Site icon vidhaatha

Thailand Elections | థాయిలాండ్ ఎన్నిక‌లు.. మూవ్ ఫార్వార్డ్ పార్టీ విజ‌యం..!

Thailand Elections | థాయిలాండ్ ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష పార్టీలు భారీ విజ‌యం సాధించాయి. ప‌దేండ్ల క‌న్జ‌ర్వేటివ్, ఆర్మీ పాల‌న‌కు థాయిలాండ్ ప్ర‌జ‌లు చ‌మ‌ర‌గీతం పాడారు. మూవ్ ఫార్వార్డ్ పార్టీ, ఫ్యూ థాయ్ పార్టీకి థాయిలాండ్ ప్ర‌జ‌లు భారీ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు.

అయితే ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప‌లువురి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టాల్సి ఉంది. సెనేట్ స‌భ్యుల మ‌ద్ద‌తు త‌ప్ప‌నిస‌రి. మిల‌ట‌రీ పార్టీల స‌హ‌కారం కూడా అవ‌స‌రం. వీరి మ‌ద్ద‌తుతోనే ప్ర‌ధాని కాగ‌ల‌రు. అనంత‌రం త‌మ ప‌రిపాల‌న‌ను ప్ర‌ధాని కొనసాగించే అవ‌కాశం ఉంటుంది. అయితే ఏ పార్టీకి వీరి మ‌ద్ద‌తు ఉంటుంద‌నేది తేలాల్సి ఉంది. యువ ఓట‌ర్ల నుంచి లిబ‌ర‌ల్ మూవ్ ఫార్వార్డ్ పార్టీకి పూర్తిస్థాయి మ‌ద్ద‌తు ల‌భించింది. థాయిలాండ్ రాజ‌ధాని బ్యాంకాక్‌లో కూడా క్లీన్ స్వీప్ చేసింది.

ఈ సంద‌ర్భంగా లిబ‌ర‌ల్ మూవ్ ఫార్వార్డ్ పార్టీ ప్ర‌ధాని అభ్య‌ర్థి.. మూవ్ ఫార్వార్డ్ లీడ‌ర్ పీటా లిమ్జారోయెన్‌రాట్‌(42) మాట్లాడుతూ.. తాము త‌ప్ప‌కుండా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఇది సంచ‌ల‌న తీర్పు అని పేర్కొన్నారు. మిల‌ట‌రీ పాల‌న‌కు ప్ర‌జ‌లు చ‌మ‌ర‌గీతం పాడార‌ని తెలిపారు. ఫ్యూ థాయ్‌తో తాము పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు.

పాపులిస్ట్ ఫ్యూ థాయ్ పార్టీ కూడా ప్ర‌ధాని ప‌ద‌వికి పోటీ ప‌డుతోంది. ఆ పార్టీ ప్ర‌ధాని అభ్య‌ర్థి షేటోంగ్టార్న్ సిన‌వ‌త్రా కూడా బ‌రిలో ఉన్నారు. ఈ పార్టీ కూడా థాయ్ ఎన్నిక‌ల్లో మంచి మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టుకుంది. 2001 నుంచి 2006 వ‌ర‌కు త‌క్షిన్ సిన‌వ‌త్రా ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

త‌క్షిన్ సిన‌వ‌త్రానే ఫ్యూ థాయ్ పార్టీ అధ్య‌క్షుడు. 2006 నుంచి 2014 వ‌ర‌కు ఆయ‌న సోదారి ఇంగ్లాక్ షిన‌వ‌త్రా ప్ర‌ధాని ప‌ద‌విలో కొన‌సాగారు. త‌క్షిన్‌, ఇంగ్లాక్ థాయ్ సైన్యం నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కోవ‌డంతో ప‌ద‌వి నుంచి దిగిపోవాల్సి వ‌చ్చింది. త‌ద‌నంత‌రం ద‌శాబ్ద కాలం పాటు థాయ్‌లో ఆర్మీ పాల‌న కొన‌సాగింది.

Exit mobile version