పొగ‌మంచు కార‌ణంగా ఢీకొన్న వాహ‌నాలు.. ట్ర‌క్కులో ఉన్న కోళ్ల‌ను ఎత్తుకెళ్లిన జ‌నాలు

ఉత్త‌రాదిలో చ‌లి గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. అంతేకాదు ఉత్త‌ర భార‌త‌దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ద‌ట్ట‌మైన పొగ‌మంచు ఏర్ప‌డుతోంది

  • Publish Date - December 28, 2023 / 10:05 AM IST

ల‌క్నో : ఉత్త‌రాదిలో చ‌లి గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. అంతేకాదు ఉత్త‌ర భార‌త‌దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ద‌ట్ట‌మైన పొగ‌మంచు ఏర్ప‌డుతోంది. దీంతో ర‌హ‌దారుల‌పై ప్ర‌మాదాలు అధిక‌మైపోతున్నాయి. పొగ‌మంచు కార‌ణంగా ప‌దుల సంఖ్య‌లో వాహ‌నాలు ఢీకొన‌గా, అందులో కోళ్ల‌తో వెళ్తున్న ట్ర‌క్కు కూడా ఉంది. ఇంకేముంది ఇత‌ర వాహ‌న‌దారులు, స్థానికులు ఆ కోళ్ల‌ను ఎత్తుకెళ్లారు. మ‌రి ఎగ‌బ‌డి అందిన‌కాడికి తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రా జాతీయ ర‌హ‌దారిపై బుధ‌వారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది. కోళ్ల‌ను ఎత్తుకెళ్లిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

ఈ సంద‌ర్భంగా ట్ర‌క్కు డ్రైవ‌ర్ సునీల్ కుమార్ మాట్లాడారు. తాను కోళ్ల‌ను ఆగ్రా నుంచి కాస్‌గంజ్ ప్రాంతానికి ట్ర‌క్కులో తీసుకెళ్తున్నాను. కానీ పొగ‌మంచు కార‌ణంగా విజిబిలిటీ త‌క్కువ‌గా ఉండ‌డంతో మ‌రో ట్ర‌క్కు ఢీకొట్టింది. దీంతో చాలా వాహ‌నాలు ప్ర‌మాదానికి గుర‌య్యాయి. ఇక ట్ర‌క్కులో కోళ్ల‌ను గ‌మ‌నించిన ఇత‌ర వాహ‌న‌దారులు, స్థానికులు వాటిని తీసుకునేందుకు ఎగ‌బ‌డ్డారు. అందిన‌కాడికి దోచుకున్నార‌ని సునీల్ వాపోయాడు. సుమారు 200ల‌కు పైగా కోళ్ల‌ను ఎత్తుకెళ్లార‌ని, రూ. 50 వేల‌కు న‌ష్టం వాటిల్లింద‌ని పేర్కొన్నాడు.

బుధ‌వారం తెల్ల‌వారుజామున ఆగ్రా హైవేపై ప‌లు చోట్ల వాహ‌నాలు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెందారు. మ‌రో 12 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పొగ‌మంచు ద‌ట్టంగా ఏర్ప‌డుతున్న క్ర‌మంలో వాహ‌న‌దారులు నెమ్మ‌దిగా ప్ర‌యాణించాల‌ని పోలీసులు సూచిస్తున్నారు. అవ‌స‌ర‌మైతే తెల్ల‌వారుజామున ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవాల‌ని సూచించారు.