Site icon vidhaatha

Tellam Venkatrao | బీఆరెస్‌లో.. తిరిగి చేరిన మాజీ ఎమ్మెల్యే తెల్లం

Tellam Venkatrao |

విధాత: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెంట కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి బీఆరెస్‌లో చేరారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ల సమక్షంలో బీఆరెస్‌లో చేరారు. కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగడ మంటే కుక్క తోకను పట్టుకొని గోదారిని ఈదడం లాంటిదనే విషయం మన వెంకట్రావు గారికి నెల రోజుల్లోనే అర్థమైందన్నారు. పార్టీలో తిరిగి చేరుతున్నందుకు ఆయనకు అభినందనలని, ఆయనతో పాటు ఆయన ద్వారా చేరిన పార్టీ నాయకుల రాజకీయ భవిష్యత్తును పార్టీ చూసుకుంటుందన్నారు.

ఒకప్పుడు కొమురం భీం కోరుకున్న జల్, జంగల్, జమీన్ నినాదం స్ఫూర్తిని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందన్నారు. ఒక్క వర్షాకాలంలోనే కోటి ఎకరాల జమీన్ లో పంటను తెలంగాణ ఈరోజు సాగు చేస్తుందన్నారు. తెలంగాణ మొత్తంగా భూమాత పచ్చ చీర కట్టుకున్నదా అన్న తీరుగా పంటలు పండిస్తున్నది మన రైతాంగం అన్నారు. ఒకప్పుడు మనం అనుకునే తెలంగాణ కోటి రతనాలవీణ… ఈరోజు కోటి ఎకరాల మాగానంగా సీఎం కేసీఆర్ కృషితోనే మారిందన్నారు.

ఒకప్పుడు మంచం పట్టిన మన్యం అనే వార్తలు వస్తుండేనని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉన్నదా అని, ఇంటింటికి నీరు ఇవ్వాలన్న లక్ష్యాన్ని సాధించిన ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథతో కేంద్రం జల్‌జీవన్ మిషన్ తెచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలిత చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలో గోదావరి అవతల ఉన్న ప్రాంతాల్లో పోడు భూములకు పట్టాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా అని ప్రశ్నించారు.

తెలంగాణలో నాలుగు లక్షల 50 వేలు ఎకరాల పోడు భూమి పట్టాలు ఇచ్చినట్లు ఛత్తీస్ ఘడ్‌లో ఎందుకివ్వలేదని, అక్కడ రైతుబీమీ, 24గంటల ఉచిత విద్యుత్తు ఎందుకు లేదన్నారు. పండించిన పంట మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వం కొంటె మరి కాంగ్రెస్ చత్తీస్ ఘడ్‌లో ఎందుకు కొనడం లేదన్నారు.

కాంగ్రెస్ పాలిత చత్తీస్ ఘడ్‌ నుంచి రైతులు తెలంగాణకు వచ్చి తమ పంటను అమ్ముకుంటున్నారు. మరి రైతులకు సహాయం చేయని కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలన్నారు. కమ్యూనిస్టులు, నక్సలైట్లు ఒకప్పుడు చెప్పిన సామ్యవాద స్థాపన ఇప్పుడు జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న సంపద, సృష్టించబడుతున్న సంపద అంతా పట్టణాలు, పల్లెలల అంతరం లేకుండా పెరుగుతున్నదన్నారు. సమాజంలోని అందరికీ అనేక సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.

60 ఏళ్లు అధికారంలో ఉండి 200 పెన్షన్ ఇచ్చినాడని, ఈరోజు నాలుగు వేలు ఇస్తా అంటే ఎట్ల నమ్మాలన్నారు. అధికారంలోకి రాలేనోడు 4000 కాదు 40 వేలు ఇస్తాం అన్న ప్రజలు నమ్మరన్నారు. పేద, బిక్కి, చిన్న సన్నకారు రైతులకు మూడు గంటల కంటే ఎక్కువ కరెంటు వద్దన్న పీసీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారన్నారు. పేద రైతులకు సంక్షేమ పథకాలు ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అవసరమా ఆలోచించాలి అన్నారు.

కాంగ్రెస్ నాయకులు కూడా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు పొందుతున్నారన్నారు. గిరిజనులకి 10% రిజర్వేషన్ పెంచిన ప్రభుత్వం మాదేనన్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చి, గిరిజనులకు పంచాయతీలు ఏర్పాటు చేసి స్వయం పాలన అధికారం ఇచ్చి, రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.

యాదాద్రి స్థాయికి తగ్గకుండా భద్రాద్రి రామాలయ అభివృద్ధిని మన సీఎం కేసీఆర్‌ చేస్తారని, ఖచ్చితంగా ఆ బాధ్యత మేమే తీసుకుంటామన్నారు. తిరిగి అధికారంలోకి రాగానే భద్రాద్రి రాముడి గుడిని అద్భుతంగా పునర్నిర్మిస్తామని, ఎవరికీ అనుమానాలు అవసరం లేదన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ మాట్లాడుతు సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేశారన్నారు.

అభివృద్ధి చేసిన ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన బాధ్యత ఖమ్మం జిల్లా ప్రజల పైన ఉన్నదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజనులకు లక్షన్నర ఎకరాల పట్టాలు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్‌ అన్నారు. పార్టీ ద్వారా పెద్దవాళ్లయి పార్టీకి ద్రోహం చేసిన కొంతమంది నాయకులు, సీఎం కేసీఆర్‌పైన, కేటీఆర్ పైన విమర్శలు చేస్తున్నారన్నారు. సీఎంను విమర్శించే స్థాయి మీకు లేదు అనే విషయం గుర్తుంచుకోవాలని పరోక్షంగా పొంగులేటిని ఉద్ధేశించి విమర్శించారు.

Exit mobile version