Telangana MLAs
విధాత: కోర్టుల్లో అనర్హత పిటిషన్ల విచారణ ఎదుర్కోంటున్న తెలంగాణ ఎమ్మెల్యేలకు అనర్హత వేటు భయం పట్టుకుంది. 2018అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికైన పలువురు అధికార బీఆరెస్ పార్టీ ఎమ్మెల్యేలపై కోర్టులో దాఖలైన అనర్హత పిటిషన్ల విచారణ తుది దశకు చేరుతుండటంతో కోర్టు తీర్పులు ఎట్లా వస్తాయేమోనన్న భయం వారిని వెన్నాడుతుంది.
తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావును హైకోర్టు ఎన్నికైన 2018 డిసెంబర్ 12నుంచే ఎమ్మెల్యేగా అనర్హుడంటు, ఆయన స్థానంలో ఎమ్మెల్యేగా రెండో స్థానంలో ఉన్న జలగం వెంకట్రావును పరిగణించాలంటు ఆదేశించింది. ఈ సందర్భంగా ఈ తరహా అక్రమం సాగనివ్వబోమంటు హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తక్షణమే తీర్పు అమలులోకి వస్తుందని పేర్కోంది.
ఈ నేపధ్యంలో అనర్హత వివాదాలు ఎదుర్కోంటున్న ఇతర ఎమ్మెల్యేలు కూడా తమ భవిష్యత్తు ఏమిటన్నదానిపై లోలోన తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారిలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కూడా ఉన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలంటు రాఘవేందర్ రాజు వేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసు విషయాలు మీడియాకు వెల్లడించవద్దంటు మంత్రిని ఆదేశించింది.
తదుపరి విచారణ ఆగస్టు 7వ తేదికి వాయిదా వేసింది. పిటిషనర్ రాఘవేందర్‌రాజును తన వద్ద ఉన్న వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కాగా మంత్రి గత వారం తనపై వేసిన అనర్హత పిటిషన్‌ను కొట్టివేయాలని హైకోర్టు ను కోరగా ఆయన అభ్యర్థన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఈ నేపధ్యంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కూడా అనర్హత వేటు ముప్పు పొంచివుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై పౌరసత్వ వివాదంతో సాగుతున్న అనర్హత కేసు తుది దశలో ఉంది. ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటింగ్ లో అక్రమాలతో నెగ్గారన్న దానిపై కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వేసిన అనర్హత పిటిషన్ విచారణ సైతం కీలక దశలో ఉంది. ఇప్పటికే జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తనపై ఉన్న కేసులను దాచి తప్పుడు ఎన్నికల అఫిడవిట్ సమర్పించిన కేసులో కాంగ్రెస్ అభ్యర్ధి కె.మదన్‌మోహన్‌రావు వేసిన వేసిన అనర్హత పిటిషన్ సైతం విచారణ కొనసాగుతుంది.
ఈ పిటిషన్‌ను సవాల్ చేస్తు సుప్రీంకోర్టులో ఎంపీ పాటిల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈ జూలై 24న సుప్రీంకోర్టు కొట్టివేయడం గమనార్హం. దీంతో ఈ కేసులో కూడా ఎంపీ ప్రతికూల పరిస్థితి కనిపిస్తుంది. పాటిల్ పిటిషన్ కొట్టి వేసిన సందర్భంగా ప్రజాప్రతినిధులంతా విధిగా చిన్నా, పెద్ద కేసుల వివరాలన్ని ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరుచాల్సిందేనంటు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజాగా బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల చెల్లదంటు పిటిషన్ వేయనుండటంతో అనర్హత కేసుల ఎదుర్కోంటున్న బీఆరెస్ ఎమ్మెల్యేల జాబితా మరింత పెరుగనుంది.