Ectopic pregnancy | వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.. 56 ఏండ్లుగా గర్భంతో మహిళ..!

  • Publish Date - March 24, 2024 / 02:52 AM IST

Ectopic pregnancy : సాధారణంగా జీవి కడుపులో పిండం ఏర్పడి, వృద్ధి చెంది, జన్మించేవరకు గల కాలాన్ని గర్భావధి కాలం అంటారు. ఈ గర్భావధి కాలం ఒక్కో జీవిలో ఒక్కోలా ఉంటుంది. మనిషి గర్భావధి కాలం మాత్రం 9 నెలలు. అత్యంత అరుదుగా మాత్రమే 7, 8 నెలల్లో కూడా ప్రసవాలు జరుగుతాయి. కానీ ఏండ్ల తరబడి ఒక మహిళ గర్భంతో ఉండటం మాత్రం అస్సలు జరగదు. కానీ బ్రెజిల్‌లో మాత్రం ఆ వింత చోటుచేసుకుంది. ఓ మహిళ ఏకంగా 56 ఏండ్లపాటు గర్భంతో ఉంది. ఈ వింత విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్‌కు చెందిన 81 ఏళ్ల వృద్ధురాలు డానియెలా వెరాకు ఈ నెల (మార్చి) తొలి వారంలో కడుపులో నొప్పిగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. ఆమె అల్ట్రాసౌండ్‌ స్కానింగ్ రిపోర్టును పరిశీలించిన వైద్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. డాక్టర్ల ద్వారా విషయం తెలుసుకున్న వృద్ధురాలు కూడా షాకయ్యింది. ఎందుకంటే ఆమె కడుపులో పిండం ఉన్నట్లు తేలింది. దాదాపు 56 ఏండ్ల క్రితమే ఆమె గర్భం దాల్చినట్లు వైద్యు నిపుణులు ధృవీకరించారు. దాంతో ఈ వార్త ప్రపచమంతా వైరల్‌ అవుతోంది.

అయితే ఏళ్లుగా గర్భంతో ఉన్నప్పటికీ డానియెలా వెరాకు తను గర్భం దాల్చిన సంగతి తనకే తెలియలేదు. దాంతో 56 ఏండ్ల క్రితం గర్భం దాల్చిన డానియెలా 81 ఏండ్ల వయసొచ్చినా ప్రసవించలేదు. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆమె కడుపులో పిండం అలాగే ఉండిపోయింది. చాలా ఏళ్ల క్రితమే మృతి చెందిన పిండం కడుపులో అలాగే గడ్డకట్టుకుపోయింది. అయినా ఆమెలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించకపోవడంతో ఆమె తను గర్భం దాల్చిన విషయాన్ని గుర్తించలేకపోయింది.

మార్చి తొలి వారంలో ఆమె పరాగ్వా సరిహద్దు మీదుగా స్వదేశానికి వస్తుండగా కడుపులో నొప్పి రావడంతో వైద్యులను సంప్రతించింది. దాంతో విషయం బయటపడింది. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితి రీత్యా వైద్యులు మార్చి 15న ఆమెకు ఆపరేషన్ చేసి మృత పిండాన్ని తొలగించారు. అయితే, ఆ తర్వాత ఆ వృద్ధురాలు ఇన్‌ఫెక్షన్‌ బారినపడి మరణించడం విషాదకరం.

కాగా, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (Ectopic pregnancy) కలిగిన సందర్భాల్లో ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. గర్భసంచి బయట పిండం పెరిగితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారని చెప్పారు. ఎక్టోపిక్‌ ప్రెగ్నెన్సీ వల్ల పిండం ఎక్కువ కాలం మనలేక మరణించడంతో ఇలా జరుగుతుందని వెల్లడించారు.

Latest News