఫరాల సంస్థ జీఎం రాజారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Exit mobile version