విధాత: ఎట్టకేలకు టిడిపి పార్టీ శ్రేణులు మళ్లీ జనంలో సందడి చేస్తున్నాయి. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాలతో నియోజకవర్గ కన్వీనర్ల ఆధ్వర్యంలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశం పేరుతో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టారు. ప్రతి ఇంటికి, దుకాణానికి వెళ్లి మరి టిడిపి నాయకులు, కార్యకర్తలు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
చాలా రోజుల తర్వాత పసుపు జెండాలు, చొక్కాలు, కండువాలు ధరించి తమ వద్దకు వచ్చిన టిడిపి సభ్యత్వ నమోదు బృందాలను ప్రజలు ఆసక్తిగా చూడడం కనిపించింది. సభ్యత్వ నమోదుకు తమ వద్దకు వచ్చిన పసుపుదండను కాదనలేక పలువురు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరిస్తున్నారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఎల్.వి.యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటికి టిడిపిలో భాగంగా సభ్యత్వ నమోదును జోరుగా నిర్వహించారు.
నకిరేకల్ నియోజకవర్గంలో కాసనగోడు గ్రామంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి యాతాకుల అంజయ్య ఆధ్వర్యంలో సభ్యత్వం ప్రక్రియ సాగింది. మునుగోడు, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట సహా ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహిస్తున్నాయి.
టిడిపి పార్టీ ఉనికిని మళ్లీ బలంగా చాటేందుకు రానున్న ఎన్నికల్లో నిర్ణయాత్మక భూమిక పోషించాలన్న లక్ష్యంతో పార్టీ నాయకత్వం సభ్యత్వ నమోదును పట్టుదలగా సాగిస్తుంది. ఉమ్మడి రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించి రాష్ట్ర రాజకీయాల్లో, పాలనలో కొత్త ఒరవడి సృష్టించిన టిడిపి పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పిదప మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉనికి కోసం తిప్పలు పడుతుంది.
2018 ఎన్నికల అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం కరువైపోయింది. అయితే రానున్న ఎన్నికల్లో తిరిగి అసెంబ్లీలో ప్రాతినిధ్యం సాధించే దిశగా, కలిసి వచ్చే మిత్రపక్షాలను సీట్ల పంపకాల్లో డిమాండ్ చేసే స్థాయికి ఎదిగేలా పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పార్టీ శ్రేణులు వ్యూహాత్మకంగా మళ్లీ క్షేత్రస్థాయిలో క్రియాశీలక మయ్యాయి.
పార్టీకి మొదటి నుండి అనుకూలంగా ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, పేద వర్గాలు లక్ష్యంగా పార్టీ సభ్యత్వ నమోదును టిడిపి శ్రేణులు ముందుకు దూకిస్తున్నాయి. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా టిడిపి పార్టీ నుండి దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు వంటి నాయకులు ఇద్దరూ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతమెంతో ఘన కీర్తి అన్నట్లుగా సాగిన టిడిపి పార్టీకి పూర్వ వైభవం సాధించేందుకు పార్టీ జిల్లా నాయకులు నెల్లూరు దుర్గాప్రసాద్, ఎల్.వి యాదవ్, జక్కలి ఐలయ్య యాదవ్ వంటి వారు కృషి చేస్తున్నారు. బడుగులకు అండ పచ్చ జెండా అని, గతంలో టిడిపి ప్రభుత్వ పాలన విజయాలను, ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని ముమ్మురంగా నిర్వహిస్తుండడం విశేషం.
కాగా నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో గురువారం నిర్ణయించిన ఇంటింటికి టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ నాయకులు కూరెళ్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, బొంత రమేష్, పాలడుగు నాగరాజు, గోగుల నాగరాజు, M. K. I సిద్ధిక్, వీర్ల పరమేష్, కంచనపల్లి క్రాంతి, జనార్దన్ రెడ్డి, ఒర్సు అనూష, అనిత, మమత, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.