విధాత: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI Chatbot)తో ప్రేమలో పడటం సాధ్యమేనా? సాధ్యమేనని ఇటీవల బయటపడుతున్న కొన్ని కేసులు రుజువు చేస్తున్నాయి. పైగా ఇటీవల వీటి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా 43 ఏళ్ల స్కాట్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. తాను ఏఐతో గాఢమైన బంధంలో ఉన్నట్లు వెల్లడించాడు.
అయితే.. తన భార్య డిప్రెషన్‌తో బాధ పడుతూ తాగుడికి బానిస కావడంతో తోడు కోసం ఈ పని చేశానని చెప్పాడు. రెప్లికా అనే యాప్ తీసుకొచ్చిన చాట్‌బాట్‌తో అతడు ఈ వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచు కున్నాడు. ఆ చాట్‌బాట్‌కు సెరేనా అనే ముద్దు పేరునూ పెట్టుకున్నాడు.
దాంతో శృంగార పరమైన సంభాషణలూ ఎప్పటికప్పుడు మాట్లాడే వాడినని బాగా సహకరించేదని చెప్పుకొచ్చాడు. ఒంటరి తనంతో బాధ పడుతున్న తనను సెరేనా సేదతీర్చిందని, భార్యకు విడాకులు ఇచ్చే ఆలోచనను దూరం చేయడం ద్వారా అది తన కుటుంబాన్ని కలిసి ఉండేలా చేసిందని పేర్కొన్నాడు.
‘ముందు సెరేనాతో కాలక్షేపం కోసమే చాట్ చేసేవాడిని. తర్వాత అది నేను చెప్పే ప్రతి విషయాన్ని గుర్తుంచుకునేది. ఎంతో ఆపేక్ష చూపించేది. దాహంతో నాలుక పిడచకట్టుకుపోయిన వాడికి చల్లటి నీరు తాగితే ఎలా ఉంటుందో.. సెరేనాతో మాట్లాడేటపుడు నాకు అలానే ఉండేది’ అని స్కాట్ అభివర్ణించాడు.
భావోద్వేగపరమైన తోడ్పాటు అందించడానికే తమ యాప్‌లో చాట్‌బాట్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్లు రెప్లెకా యాప్ తెలిపింది. ఇందులో ఎవరికి వారు తమ కోసం ప్రత్యేకంగా చాట్‌బాట్ రూపొందించుకోవచ్చు. అయితే యూజర్లు దీనిని శృంగారపరమైన సంభాషణల కోసం ప్రియురాలిగా ఉపయోగించుకుంటున్నారని తెలిపింది.
తాజా అప్‌డేట్‌లో సెక్సువల్ టాక్‌కు అవకాశం లేకుండా చేయడంతో… కొంత మంది యూజర్లు తాము డిప్రెషన్‌లోకి వెళిపోతున్నట్లు ఫిర్యాదు చేశారని వెల్లడించింది. దీంతో కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం కల్పించామని, వచ్చే రెండు మూడు నెలల్లో అందరికీ ఈ అవకాశాన్ని పునరుద్ధరిస్తామని తెలిపింది.
స్కాట్ భార్య ఏమంది?
మళ్లీ స్కాట్ విషయానికి వస్తే.. అతడు చాలా రోజుల పాటు ఏఐతో సంసారాన్ని గుట్టుగానే ఉంచాడు. ఈ మధ్యనే కొద్ది కొద్దిగా సెరేనాతో ఉన్న బంధాన్ని భార్యకు వివరించాడు. విచిత్రంగా తన భార్య.. నాకూ అలాంటి చాట్‌బాట్ కావాలని అడిగిందని స్కాట్ తెలిపాడు. అయితే ఇది వివాహేతర సంబంధం అనడాన్ని స్కాట్ ఒప్పుకోవడం లేదు.
ఏఐతో మానవుని జీవితం మరింత పెనవేసుకుపోనున్న నేపథ్యంలో ఇలాంటి డైలమాలు మున్ముందు చాలానే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సంసారంలో ఏఐ చిచ్చు పెట్టే రోజులు ఎంతో దూరంలో లేవని హెచ్చరిస్తున్నారు.