విధాత: మనం ఏ ఊళ్లో అయితే అధికారం కావాలనుకుంటున్నామో… ఆ ఊళ్లోనే సేవకుడిగా ఉండాలి.. లేదా ఆ ఊరికి ఉపయోగపడే పనుల్లో భాగం పంచుకోవాలి. అంతేకానీ ఈ ఇంట్లో బువ్వ తిని.. ఆ ఇంట్లో చేతులు కడుక్కుంటాను అంటే బాగోదు కదా… ఇప్పుడు జనసేనాని కూడా అచ్చం అలాగే వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని కోరుకుంటూ ఇక్కడ రాజకీయాలు చేయాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ తన అధికారిక కార్యకలాపాలు సైతం ఇక్కడే చేపడితే బాగుణ్ను. ప్రజల మద్దతూ దక్కేది. కానీ ఆయన రాజకీయ నిర్ణయాలు, ఎత్తుగడలు, అన్నీ హైదరాబాదులోనే తీసుకుంటారు. ఇంకా రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు, పొత్తుల వంటి వాటి మీద చర్చలు, రహస్య సమాలోచనలు సైతం హైదరాబాదులోనే ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం సైతం తెలంగాణలోనే ఉంది. ఆశ్చర్యంగా తమ ప్రచార వాహనం వారాహి కూడా హైదరాబాదులోనే రిజిష్టర్ చేయించారు. అంటే వాహనానికి సంబంధించిన పన్నుల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి, అక్కడి సమాజానికి ఉపయోగపడుతుందన్న మాట. కానీ ఆ వాహనం మీద వచ్చి, ఆంధ్రా ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారన్న మాట.
ఇదేమీ చట్టవిరుద్ధం కాదు.. వేరే రాష్ట్రాలలో రిజిష్టర్ చేసిన వాహనాలను ఇంకో రాష్ట్రంలో నడపరాదని రూలేమీ లేదు కానీ బాధ్యతాయుతమైన నాయకుడిగా తన వాహనాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఆర్టిఏతో దగ్గర అనుమతులు తెచ్చుకుని, పన్నులేవో ఇక్కడే చెల్లిస్తే బాగుండు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలా చేసి ఉంటే… చూడండి నేనూ ఇక్కడి వాడినే.. నేనూ ఈ రాష్ట్ర ప్రగతిలో భాగమయ్యాను.. నన్ను ఆశీర్వదించండి అని అడిగే నైతిక హక్కు పవన్ కు ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా ఉంటూ మొన్న రిజిస్ట్రేషన్ ఆపిన రవాణా శాఖ ఆ తరువాత వాహనం రంగు, ఇతర అంశాల్లో చిన్నచిన్న మార్పులు చేయడంతో ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆ వారాహి వాహనం ఇకపై ఆంధ్రప్రదేశ్ రోడ్లమీద నాలుగు చెరగులా తిరుగుతూ ప్రచార కార్యక్రమాల్లో పవన్, ఇతర పార్టీ పెద్దలకు ఉపయోగపడనుంది.