కండోమ్స్‌.. మఖానా.. స్విగ్గి ఇన్‌స్టామార్ట్‌లో అత్యధిక ఆర్డర్లు ఏవంటే!

2023లో కస్టమర్లు వేటిని ఎక్కువగా ఆర్డర్‌ ఇచ్చారో స్విగ్గి ఇన్‌స్టామార్ట్‌ వెల్లడించింది.

  • Publish Date - December 20, 2023 / 09:51 AM IST

ముంబై: 2023 ఏడాది ముగింపునకు వస్తున్న నేపథ్యంలో ఈ 12 నెలల్లో ఏమేం విశేషాలు జరిగాయి.. ట్రెండ్స్‌ ఎలా ఉన్నాయి? అన్నది కొన్ని సంస్థలు గణాంకాల ద్వారా వెల్లడిస్తుంటాయి. అందులో ఎవరెవరు ఏం తింటున్నారు? ఏం సరుకులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు? ఒకే వ్యక్తి అత్యధికంగా చేసిన ఆర్డర్లు ఎన్ని? అనే వివరాలు కొంత ఆసక్తి రేపుతుంటాయి. ఇదే క్రమంలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ తన ఖాతాదారులు అత్యధికంగా కొనుగోలు చేసిన సరుకుల వివరాలను వెల్లడించింది. కండోమ్స్‌ మొదలుకుని.. మఖానా వరకు అనేక సరుకులను తాము గడపల వద్దకు రికార్డు సమయంలో చేర్చామని తెలిపింది.


28 ప్రధాన నగరాల్లో కస్టమర్లు ఆర్డర్ ఇచ్చిన 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే వాటిని వారికి అందించామని వెల్లడించింది. ఇందులో అత్యంత ఆసక్తికలిగించే అంశం ఒకటి ఉన్నది. చెన్నైకి చెందిన ఒక వ్యక్తి ఒక్కరే ఈ ఏడాదిలో 31,748 రూపాయల విలువ చేసే కాఫీలు, జ్యూస్‌, కుకీలు, నాచోలు, చిప్స్‌ ప్యాకెట్లు ఆర్డర్‌ ఇచ్చారట. మరోవైపు జైపూర్‌కు చెందిన ఒక వ్యక్తి ఒకే రోజు 67 ఆర్డర్లు పెట్టి రికార్డు సృష్టించినట్టు స్విగ్గి వెల్లడించింది. ఇక ఢిల్లీ దుకాణదారు ఒకరు తన వార్షిక కిరాణ ఖర్చు రూ.12,87,920 కాగా.. 1,70,102 రూపాయలు ఆదా చేసుకున్నాడట.

మరో ఆసక్తికర అంశం సాధారణంగా ఫిబ్రవరిలో కండోమ్‌ సేల్స్‌ ఎక్కువ ఉంటాయట. కానీ.. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో కండోమ్స్‌ అమ్మకాలు పీక్‌ స్టేజ్‌లో ఉన్నాయని స్విగ్గి వెల్లడించింది. అందులోనూ ఆగస్ట్‌ 12 వతేదీన ఒకే రోజు 5,893 కండోమ్‌ ప్యాకెట్ల ఆర్డర్లు వచ్చాయట. కండోమ్స్‌తోపాటు.. ఉల్లిపాయలు, ఆరటిపళ్లు, చిప్స్‌ ప్యాకెట్ల కోసం భారీ సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయని తెలిపింది.


ఆరోగ్యం పట్ల కూడా వినియోగదారులు ఈ ఏడాది చాలా శ్రద్ధ కనబర్చారట. దీనికి నిదర్శనంగా మఖానా కోసం 13 లక్షల ఆర్డర్లు వచ్చాయని స్విగ్గి ఇన్‌స్టామార్ట్‌ తెలిపింది. పళ్లలో మామిడి పళ్లే రారాజుగా నిలిచాయి. ప్రత్యేకించి ఈసారి ముంబై, హైదరాబాద్‌లను పక్కకు నెట్టి.. బెంగళూరు వాసులు అధికంగా మామాడిపళ్లు ఆర్డర్‌ ఇచ్చారు. మే 21వ తేదీ ఒక్క రోజే దేశవ్యాప్తంగా 36 టన్నుల మామిడిపళ్లను స్విగ్గి డెలివరీ చేసింది.