Site icon vidhaatha

Wanaparthy | వనపర్తి కాంగ్రెస్‌లో వార్.. చిన్నారెడ్డికి పెరుగుతున్న వ్యతిరేకత

Wanaparthy |

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: వనపర్తి కాంగ్రెస్‌లో వార్ మొదలైంది. మాజీ మంత్రి చిన్నారెడ్డికి రోజురోజుకూ అసమ్మతి పెరుగుతోంది. నియోజకవర్గంలో అగ్రభాగం నాయకులు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. టికెట్ ఇవ్వొద్దని ఇదివరకే టీపీసీసీకి ఫిర్యాదు కూడా చేశారు. నెలరోజులుగా చిన్నారెడ్డికి వ్యతిరేకంగా పార్టీ కార్యక్రమాలు సాగిస్తుండడం.. అసమ్మతికి మరింత ఆజ్యం పోసినట్లయ్యింది.

కాగా.. టికెట్ ఆయనకు ఇస్తే ఓటమి తప్పదని ఆ పార్టీ నాయకులే బాహాటంగా వెల్లడిస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఆయన బయటకు వస్తారని, ఎన్నికల అనంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉండరని ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, కార్యకర్తలను పూర్తిగా విస్మరించారన్న అపవాదును మూటగట్టుకున్నారు.

అధికార బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలపై చిన్నారెడ్డి ఏనాడూ గళమెత్తలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలు వస్తేనే చిన్నారెడ్డి కనిపిస్తారని అంటున్నారు. ఇంతకాలం కనపడని ఆయన ఎన్నికలు వస్తుండడంతో మళ్ళీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారని, ఇన్ని రోజులు కార్యకర్తలు, నాయకులను పట్టించుకోని చిన్నారెడ్డికి టికెట్ ఇస్తే మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు.

అధిష్టానం ఏం సంకేతాలిస్తోంది..

వనపర్తి నియోజకవర్గ కార్యకర్తల అభీష్టం మేరకు టీపీసీసీ కూడా చిన్నారెడ్డిని పక్కన పెట్టే యోచనలో పడినట్లు సమాచారం. మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి ఆయనకు ఆహ్వానం అందలేదు. అయినా ఈ సమావేశానికి హాజరయ్యేందుకు గాంధీ భవన్ వెళ్లారు. తనకు ఎందుకు ఆహ్వానం ఇవ్వలేదని టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎక్కడో తప్పు జరిగిందని నచ్చజెప్పి సమావేశానికి తీసుకెళ్లారు.

ఈ సంఘటనను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డిని పక్కకు పెట్టినట్లు నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అధిష్టానం కావాలనే చిన్నారెడ్డి కి ఆహ్వానం పంపలేదని సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలో చిన్నారెడ్డి గ్రాఫ్ పడిపోయిందని, ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ నష్టపోతుందనే అభిప్రాయంలో టీపీసీసీ ఉందని తెలుస్తోంది.

ప్రమాదంలో రాజకీయ భవిష్యత్తు

ఇక్కడి కాంగ్రెస్ నాయకులు అధికంగా పెద్దమందడి ఎంపీపీ మేఘరెడ్డి కి మద్దతుగా నిలబడ్డారు. మేఘరెడ్డి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి చిన్నారెడ్డికి వర్గపోరు మొదలైంది. మేఘరెడ్డి వనపర్తి నియోజకవర్గంలో బలమైన నాయకునిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ బరిలో ఉంటే గెలుపు తథ్యమని ఇక్కడి కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్న మేఘరెడ్డి ఒక వర్గంగా ఉంటే, చిన్నారెడ్డికి మరో వర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు శివసేన రెడ్డి తలనొప్పిగా మారారు. ఈయన కూడా చిన్నారెడ్డి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఈ రెండు వర్గా లు చిన్నారెడ్డికి వ్యతిరేకంగా పని చేయడంతో ఆయన రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడింది. కానీ ఏఐసీసీ ఆశీస్సులు ఉన్న చిన్నారెడ్డికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ వస్తుందా? లేదా?అనే ఆలోచన లో ఆయన వర్గం నేతలు ఉన్నారు. ఒకవేళ ఆయనకు టికెట్ రాకుంటే, ఇక చిన్నారెడ్డి రాజకీయ భవిష్యత్ కు ఫుల్ స్టాప్ పడినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీనియర్ నేతను వదులుకుని జూనియర్ నేత మేఘరెడ్డిని అక్కున చేర్చుకుంటుందా అనేది త్వరలో తేలనుంది.

Exit mobile version