Manjeera | మంజీరా పుష్కరాలకు.. వేళాయే! ఎక్కడ తవ్వినా విభూదే!

Manjeera ఈనెల 22నుంచి గ‌రుడ‌గంగా పుష్క‌రం ప్రారంభం 12రోజుల పాటు కొన‌సాగనున్న వేడుక‌లు పేరూరు శివారులోని స‌రస్వ‌తీ దేవాల‌యం వ‌ద్ద ఏర్పాట్లు 20011లో ఉద్యమ నేతగా సీఎం కేసీఆర్ సమక్షంలో ప్రారంభం సందడి చేయనున్న సాధుసంతులు, నాగసాధువులు విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: మెదక్‌ జిల్లా పేరూరు సమీపంలో.. గరుడ గంగా తీరాన 12 రోజుల పాటు జరిగే మంజీరా(Manjeera) నది పుష్కరాలకు తెలంగాణతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. […]

  • Publish Date - April 21, 2023 / 03:59 PM IST

Manjeera

  • ఈనెల 22నుంచి గ‌రుడ‌గంగా పుష్క‌రం ప్రారంభం
  • 12రోజుల పాటు కొన‌సాగనున్న వేడుక‌లు
  • పేరూరు శివారులోని స‌రస్వ‌తీ దేవాల‌యం వ‌ద్ద ఏర్పాట్లు
  • 20011లో ఉద్యమ నేతగా సీఎం కేసీఆర్ సమక్షంలో ప్రారంభం
  • సందడి చేయనున్న సాధుసంతులు, నాగసాధువులు

విధాత‌, మెద‌క్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి: మెదక్‌ జిల్లా పేరూరు సమీపంలో.. గరుడ గంగా తీరాన 12 రోజుల పాటు జరిగే మంజీరా(Manjeera) నది పుష్కరాలకు తెలంగాణతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. భక్తుల సౌకర్యార్ధం చలువ పందిళ్లు, మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

దేశంలో నదులను కూడా దైవంగా కొలుస్తారు. సాగు తాగునీరందించే నదికి పూజలు చేయడంతో పాటు.. పన్నెండేళ్ల కోసారి ఘనంగా పుష్కరాలను నిర్వహిస్తారు. ఇప్పుడు మంజీరా వంతు వచ్చింది. ఏప్రిల్ 22 నుంచి మంజీర నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. మే 3 వరకు కొనసాగుతాయి. మెదక్‌ జిల్లా మెదక్‌ మండలం పేరూర్‌ గ్రామ శివారులోని మంజీరా తీరంలో 2011లో తొలిసారి పుష్కరాలు నిర్వహించారు.

అప్పట్లో ప్రస్తుత రాష్ట్ర కేసీఆర్‌ పుష్కరాలను ప్రారంభించారు. ఆ తర్వాత మళ్లీ పన్నెండేళ్ల తర్వాత ..మళ్లీ పుష్కరాలు వచ్చాయి. శనివారం నుంచి.. పేరూర్ గ్రామం మంజీరా(Manjeera) నది ఒడ్డున పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాల సమయంలో మంజీరా నదిలో స్నానం చేస్తే.. సకల పాపాలో తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు మంజీరా తీరంలో ఎక్కడ తవ్వినా..విభూది బయటపడుతుందట. ఆ కథేంటే తెలుసుకుందాం.

పుష్కర పురాణం

మెడక్ జిల్లా పేరూరు గ్రామ శివారులో మంజీరా నది ఒడ్డున సరస్వతీ ఆలయం ఉంది. ఒకప్పుడు ఇది దట్టమైన అరణ్యం. పరీక్షిత్‌ అనే మహారాజు ఆ అడవిలోకి వేటకు వెళ్లాడట. మార్గంమధ్యలో దాహం వేయడంతో ఓ కొలను వద్దకు వెళ్లి నీరు తాడు. దాని పక్కనే శృంగి మహాముని తపస్సులో ఉన్నాడు. ఆయన్ను గమనించిన మహారాజుకు.. తనను చూసినా కూడా పలకరించడం లేదని కోపం వచ్చింది.

పక్కనే చనిపోయి ఉన్న పామును తీసి.. ఆ మహాముని మెడలో వేసి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత ముని కుమారుడు శనీక మహాముని వచ్చి.. తన తండ్రిలో చనిపోయిన పామును వేసిన వారు.. పాము కాటుతో చనిపోతారని శాపం పెట్టారట. అలా పరిక్షీత్ మహారాజు పాముకాటులో మరణిస్తాడు. తన తండ్రిని చంపిన పాములపై పరీక్షితుడి కుమారుడ జనమేజయుడు పగను పెంచుకుంటాడు.

