Vidhaatha Effect
విధాత, హైదరాబాద్: కొండమడుగు భూ కుంభకోణంను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దారి తప్పిన ధరణి శీర్శికతో ఈ నెల 9వ తేదీన విధాతలో వచ్చిన కథనంపై యాదాద్రి జిల్లా కలెక్టర్ విచారణ చేసి.. బాధ్యులపై చట్టపరమైన చర్యలకు సిద్దమయ్యారు.
ఈ క్రమంలోనే ఢిల్లీ ఆధార్, ఓల్డ్ సిటీ సిమ్ కార్డుతో 10 ఎకరల భూమిని కొల్లగొట్టిన నలుగరు వ్యక్తులపై ఇప్పటికే బీబీ నగర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు కాగా, తాజాగా బీబీ నగర్ మండల తహసీల్దార్ వై.అశోక్ రెడ్డిపై బదిలీ వేటు వేశారు. నకిలీ పత్రాలను కనీసం పరిశీలించకుండానే ధరణిలో ఓ వసంత పేర ఇతరుల భూమిని రిజిస్ట్రేషన్ చేయడంపై జిల్లా కలెక్టర్ తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
విచారణ పూర్తయిన తరువాత తహసీల్దార్ తో పాటు ఈ కుంభకోణంలో భాగస్వామ్యమైన ఉద్యోగులపై చర్యలు ఉంటాయని యాదాద్రి జిల్లా కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి.