Site icon vidhaatha

Santhosh Kumar | బీఆర్ఎస్‌ను వీడనున్న సంతోష్ కుమార్

Santhosh Kumar | విధాత బ్యూరో, కరీంనగర్: శాసనమండలి మాజీ సభ్యుడు తిరువరంగం సంతోష్ కుమార్ గులాబీ గూటిని వీడనున్నారు. పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. బుధవారం విలేకరులకు ఆయన ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

కరీంనగర్ కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరించిన సంతోష్ కుమార్.. 2018లో అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శాసనమండలిలో ఆయనతోపాటు మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అధికార పార్టీలో చేరారు. దీంతో శాసనమండలిలో ఆ పార్టీ గుర్తింపును రద్దు చేస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

అధికార పార్టీలో చేరిన సంతోష్ కుమార్ ఎమ్మెల్సీ కానీ, మరి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ వస్తుందని ఆశించారు. అయితే చేరిన నాటినుండి అధికార పార్టీలో ఆయనకు ప్రాధాన్యత లేకుండా పోయింది. దీంతో గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న సంతోష్ కుమార్, ఎమ్మెల్యేల టికెట్లు ఖరారు కాగానే తన దారి తాను చూసుకునేందుకు సిద్ధమయ్యారు.

జిల్లాలోని బీసీ, మైనార్టీ ఓటర్లలో గట్టిపట్టున్న సంతోష్ కుమార్ పార్టీ మారితే కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు నష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆయన కరీంనగర్ శాసనసభ స్థానం నుండి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.

Exit mobile version