విధాత: ఏ రాజకీయ పార్టీకి అధికారం శాశ్వతం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు తప్ప శత్రువులు ఉండకూడదని చెప్పారు. దుర్భాషలాడే నేతలకు ఓటుతో సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కార్.. ప్రత్యర్థి పార్టీలను కేసుల పేరుతో వేధిస్తున్న నేపథ్యంలో మాజీ కేంద్రమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి, మాజీ ఎంపీ తూళ్ల దేవేందర్ గౌడ్.. రాజ్యసభ, శాసనసభల్లో చేసిన ప్రసంగాల ఆధారంగా రూపొందించిన పుస్తకాల ఆవిష్కరణ సభ బుధవారం హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్యనాయుడు సమకాలీన రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్రమార్జనకు, ప్రత్యర్థులను వేధించడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకోరాదని హితవు పలికారు. అధికారం శాశ్వతం కాదని స్పష్టంచేశారు. రాజకీయాల్లో అధికార, విపక్ష నేతలు ప్రత్యర్థులుగా ఉండాలే గానీ శత్రువులుగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
ద్వేషపూరిత, కుట్రపూరిత రాజకీయాలు వద్దని రాజకీయ నాయకులకు సూచించారు. ప్రజాతీర్పును, ప్రతిపక్షాలను గౌరవించాలని చెప్పారు. కొంతమంది నేతలు నోరు విప్పితే దుర్భాషలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.