Greenland Annexation Bill : గ్రీన్‌లాండ్‌ స్వాధీనం కోసం అమెరికాలో బిల్లు.. ఈ ద్వీపంపై ట్రంప్‌ ఎందుకు కన్నేశారు..?

గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసేందుకు ట్రంప్ టీమ్ అడుగులు వేస్తోంది. దీనికోసం బిల్లు ప్రవేశపెట్టడంతో డెన్మార్క్, గ్రీన్‌లాండ్ తీవ్రంగా స్పందించాయి.

Greenland Annexation Bill

గ్రీన్‌లాండ్‌ (Greenland).. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ పేరును తెగ కలవరిస్తున్నారు. ఈ ద్వీప దేశాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. గ్రీన్‌లాండ్‌పై అమెరికా నియంత్రణ ఉండాలన్న తన ఆకాంక్షను గత కొన్ని రోజులుగా బయటపెడుతూనే ఉన్నారు. ఈ ద్వీపదేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్‌ టీమ్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ప్రణాళికలను రచించాలని అధికారులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. తాజాగా గ్రీన్‌లాండ్‌ స్వాధీనం కోసం వీలుగా ట్రంప్‌ టీమ్‌ ఓ బిల్లును తీసుకురావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీ ఫైన్ ‘గ్రీన్‌లాండ్‌ విలీనం – రాష్ట్ర హోదా’ (Greenlands Annexation And Statehood) పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో విలీనం చేసుకునేలా ట్రంప్‌ చర్యలు చేపట్టేందుకు అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా ప్రత్యర్థులు ఆర్కిటిక్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ప్రయత్నాలను తాము అడ్డుకుంటామన్నారు. ఆర్కిటిక్‌లో రష్యా, చైనాను ఎదుర్కోవడానికి ఈ చర్యలు కీలకమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ ఎందుకు కన్నేశారా..?

వ్యూహాత్మకంగా అమెరికాకు ఎంతో కీలకం

గ్రీన్‌లాండ్‌.. ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపదేశం. జనాభా మాత్రం కేవలం 57 వేలు మాత్రమే. దాదాపు 80 శాతం భూమి మంచుతోనే ఉంటుంది. ఈ ద్వీపం డెన్మార్క్‌ దేశంలో భాగంగా ఉంది. అయితే, ఆర్కిటిక్‌ మహాసముద్రంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ ద్వీపం వ్యూహాత్మకంగా అమెరికాకు చాలా కీలకం. అమెరికా ప్రత్యర్థులు రష్యా, చైనా సైనిక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఈ ప్రాంతం కీలకం‌. వ్యూహాత్మకంగానే కాదు.. ఈ ద్వీపంలో అత్యంత అరుదైన ఖనిజాలు, చమురు, గ్యాస్‌ వనరులు అపారంగా ఉన్నాయి. భవిష్యత్తు ఆర్థిక, సాంకేతిక భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని ఆమెరికా భావిస్తున్నది.

డెన్మార్క్‌, గ్రీన్‌లాండ్‌ డానిష్‌ రాజ్యంలో భాగంగా ఉన్నాయి. ఇవి నాటోకు చెందిన ఉమ్మడి రక్షణ వ్యవస్థ పరిధిలో ఉన్నాయి. నాటో వ్యవస్థాపక సభ్యదేశమైన డెన్మార్క్‌కు 1951లోనే అమెరికాతో రక్షణ ఒప్పందం ఏర్పడింది. గ్రీన్‌లాండ్‌పై అమెరికా సైనిక కార్యకలాపాలు సాగించుకోవచ్చన్నది ఈ ఒప్పందం సారాంశం. అయితే, అనేక కారణాల వల్ల గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవలసిన అవసరం ఉందని ట్రంప్‌ చాలా కాలం నుంచి చెబుతూ వస్తున్నారు. ఇక్కడ అడ్వాన్స్‌డ్‌ మిలిటరీ అప్లికేషన్స్‌ కోసం అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉండటం ఒక కారణమని తెలిపారు.

ఒక్కొక్కరికి లక్ష డాలర్లు..!

గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ట్రంప్‌ యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. డెన్మార్క్‌ నుంచి విడిపోయి, అమెరికాతో కలవాలని ఈ దీవి ప్రజలను ఒప్పించాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు డబ్బును ఎరగా వేస్తున్నారు. సుమారు 57,000 మందికి ఒక్కొక్కరికి 10,000 డాలర్ల నుంచి 1,00,000 డాలర్ల వరకు (సుమారు రూ.8 లక్షల నుంచి రూ.89 లక్షలు) ఇవ్వజూపేందుకు అధికారులు చర్చించినట్లు వార్తలు వచ్చాయి.

అమెరికాతో కలవం..

అయితే, అమెరికాలో కలిసే ప్రసక్తే లేదని అక్కడి లెజిస్లేటర్లు తెగేసి చెబుతున్నారు. డెన్మార్క్‌ నుంచి విడిపోతే ఆర్థిక వ్యయాలతోపాటు అనేక సమస్యలు ఉంటాయని వారు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇండిపెండెన్స్‌ రిఫరెండం కోసం పిలుపు ఇవ్వడం లేదు. మరోవైపు డెన్మార్క్‌ నుంచి విడిపోవడానికి
గ్రీన్‌లాండర్స్‌ ఇష్టపడుతున్నప్పటికీ, అమెరికాతో కలవడానికి మాత్రం నిరాకరిస్తున్నారు.

గ్రీన్‌లాండ్‌ అమ్మకానికి లేదు: డెన్మార్క్‌

గ్రీన్‌లాండ్‌ తమకు కావాలంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై డెన్మార్క్‌ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్‌ తీవ్రంగా స్పందించారు. గ్రీన్‌లాండ్‌ అమ్మకానికి లేదు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ద్వీపదేశం విషయంలో ట్రంప్‌ ఆలోచన అసంబద్ధమైందని వ్యాఖ్యానించారు. డానిష్‌ రాజ్యంలోని ఏ భూభాగాన్ని స్వాధీనం చేసుకునే అధికారం అమెరికాకు లేదని తేల్చి చెప్పారు.

ట్రంప్‌ను భయపెట్టేలా డెన్మార్క్ నిబంధన

గ్రీన్‌లాండ్‌పై కన్నేసిన ట్రంప్‌ను డెన్మార్క్‌ నిబంధన ఒకటి తీవ్రంగా భయపెడుతోంది. అదేంటంటే..? గ్రీన్‌లాండ్‌ని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తే దశాబ్ద కాలంగా సైనిక పాలనలో ఉన్న డానిష్‌ సైనికులు ముందు కాల్పులు జరిపి ఆ తర్వాతే ప్రశ్నలు అడుగుతారు. ఇది డెన్మార్క్‌ చేసిన హెచ్చరిక కాదు.. 1952లో చేసిన నిబంధన. ఎవరైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే ఉత్తర్వుల కోసం ఎదురుచూడకుండా తక్షణమే శత్రు సేనలపై కాల్పులు జరపాలన్నది డానిష్‌ సైనికులకు అమలులో ఉన్న ఆదేశాలు. ఈ నిబంధన ప్రకారం.. దురాక్రమణ జరిగిన సందర్భంలో పైస్థాయి అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. శత్రు సైనికులపైకి డెన్మార్క్‌ సైనికులు ఏమాత్రం ఆలోచించుకోకుండా వెంటనే కాల్పులు ప్రారంభించొచ్చు.

ఇవి కూడా చదవండి :

Love Insurance : బాయ్‌ఫ్రెండ్‌ కోసం లవ్‌ ఇన్సూరెన్స్‌.. జాక్‌పాట్‌ కొట్టిన మహిళ
Gig Workers : భారత్ గిగ్ వర్కర్లకు ఊరట

Latest News