అన్ని పాములనూ చంపేస్తానని ఈ ప్రాంతంలో సర్పయాగం చేస్తాడు. ఆ యాగంలో పడి పాములు చనిపోతుంటాయి. తమను కాపాడాలని ఇతర పాములు బ్రహ్మదేవుడిని వేడుకోగా.. ఆయన గరుడపక్షిని పంపిస్తారు. ఆ గరుడ పక్షిని పిలిచి పాతాళంలోని నీటినిని తెచ్చి యాగాన్ని చల్లార్చిందట. ఆ ప్రాంతమే ఇప్పుడున్న మంజీరా నది. దీనిని పూర్వకాలంలో గరుడ గంగా పిలిచేవారు. ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఎక్కడ మూడు అడుగులు తవ్వినా… తెల్లటి విభూతి బయట పడుతుంది. ఆ నాటి సర్పాల అవశేషాలే ఈ విభూతి అని స్థానికులు విశ్వసిస్తారు.

గ‌రుడ గంగ‌గా మంజీరా

మంజీర(Manjeera) నదిని గరుడ గంగ అని కూడా పిలుస్తారు. ఈ నది మహారాష్ట్రలో ఎత్తైన బాలాఘాట్ ప్రాంతంలో పుట్టి ఉస్మానాబాద్ జిల్లా మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా గుండా ప్రవహించి సంగారెడ్డి జిల్లా గోడ్గావ్ వద్ద తెలంగాణలోకి అడుగిడుతుంది. సంగారెడ్డి, మెదక్ జిల్లా ల మీదుగా పరుగులిడుతూ వచ్చి నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల వద్ద కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం, బిచ్కుంద, మద్నూర్, బాన్సువాడ, బీర్కూర్ మండలాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి, బోధన్, రెంజల్ మండలాల మీదుగా ప్రవహించి, కందకుర్తి వద్ద గోదావరిలో ఐక్యమవుతుంది. మొత్తంగా నది ప్రయాణం 724 కిలోమీటర్లు. మంజీర నది 823 మీటర్ల ఎత్తున మొదలై కందకుర్తి వద్ద 323 మీటర్లకు దిగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు వంద కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. నది పొడవునా అనేక గ్రామాలు, పట్టణాలున్నాయి. ఎన్నో ఆలయాలు వెలిశాయి.

2011లో తొలి పుష్కరాలు

పేరూరు శివారులోని మంజీరానది ప్రాంతంలో 2011లో ప్రస్తుతం సీఎం కేసీఆర్, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి చేతుల మీదుగా తొలిసారి పుష్కరాన్ని ప్రారంభించారు. 12 ఏళ్ల అనంతరం మళ్లీ ఈనెల 22 నుంచి మే 3వ తేదీ వరకు 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగనున్నాయి.

నేటి నుంచే పుష్కారాలు..

ఉత్తర భారతంలో విశాలంగా ప్రవహించే గంగానది పుష్కరాలతో పాటే మంజీర పుష్కరాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈనెల 22వ తేదీన ప్రారంభమయ్యే పుష్కరాలు.. వచ్చేనెల 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కాగా 2011లో మంజీర తీర ప్రాంత ప్రజలు పుష్కరాలు జరుపుకున్నారు. సమైక్య రాష్ట్రంలో పాలకులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో అప్పట్లో సరైన ఏర్పాట్లు చేయలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాకా అదే నిర్లక్ష్యం కొనసాగుతుండడం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. ఈనెల 22 నుంచి పుష్కరాలు ప్రారంభం కానుండగా.. దాని గురించిన ప్రచారం కూడా చేపట్టలేదు. అధికారుల నిర్లక్ష్యంతో మంజీర నదికి పుష్కరాలు వచ్చాయన్న విషయం కూడా ఈ ప్రాంత ప్రజలకు తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లా న్యలకల్ గ్రామ శివారులో నీ మంజీర వద్ద అక్కడి అధికారులు పుష్కరాలకు అధికారికంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

భక్తులకు సౌకర్యాల ఏర్పాట్లు

మంజీరా నది పుష్కరాలు 22 నుంచి మే 3 వరకూ జరగనున్నాయి. కాగా, ఇదే సమయంలో సంగారెడ్డి జిల్లా న్యాలకల్ మండలం రాఘవపూర్-హుమ్నపూర్ గ్రామాల శివారులోని గరుడ గంగ పూర్ణ మంజీర కుంభమేళా 24 నుంచి మే 5 వరకూ జరగనుంది. భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 24, 25, 27, 30 తేదీల్లో పుణ్య స్నానాలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు.

12 రోజులపాటు జరిగే మంజీరా నది పుష్కరాలకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. వీరి కోసం చలువ పందిళ్లు, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, బాతురూములు, మరుగుదొడ్లు, ఏర్పాటుతో పాటు పుష్కరాలు పూర్తయ్యేవరకు అన్నదాన కార్యక్రమం జరగనుంది.

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం రాఘవపూర్‌-హుమ్నపూర్‌ గ్రామాల శివారులోని గరుడ గంగ పూర్ణ మంజీర నది కుంభమేళా ఈ నెల 24 నుంచి మే 5వ తేదీ వరకు జరగనున్నది. స్థానిక సిద్ధ సర్వస్వతీదేవి పంచవటి క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌బాబా ఆధ్వర్యంలో కుంభమేళాను నిర్వహిస్తున్నారు.ఈ నదికి మొదటి సారి పంచవటి క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌బాబా ఆధ్వర్యంలో 2010లో కుంభమేళా నిర్వహించారు. ఆ తర్వాత 2013, 2018లో కాశీనాథ్‌బాబా ఆధ్వర్యంలో కుంభమేళా నిర్వహించారు.

మంజీర నదిలోని విభూతి గుండం

పుష్కరాల‌కు నాగ‌సాధువులు

సంగారెడ్డి జిల్లాలో మంజీర నది తీరంలోనే గంగామాత అలయంతోపాటు రెండు కిలోమీటర్ల దూరంలోని పంచవటీ క్షేత్రంలో సిద్ధ సరస్వతీదేవి, షిరిడీ సాయిబాబా, సూర్యభగవాన్‌, భూదేవి, శ్రీదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాలతోపాటు ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలను నిర్మించారు. నాలుగోసారి గరుడ గంగ పూర్ణ మంజీర నదికి కుంభమేళాను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

సాధుసంతులు, అఘోరాలు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. 12 రోజలపాటు జరిగే కుంభమేళాకు ఉత్తర భారతదేశం నుంచి నాగసాధులు, దిగంబరసాధుసంతులు పెద్దఎత్తున తరలిరానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు.

పోలీస్‌ బందోబస్తు.. ఆర్టీసీ ఏర్పాట్లు

మంజీరా(Manjeera) కుంభమేళాకు భారీగా భక్తులు తరలి రానుండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ రమణకుమార్‌ ఆధ్వర్యంలో జహీరాబాద్‌ డీఎస్పీ రఘు పర్యవేక్షణలో భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి, పలుచోట్ల సీసీ కెమెరాలు బిగించి పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ సంగారెడ్డి ఆర్‌ఎం సుదర్శన్‌ ఆధ్వర్యంలో జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ డిపోలతో పాటు జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేశారు.

భారీగా ఏర్పాట్లు..

కుంభమేళాకు వచ్చే సాధుసంతులు, భక్తులకు అన్నదానం చేసేందుకు ప్రత్యేక షెడ్లను సిద్ధం చేశారు. నాగసాధుసంతులు, భక్తుల కోసం ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా స్నాన ఘట్టాలు, తాత్కాలిక మూత్రశాలలు, మరుగుదొడ్లు, బట్టలు మార్చుకొనేందుకు షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. నదీతీరంలో పోలీసులు, గజ ఈతగాళ్లు, వలంటీర్లు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు.

భక్తులకు తాగునీటి సరఫరా కోసం ఆర్‌డబ్ల్యూఎస్‌, మిషన్‌ భగీరథ గ్రిడ్‌ అధికారులు ప్రత్యేక నల్లాలు బిగిస్తున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి, పలుచోట్ల సీసీ కెమెరాలు బిగించి పర్యవేక్షించేం దుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జహీరాబాద్‌, నారాయణఖేడ్‌ డిపోలతోపాటు జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపేలా ఏర్పాట్లు చేశారు.

భ‌క్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

మెదక్‌ జిల్లా పేరూరు సమీపంలో.. గరుడ గంగా తీరాన 12 రోజుల పాటు జరిగే మంజీరా నది పుష్కరాలకు తెలంగాణతో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. భక్తుల సౌకర్యార్ధం చలువ పందిళ్లు, మహిళలు బట్టలు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

12 రోజుల పాటు పుష్కరాలు పూర్తయ్యేవరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సరస్వతీ దేవాలయ వ్యవస్థాపకులు దోర్బల రాజమౌళి శర్మ తెలిపారు. ఎండాకాలం నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

– సరస్వతీ దేవాలయ వ్యవస్థాపకులు రాజమౌళి శర్మ

పుష్క‌ర‌ స్నానం పునీతం

లోక కల్యాణం కోసమే గురుడ గంగ పూర్ణ మంజీర కుంభమేళాను నిర్వహిస్తున్నాం. గంగానదికి కర్కాటక రాశిలో గురుడు ఉండగా చేసే స్నానం, సింహ రాశిలో గురుడు ఉండగా వేయిసార్లు స్నానం చేస్తే ఏ ఫలమో, కన్యా రాశిలో గురుడు ఉండగా కృష్ణా నదిలో వందసార్లు స్నానం చేస్తే ఏ ఫలం వస్తుందో.. మేష రాశిలో సూర్యుడు ఉండగా మంజీర(Manjeera) నదిలో ఒక్కసారి స్నానం చేసినా అంత ఫలం లభిస్తుంది.

ఈ కుంభమేళాలో భాగంగా ఈ నెల 24, 25, 27, 30, మే 4, 5వ తేదీల్లో మంజీర నదిలో పుణ్యస్నానాలు చేస్తే అంత పుణ్యఫలం లభిస్తుంది.కాగా మెదక్ జిల్లాలో అధికారికంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలేదు. సంగారెడ్డి జిల్లా లో మాత్రం మంత్రి హరీష్ రావు ఆదేశాలమేరకు మంజీర తీరాన ఏర్పాట్లు చేస్తున్నారు.

– కాశీనాథ్‌బాబా, సిద్ధ సరస్వతీదేవి పంచవటి క్షేత్ర పీఠాధిపతి, రాఘవపూర్‌