విధాత: టాలీవుడ్‌లో నేటి తరం స్టార్ హీరోలు కొందరు విలక్షణ పాత్రలు చేస్తున్నారు కానీ.. నాటి ఎన్టీఆర్ నుండి ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ స్టార్స్ అందరూ విభిన్న పాత్రలను పోషించిన దాఖలాలు తక్కువ. అదే సమయంలో కోలీవుడ్ అంటే తమిళంలో కమలహాసన్, విక్రమ్, సూర్య, కార్తి, ధనుష్, శింబు.. వంటి ఎందరో విలక్షణ నటులు కనిపిస్తారు.
తెలుగువారై ఉండి కూడా ఇక్కడ ఆదరణ లేక తమిళంలో విలక్షణ నటులుగా పేరు తెచ్చుకొని ఇక్కడ అవకాశాలు సాధిస్తున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం తమిళంలోని విలక్షణ నటులలో విజయ్ సేతుపతి ముందు వరుసలో ఉంటారు. తెలుగులో కూడా ఈయన ‘సైరా నరసింహారెడ్డి’, ‘ఉప్పెన’ వంటి చిత్రాలలో అద్భుతంగా నటించారు.
ముఖ్యంగా ‘ఉప్పెన’ చిత్రంలోని పాత్రలో అదరగొట్టారు. అయితే ఇటీవల కాలంలో వరుస చిత్రాలతో బిజీగా ఉంటున్నా.. విజయ్ సేతుపతి తన లుక్ ,బాడీ మెయింటెనెన్స్ విషయంలో మాత్రం అసంతృప్తి పరిచారు. బహుశా పాత్రల వలన లేక సరైన డైట్ లేకపోవడం వలన విజయ్ సేతుపతి ఈమధ్య చాలా బొద్దుగా కనిపిస్తూ వచ్చారు.
లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ మూవీలో విలన్ గా నటించిన విజయ్ సేతుపతిని చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇంట్రో సీన్లో విజయ్ సేతుపతి బేర్ బాడీతో దర్శనమిచ్చాడు. ఒక విలన్ కి ఆ రేంజ్ లో మాస్ ఎంట్రీ సీన్ ఊహించలేం. అయితే విజయ్ సేతుపతికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా లోకేష్ కనకరాజు అంత హైప్ ఇచ్చి ఉంటాడు.
ఆ సీన్ సూపర్ గా ఉన్నా విజయ్ సేతుపతి బాడీ మాత్రం ఆడియన్స్‌ను బాగా ఇబ్బంది పెట్టింది. పెరిగిన పొట్ట కిందకు జారుతూ ఉంటే నడుము మీద మడతలు కాస్త చివుకుమనిపిస్తాయి. ఒక నటుడు అందునా విజయ్‌సేతుపతి వంటి విలక్షణ నటుడు మెయింటైన్ చేయాల్సిన బాడీ కాదు అది. విజయ్ సేతుపతి ఏంటి మరి ఇలా తయారయ్యాడని ఆడియన్స్, ఫ్యాన్స్ చాలా నొచ్చుకున్నారు.
విజయ్ సేతుపతి షేప్ అవుట్ బాడీపై విమర్శలు కూడా వెలువెత్తుతాయి. అయితే అలా విమర్శించిన వాళ్ల నోళ్లకు మాటలతో కాక చేతలతో చెక్ పెట్టి వాళ్ల నోళ్లు మూయించాడు విజయ్ సేతుపతి. సగానికి తగ్గిపోయిన విజయ్ సేతుపతి బాడీ ఇప్పుడు లవర్ బాయ్ టైపులో ఉంది. తాజాగా విడుదలైన ఓ పిక్‌లో ఆయన లుక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది.
విజయ్ సేతుపతి యంగ్ అండ్ స్లిమ్ లుక్ చూసినవారు వావ్ అంటున్నారు. అదే సమయంలో అంత తక్కువ సమయంలో ఇంతలా బరువు తగ్గడం ఎలా సాధ్యమైందని నోళ్లు వెళ్లబెడుతున్నారు. సన్నబడ్డాక విజయ్ సేతుపతి సగం పైగా బరువు తగ్గి ఓ 20 ఏళ్ల వెనక్కి వెళ్లి నట్టుగా కనిపిస్తున్నాడు. పరిశ్రమకు వచ్చిన మొదట్లో ఎలా ఉండేవాడో ప్రస్తుతం ఆయన అలా ఉన్నాడు. మరి దీనికి కారణం తన ఆరోగ్యం కోసమా లేక ఏదైనా పాత్ర కోసమా అనేది తెలియాల్సి ఉంది.
కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసినా.. కూడా 96 చిత్రంలో విజయ్ సేతుపతి లవర్ బాయ్‌గా కనిపించాడు. మరల హీరోగా అలాంటి ప్రయత్నం ఏమైనా చేయనున్నాడా? అని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. ఎంతైనా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో ఏదైనా విజయ్ సేతుపతి పడే కష్టం ఆయన చూపించే ప్రతిభ అందరికీ తెలిసిందే . ఆయన చేతిలో ప్రస్తుతం 10 చిత్రాల వరకు ఉన్నాయి.
బాలీవుడ్ లో కూడా జవాన్, గాంధీటాక్స్, ముంబైకర్, మెర్రీ క్రిస్మస్ చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో సందీప్ కిషన్ నటించిన పాన్ ఇండియా మూవీ మైఖేల్లో ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. ఈయన హీరోగా త్వరలో ఓ తమిళ చిత్రం ప్రారంభం కానుంది. ఇక జవాన్ చిత్రంలో ఆయన షారుక్‌ను ఎదుర్కొనే మెయిన్ విలన్గా నటిస్తున్నాడని తెలుస్తోంది. అట్లీ ఈ క్యారెక్టర్‌ను ఎంతో డిఫరెంట్గా ప్లాన్ చేశాడట. మరి చూద్దాం… రాబోయే రోజుల్లో విజయ్ సేతుపతి మరెంతగా ఆకట్టుకుంటాడో!