BJP
- కాదంటూ ప్రకటించినా తప్పని ‘కలవరపాటు’
- టార్గెట్ 70 సీట్లు సృష్టించిన కొత్త సమస్య
- వరంగల్ అభ్యర్ధి పేరు చూసి షాక్
- తెరపైకి అనూహ్యంగా గరికపాటి పేరు
- అయోమయంలో ఆశావహులు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్కారును గద్దె దింపి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకరావడమే లక్ష్యమంటూ ప్రకటిస్తున్న ఆ పార్టీ ఆశావహులంతా ఆకస్మాత్తుగా అయోమయంలో పడిపోయారు. ఎమ్మెల్యేల ఫస్ట్ లిస్ట్ పేరుతో హల్ చల్ చేస్తున్న వార్తతో మరోసారి గందరగోళానికి లోనయ్యారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత రాష్ట్ర పార్టీలో నెలకొన్న సంక్షోభం, పర్యవసానంగా రాష్ట్ర సారధిగా కొనసాగిన బండి సంజయ్ ను ఆగమేఘాల మీద దింపేసి ఆయన స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని రంగమెక్కించారు. ఈ ఎపిసోడ్ తో బీజేపీ పైన విశ్వాసం సన్నగిల్లిందనడంలో సందేహంలేదు.
ఈ పరిస్థితి నుంచి పార్టీని గట్టెక్కించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నిర్ధేశించిన లక్ష్యానికి మళ్ళీ అడ్డింకి నెలకొంది. తాజా అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా పేరుతో చక్కర్లు కొడుతున్న పేర్లు మరోసారి పార్టీ నాయకత్వానికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.
తీవ్రగందరగోళాన్ని సృష్టించిన ఫస్ట్ లిస్ట్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే లోక్ సభ ఎన్నికలకు ముందుగా వచ్చే శాసనసభ ఎన్నికలకు పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు ఆ పార్టీ నాయకులు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ తొలి లిస్టు గందరగోళాన్ని సృష్టించింది.
ఈ ఫస్ట్ జాబితాలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ప్రస్తుత ఎంపీలు బండి సంజయ్,సోయం బాపురావు, ధర్మంపురి అర్వింద్, ఈటెల రాజేందర్ తో పాటు ఆయన భార్య జమున, రఘునందన్ రావు, డికె అరుణ, జితేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మురళీధర్ రావు, ఇంద్రసేనారెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, రామచంద్రరావు, విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు తదితరులతో పాటు 31 మంది పేర్లున్నాయి.
‘లిస్ట్ ’ఊహాగానాలకు కారణాలివేనా?
బీజేపీ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని ఆశిస్తున్న వారు సైతం అసెంబ్లీకి పోటీ చేయాల్సిందేనని అధిష్టానం ఆదేశించినట్లు వస్తున్న వార్తలూ, అన్ని పార్టీలు ఈ సారి ఎన్నికలకు కొద్ది నెలల ముందు తొలిజాబితా విడుదల చేస్తామనే ప్రకటనల నేపథ్యం, రాష్ట్రంలో టార్గెట్ 70 సీట్లు అంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్ధేశించినట్లు వచ్చిన వార్తల నేపథ్యం కారణాలుగా భావిస్తున్నారు.
ఈ అభ్యర్ధుల ఫస్ట్ జాబితా పార్టీ శ్రేణులను, ఆశావాహ అభ్యర్ధులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో సైతం ఈ లిస్ట్ తీవ్రంగా వైరలైంది. పార్టీ రాష్ట్ర నాయకత్వం అలాందేమీలేదంటూ ప్రకటన విడుదల చేసినప్పటికీ అయోమయాన్ని మాత్రం ఆపలేక పోతున్నారు.
దీంతో ఆశావహులంతా ‘ఆ లిస్ట్ నిజమా? అబద్దమా? అంటూ’ అధినేతలను అనుమానంతో ప్రశ్నిస్తున్నారు. ముఖ్యనాయకుల వద్దకు వెళ్ళి ఆరా తీస్తున్నారు. తమ పరిస్థితి ఏంటంటూ అడుగుతున్నారు. నేతలు నచ్చచెప్పినప్పటికీ వీరిలో నెలకొన్న అనుమానం మాత్రం వదలడంలేదంటూ ఆశావహ అభ్యర్ధుల సన్నిహితులు చెబుతున్నారు. ఈ జాబితా కొందరికి నిద్రలేకుండా చేసిందంటున్నారు.
ఫస్ట్ లిస్ట్ అంటూ ఏదీ లేదూ
బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధులను నిర్ణయించినట్లు మీడియాలో వస్తున్న కథనాలకు ఎలాంటి ఆధారం లేదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరుతో ఆ పార్టీ కార్యాలయ కార్యదర్శి డాక్టర్. బి. ఉమాశంకర్ గురువారమే ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన విడుదల చేసినప్పటికీ పార్టీలో నెలకొన్న అయోమయాన్ని మాత్రం తగ్గించలేక పోతుందంటున్నారు.
ఆందోళనలో అసెంబ్లీ ఆశావహులు
31 మంది పేర్లతో బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధుల ఫస్ట్ లిస్ట్ అంటూ విడుదలైన జాబితా పలు సెగ్మెంట్లలో అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న వారిలో పాటు వరంగల్ ఎమ్మెల్యే టికెట్ ఆశావహులకు కునుకులేకుండా చేసింది. ఈ లిస్టులో 90శాతం మంది మాజీ ఎంపీలు, ఎంపీ టికెట్ ఆశిస్తున్న వారున్నారు. వీరి పేర్లు ఎమ్మెల్యే అభ్యర్ధులుగా ప్రచారం కావడంతో అసెంబ్లీ టికెట్ ఆశిస్తూ అన్ని విధాలుగా శ్రమిస్తున్న అభ్యర్ధులు ఒక్కసారిగా డీలా పడిపోయారు.
ఈ జాబితాలో వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి వరంగల్ అభ్యర్ధి అంటూ మాజీ రాజ్యసభ సభ్యడు గరికపాటి మోహన్ రావు పేరుంది. ఈ పేరు చూసి పార్టీలోని అన్ని వర్గాలు ఒక విధంగా షాక్ కు గురయ్యాయి. ఎన్నడూ ప్రత్యఓ ఎన్నికల్లో పోటీ చేయని గరికపాటి పేరు తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా వరంగల్ అంటే తూర్పు ఎమ్మ్యెల్యే అభ్యర్ధిగా ప్రకటించడం జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటికే వరంగల్ తూర్పు నుంచి నలుగురు అభ్యర్ధులు టికెట్ ఆశిస్తున్నారు.
గత ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీష్, కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా రోజుల క్రితమే పార్టీలో చేరిన గంట రవికుమార్, ఈ మధ్య టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు కుమారుడు వన్నాల వెంకటరమణ ఉన్నారు. ఈ నలుగరిని కాదని గరికపాటి పేరు తెరపైకి రావడంతో వీరికి ఏం చేయాలో పాలుపోక నిద్రలేని రాత్రలు గడుపుతున్నారు.ఈ జాబితా తప్పనే అభిప్రాయంతో తమను తాము నచ్చచెప్పుకుంటున్నారు.