విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: చేర్యాల ప్రజలారా క్షమించండి! నా తండ్రి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి (Mutthi Reddy) యాదగిరి రెడ్డి కబ్జా చేసి, నా పేరున రిజిస్టర్ చేసిన ఊరి భూమిని తిరిగి ఊరికే అప్పగిస్తున్నానని చెబుతూ ఎమ్మెల్యే కన్నబిడ్డ తుల్జా భవాని సంచలన ప్రకటన చేశారు.
అంతటితో ఆగకుండా చేర్యాలలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసినట్లు ఆరోపిస్తున్న భూమి చుట్టూ పెట్టిన కాంపౌండ్ను ఆదివారం ఆమె సమక్షంలో తొలగించారు. అక్కడ నోటీసు పేరుతో పెద్ద బ్యానర్ను ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యానికి లోను చేశారు.
త్వరలో కబ్జా చేసిన ఈ భూమిని హాస్పిటల్‌కు వినియోగించే విధంగా జిల్లా కలెక్టర్ ను కలిసి రిజిస్ట్రేషన్ చేస్తానంటూ స్వయంగా తుల్జాభవాని మీడియా ముందు ప్రకటన చేయడం విశేషం.
కోట్ల ఆస్తి ఉన్నా తన తండ్రి కక్కుర్తి: ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి
వేలకోట్ల రూపాయల ఆస్తి ఇప్పటికే కలిగి ఉండి, లక్షలాది రూపాయల కిరాయిలు వస్తున్నప్పటికీ, ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా, 73 ఏళ్ల ఈ వయసులో తన తండ్రి ముత్తిరెడ్డి ఇలాంటి భూకబ్జాలకు పాల్పడడం తనకు బాధను కలిగిస్తుందని కుమార్తె తుల్జా భవాని రెడ్డి ప్రకటించారు.
రాజకీయ వర్గాల్లో ఆసక్తి
ముత్తిరెడ్డి కుమార్తె భవాని రెడ్డి ఏం ఆశించి ఇదంతా చేస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెర వెనక సూత్రధారులు ఎవరు లేకుండా, ఈ పరిణామాలు జరగడంలేదని భావిస్తున్నారు. రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది.
దశలవారీగా తండ్రి పై విమర్శలు
తండ్రి ముత్తిరెడ్డి పైన దశలవారీగా సాగుతున్న కుమార్తె తుల్జా భవాని రెడ్డి మధ్య సాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఈ దఫా తుల్జా భవాని రెడ్డి ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం కావడం జనగామ రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి లోను చేసింది. పక్కా ప్లాన్ ప్రకారం తుల్జా భవాని రెడ్డి తండ్రి పై తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తుంది. దానికి తాజా పరిణామాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తన తండ్రి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లక్ష్యంగా ఆమె ఒక్కో అడుగు వేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
ఉప్పల్లో పోలీసులకు ఫిర్యాదు
ఆరు నెలల క్రితం హైదరాబాద్ ఉప్పల్ కేంద్రంగా చేర్యాలలో ఎమ్మెల్యే, తన తండ్రి ఆక్రమించాడని ఆరోపణలు వ్యక్తం అవుతున్న భూమి విషయమై తొలిసారి అడుగు ముందుకు వేసింది. తన సంతకాన్ని తండ్రి ఫోర్జరీ చేశాడని స్వయంగా ఆమె ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసి తండ్రిని తుల్జా భవాని బోనెక్కించింది.
చీటకోడూరులో నిలదీత
తర్వాత కొద్దికాలం ఈ విషయం సర్దుమణిగినప్పటికీ ఇటీవల తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చీటకోడూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హరిత ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన బిడ్డ తుల్జా భవాని రెడ్డి, అల్లుడు సరాసరి అక్కడికి వెళ్లి ప్రజల ముందే ఈ చేర్యాల భూమి విషయమై నిలదీశారు. భూమిని కబ్జా చేసి తన పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని, తర్వాత ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ విమర్శలు గుప్పించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు.
చేర్యాలలో కాంపౌండ్ తొలగింపు
తాజాగా మరోసారి చేర్యాల భూమిపైకి వచ్చి ఆ భూమిని ఊరి ప్రయోజనాల కోసం చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తానంటూ ప్రకటించి కాంపౌండ్ తొలగించడం సంచలనం సృష్టించింది. ఈ భూమిని హాస్పిటల్ కోసం రిజిస్ట్రేషన్ చేస్తానంటూ ప్రకటించారు. ఇది ఇలా ఉండగా తండ్రి బిడ్డల వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో, ఎక్కడ వరకు దారితీస్తుందోనని చర్చ సాగుతోంది.