Osmania: అరుణ తార, నిత్య పోరాట, చైతన్య స్ఫూర్తి.. కామ్రేడ్ జార్జ్ రెడ్డికి నివాళులు

జార్జి రెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం… శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడుదాం. హిందూ పాసిజానికి వ్యతిరేకంగా పోరాడటమే జార్జిరెడ్డికి అర్పించే నివాళి ఓయూలో నిర్వహించిన మార్నింగ్‌ వాక్‌లో పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థులు విధాత: ఉస్మానియా అరుణతార, హైదరాబాద్ చేగువేరా జార్జి రెడ్డి 51 వ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఉదయం 6 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుండి కిన్నెర హాస్టల్ వరకు జార్జి స్మృతిలో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పీడీఎస్‌యూ పూర్వ […]

  • Publish Date - April 14, 2023 / 12:06 PM IST

  • జార్జి రెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం…
  • శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడుదాం.
  • హిందూ పాసిజానికి వ్యతిరేకంగా పోరాడటమే జార్జిరెడ్డికి అర్పించే నివాళి
  • ఓయూలో నిర్వహించిన మార్నింగ్‌ వాక్‌లో పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థులు

విధాత: ఉస్మానియా అరుణతార, హైదరాబాద్ చేగువేరా జార్జి రెడ్డి 51 వ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఉదయం 6 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుండి కిన్నెర హాస్టల్ వరకు జార్జి స్మృతిలో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల రాష్ట్ర కన్వీనర్ ఆర్ గురువారెడ్డి , కో- కన్వీనర్ ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్ తెలిపారు. ఉవ్వెత్తున ఎగిసిన ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి దిక్సూచి కామ్రేడ్ జార్జి రెడ్డి అని వారు తెలియజేశారు.

అతని పుట్టుక సహజమే కానీ అతడి చావు చరిత్ర సృష్టించిందన్నారు. సారవంతమైన తెలంగాణ భూభాగంలో పడ్డ నక్సల్భరి విత్తనమతడు, కులమత దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వ సమాజాన్ని కాంక్షించిన ధీరుడతడని వారు అన్నారు.

జార్జి రెడ్డి న్యూక్లియర్ ఫిజిక్స్ పరిశోధక విద్యార్థి. న్యూక్లియర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. అపారమైన తెలివితేటలు, చైతన్యం, ఉత్సాహం రంగరించుకున్న మహోన్నతమైన మెదస్సు కలిగిన వ్యక్తి. సమాజంలో వర్గ దోపిడిని, అంతమొందించాలనుకున్నాడన్నారు. శ్రీ పురుష సమానత్వం కోరుకున్నారని తెలిపారు.

ఆర్థిక, రాజకీయ, సామాజిక, సమాన‌త్వాన్ని కాంక్షించాడని, కులం, మతం లేని వ్యవస్థను కోరుకున్నారన్నారు. అందుకే ఫ్యూడల్ మతోన్మాద ఆర్‌ఎస్‌ ఎస్‌ ప్రతిఘాతక శక్తులు కుట్రపన్ని ఒంటరివాడిని చేసి క్యాంపస్ ఎన్నికల సందర్భంగా దూల్‌పేట గుండాల సహాయంతో పోలీస్ లు చూస్తుండూగానే 1972 ఏప్రిల్ 14న ఇంజనీరింగ్ కళాశాల’ కిన్నెర హాస్టల్ వద్ద నిరాయుధుడైన జార్జిరెడ్డిని అత్యంత కిరాతకంగా, ముక్క‌లుముక్కలుగా కత్తులతో పొడిచి హత్య చేసి పైశాచికానందం పొందారని తెలిపారు.

మతోన్మాదుల కత్తిపోట్లతో అమ‌రత్వం పొందిన జార్జి రెడ్డి మరణం ప్రగతిశీల విద్యార్థుల్లో వర్గకసిని రేపింది. ఏ లక్ష్యాలైతే నిర్దేశించుకొని ఏ ఆశయాల కొరకు జార్జి పోరాడారో ఆ బాధ్యతలను, ఆశయాలను విద్యార్థులు తమ భుజస్కంధాలపై వేసుకొని ముందుకు తీసుకెళ్ళారన్నారు. జార్జ్ చెప్పిన‘‘జీనా హైతో మర్నా సీఖో కదం కదం పర్ లడ్నా సీఖో’’ అనేది నాడు ఉద్యమ నినాదం అయిందని తెలిపారు.

అందులో భాగంగానే తోటి ఉద్యమ మిత్రుడైన జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నాయకత్వంలో పీ డి ఎస్ యు సంఘంగా రూపాంతరం చెంది రాష్ట్రంలో బలమైన ప్రగతిశీల శక్తిగా ఎదిగిందన్నారు. నేడు దేశంలో పెచ్చురిల్లుతున్న మతోన్మాద మూకదాడులు, హిందూ ఫాసిజనికి వ్యతిరేకంగా పోరాడటమే జార్జి రెడ్డికి మనం అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.

జార్జ్ రెడ్డి స్మృతిలో శుక్రవారం నిర్వహించిన మార్నింగ్ వాక్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల నుండి జార్జ్ రెడ్డి చదివిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ గుండా మరియు ‘డి’ హాస్టల్, ఇంజనీరింగ్ కాలేజీ ల మీదుగా కిన్నెర హాస్టల్ వరకు మార్నింగ్ వాక్ కొనసాగింది. చివరగా కిన్నెర హాస్టల్ వద్ధ జరిగిన సమావేశంలో పూర్వ విద్యార్థుల కమిటీ కన్వీనర్ గురువా రెడ్డి, కో కన్వీనర్ డా కొండా నాగేశ్వర్ లతో పాటు పూర్వ విద్యార్థుల కమిటీ సభ్యులు ప్రో వినయబాబు, ఇ. రఘునందన్, పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థులు ఎం. ప్రకాష్ రావు (ఉపాధ్యాయ దర్శిని ప్రధాన సంపాదకులు), ఆర్టీసీ జేఏసీ నాయకులు గోవర్థన్, అడ్వకేట్ రాఘవేంద్ర ప్రసాద్, అరుణోదయ విమలక్క, పీఓడబ్ల్యు నాయకురాలు ఝాన్సీ, పీవైఎల్‌ ప్రదీప్, చంద్రశేఖర్ లతో పాటు పీడీఎస్‌యూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహేష్, శ్రీకాంత్, విజయ్, పరశురామ్లతో పాటు ఓయూ, పీజీ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Latest News