Congress
- దుబ్బాక వదిలి సంగారెడ్డి నుంచి పోటీ!
- సందిగ్దంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
- మోదీ సభ తర్వాత భారీగా వలసలు!
- కాంగ్రెస్‌లోకి తీగల, పట్నం ఫ్యామిలీ?
- రాష్ట్రంలో మారుతున్న రాజకీయం
విధాత, హైదరాబాద్ ప్రతినిధి: సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయం వేడుక్కుతున్నది. ఉన్న పార్టీలో ప్రాధాన్యం దక్కని నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. పదవులు కోల్పోయిన, భంగపడిన నాయకులు బాహాటంగా అసంతృప్తిని వెల్లడిస్తూనే.. ఉన్న పార్టీని వీడి మరో పార్టీలో చేరేందుకు దారులు వెతుకుతున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆరెస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ టికెట్‌పై పోటీ చేసినా.. గెలుపు అవకాశాలు లేవని భావిస్తున్న వారిలో కొందరు అధికార బీఆరెస్‌లో చేరుతుండగా, మరికొందరు కాంగ్రెస్లో కర్చీఫ్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.
తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో కమలం పార్టీలో ఎవరు ఉంటారు? ఎవరు వెళ్లిపోతారు? అనే చర్చ హాట్ హాట్‌గా సాగుతున్నది. ఇందులో ప్రధానంగా బండి సంజయ్ వర్గంలో కీలకంగా ఉన్న వివేక్ వెంకట స్వామి, బండి వ్యతిరేక వర్గంలో ఉన్న రఘునంధన్ రావు ప్రాధాన్యం పేరుతో పక్క చూపులు చూస్తున్నట్లు తెలిసింది. మోదీ సభ తర్వాత బీజేపీ నుంచి బీఆరెఎస్, కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు ఉంటాయని ప్రచారం జరుగుతున్నది.
కాంగ్రెస్‌లోకి వివేక్…
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వివేక్ వెంకటస్వామి బండి సంజయ్ గ్రూపులో కీలక నాయకుడు. అయితే బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో పాటు ఈటల రాజేందర్‌కు పార్టీ అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంపై వివేక్ వెంకటస్వామి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారన్న తెలుస్తున్నది.
గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈటల రాజేందర్‌కు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందించిన వివేక్ ఆ డబ్బులను రాబట్టేందుకు ఈటలతో ఘర్షణకు దిగారని కొందరు చెబుతుంటారు. వందేభారత్ రైలు ప్రారంభ సమయంలో సాక్షాత్తు మోదీ సమక్షంలోనే ఈటల, వివేక్ ఘర్షణకు దిగడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది.
ఆ తర్వాత ఈటల వివేక్ అప్పు తీర్చినప్పటికీ.. ఇరువురి మధ్య సఖ్యత మాత్రం లేదని చెబుతున్నారు. తాజాగా ఈటలకు పార్టీలో ప్రాధాన్యం పెరగటాన్ని వివేక్ జీర్ణించుకోలేక పోతున్నారని సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో తన చేరిక విషయమై వివేక్ చర్చించారని తెలుస్తున్నది. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్న వివేక్.. దీనిపై గట్టి హామీ దొరికితే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతున్నది.
బీఆర్ ఎస్‌లోకి రఘునందన్‌రావు?
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు బీఆర్ ఎస్ కండువా కప్పుకొనేందుకు సిద్ధమైనట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ఇటీవల ఢిల్లీ వేదికగా బండి సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన రఘునందన్ రావు అంతే ఘాటుగా అమిత్ షా, జేపీ నడ్డా తదితర నాయకులపై ఫైర్ అయ్యారు.
రఘునందన్ రావు బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నాకనే ఇంతటి ఘాటు వ్యాఖ్యలు చేశారని బండి వర్గం చెబుతున్నది. అయితే రఘునందన్ రావు ప్రస్తుతం దుబ్బాకలో బీజేపీ టికెట్‌పై గెలుపు అసాధ్యం అని భావిస్తున్నట్లు తెలిసింది.
దుబ్బాక నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే అధికార పార్టీ సంకేతాలిచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంగారెడ్డి నుంచి టికెట్ ఇచ్చే పక్షంలో బీఆరెస్‌లో చేరేందుకు సిద్ధమని సమాచారం పంపారని తెలుస్తున్నది. బీఆరెస్ నుంచి గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా పని చేసిన చింత ప్రభాకర్ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో రఘునందన్‌రావు ఈ నియోజకవర్గంపై పడిందనే చర్చ జరుగుతున్నది.
బీజేపీలోని అన్ని గ్రూపులతో సత్సంబంధాలు ఉన్నట్టు చెప్పే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో కొనసాగాలా.. ఇతర పార్టీలో చేరాలా.. అనేది తేల్చుకోలేక పోతున్నట్లు తెలిసింది. పట్నం మహేందర్ రెడ్డి తీరు నచ్చక కాంగ్రెస్‌లో చేరిన విశ్వేశ్వర్ రెడ్డి ఆ తర్వాత మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీజేపీలో చేరారు.
రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో మళ్లీ కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. కానీ పట్నం ఫ్యామిలీ కాంగ్రెస్‌లోకి వస్తే తాను ఇమడం కష్టమని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది.
బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి..
బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పొంగులేటి, జూపల్లి లాంటి నాయకులతో పాటు సుమారు 35 మంది ముఖ్య నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా.. అసంతృప్తుల స్వరం క్రమంగా పెరుగుతున్నది.
టికెట్ ఇస్తే సరే.. లేకపోతే కారు దిగడానికి ఏ మాత్రం ఆలోచించాల్సిన పనిలేదని ఇటీవల తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. తీగల బాటలోనే పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి సునీత మహేందర్ రెడ్డి హస్తం పార్టీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.