Site icon vidhaatha

రేపు ఎల్బీ స్టేడియం ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ రెండో ముఖ్య‌మంత్రిగా పాల‌మూరు ముద్దుబిడ్డ‌, కొడంగ‌ల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎల్బీ స్టేడియం వేదిక‌గా మ‌ధ్యాహ్నం 1:04 గంట‌ల‌కు రేవంత్ సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఏర్పాట్లు చురుగ్గా కొన‌సాగుతున్నాయి. ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం ఏర్పాట్ల‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ఇంచార్జి డీజీపీ ర‌విగుప్తాతో పాటు హైద‌రాబాద్ సీపీ సందీప్ శాండిల్య ప‌రిశీలించారు.


సీఎం ప్ర‌మాణ‌స్వీకారం నేప‌థ్యంలో ఎల్బీ స్టేడియం ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించిన‌ట్లు డీజీపీ తెలిపారు. గురువారం ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పేర్కొన్నారు. ప‌బ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను నాంప‌ల్లి వైపు మ‌ళ్లించ‌నున్నారు. ఎస్బీఐ గ‌న్‌ఫౌండ్రి నుంచి వ‌చ్చే వాహ‌నాల‌ను చాపెల్ రోడ్డు వైపు, బ‌షీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను కింగ్ కోఠి వైపు, ఖాన్ ల‌తీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను నాంప‌ల్లి వైపు మ‌ళ్లించ‌నున్నారు. ఈ క్ర‌మంలో న‌గ‌ర‌వాసులు, వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ దారుల‌ను ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు. ఇబ్బందులుంటే 9102033626 నంబ‌ర్‌కు ఫోన్ చేయాల‌ని సూచించారు.

Exit mobile version