Chhattisgarh
- ఇన్సాస్, 12 బోర్ రైఫిల్ స్వాధీనం
- కొనసాగుతున్న గాలింపు చర్యలు
విధాత: ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ జిల్లాలో భద్రతా సిబ్బంది, మావోయిస్టులకు మధ్య బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ మరణించారు. దంతేవాడ-సుక్మా అంతర్‌జిల్లా సరిహద్దు వెంబడి నాగారం-పోరో హిర్మా జంగిల్స్‌కు సమీపంలో దర్భా విభాగానికి చెందిన నక్సలైట్లు ఉన్నారని సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించారు.
రాష్ట్ర పోలీసు విభాగం జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం అరన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఉదయం ఏడు గంటల ప్రాంతంలో భద్రతా సిబ్బంది, నక్సల్స్ మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.
కాగా.. కాసేపటి తర్వాత కాల్పులు నిలిచిపోయాయి. ఆ తర్వాత భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో వెతకగా, ఇద్దరు మహిళా నక్సలైట్లు విగత జీవులుగా కనిపించారు. సమీపంలోనే ఇన్సాస్ రైఫిల్, ఒక 12 బోర్ రైఫిల్ లభించింది. వాటిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు.